ఆ వీడియో సీడీతో పీకల్లోతు కష్టాలు!
ఆప్ నేత, మాజీ మంత్రి సందీప్ కుమార్ ఓ మహిళతో గడుపుతున్న సీడీ వెలుగుచూడటం ఢిల్లీలో పెద్ద దుమారమే రేపింది. ఈ వీడియో సీడీని చూసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నైతిక విలువల ఆధారంగా సందీప్ కుమార్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారు. ఇది నైతిక విలువల అంశమే కాకుండా చట్టబద్ధంగానూ నేరపూరిత అంశం కావడంతో సందీప్ కుమార్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెప్తున్నారు.
ఢిల్లీ కేబినెట్ దళిత ముఖమైన సందీప్ కుమార్ ఇన్నాళ్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. సెక్స్ టేప్ స్కాండల్ లో ఆయన దొరికిపోవడంతో మంత్రి పదవికి ఎసరు వచ్చింది. అయితే, మహిళతో రాసలీలలు జరుపుతూ ఈ వీడియోను సందీప్ కుమారే స్వయంగా తీసినట్టు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఆయన చుట్టూ చట్టం ఉచ్చుబిగించే అవకాశముంది. ఐటీ చట్టం సెక్షన్ 67 ప్రకారం ఒకరితో సన్నిహితంగా గడుపుతూ ఆ సంఘటనను చిత్రీకరించడం నేరం. ఇందుకుగాను పోలీసులు కేసు నమోదు చేయవచ్చు. ఈ అశ్లీల వీడియోలో ఉన్న మహిళ స్వయంగా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయకున్నా.. సెక్షన్ 67 ప్రకారం పోలీసులు సమోటోగా కేసు నమోదు చేసే అవకాశముంది. అయితే, ఈ అసభ్యకర సీడీ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు వెల్లడించాల్సిన అవసరముంటుంది. దీనిని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేస్తే.. ఆ వెబ్సైట్ లింక్‌ను సమర్పించాలి. అంతేకాకుండా సీడీపై ఫోరెన్సిక్ పరీక్షలు జరిపి నిర్ధారణ చేయడం తప్పనిసరి.
శిక్ష ఎంత?
ఒకవేళ ఇలాంటి వీడియో అశ్లీలంగా, అసభ్యంగా ఉండి, అందులో లైంగిక చర్య లేకపోతే, నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ. ఐదు లక్షల జరిమానా విధించే అవకాశముంది. ఈ వీడియోలో లైంగిక చర్య కూడా ఉంటే ఐదేళ్ల జైలుశిక్ష, రూ. ఐదులక్షల జరిమానా కోర్టు విధిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తే అందుకుగాను మరో మూడేళ్ల జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించే అవకాశముంటుంది.