అభ్యంతరాలు.. 23వేలు
10వేలకుపైగా వరంగల్ జిల్లాపైనే..
రాష్ట్రంలో జిల్లా 4వ స్థానం
జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలకు ముగిసిన గడువు
కొనసాగుతున్న జిల్లా స్థాయి పరిశీలన ప్రకియ
హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజన ముసాయిదాపై జిల్లా నుంచి మొత్తం 23వేల అభ్యంతరాలు అందాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా 15వేలకు పైగా రాగా.. మిగతావి కలెక్టరేట్లో అధికారులకు, ప్రత్యేక విభాగంలో నేరుగా అందజేశారు. మొత్తం 23వేల అప్పీళ్లలో వరంగల్ జిల్లాపైనే అత్యధికంగా 10వేలకు పైగా రావడం విశేషం. మొత్తం అప్పీళ్లను అధికారులు ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి కలెక్టర్ పరిశీలన అనంతరం మళ్లీ అప్లోడ్ చేస్తున్నారు. ముసాయిదా ప్రకటించిన నాటి నుంచి 30రోజుల గడువు మంగళవారం(20వతేదీ)తో ముగియడంతో అధికారులు కలెక్టరేట్ అప్పీళ్ల స్వీకరణ కార్యక్రమం సాయంత్రం నుంచి ఆపేశారు.
అన్లైన్లో మాత్రం అర్ధరాత్రి వరకు అప్లోడ్ అయ్యాయి. అధికారులకు అందిన మొత్తం అప్పీళ్లలో సుమారు 1500 వరకు వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగతావి ప్రభుత్వానికి పంపుతున్నారు. కలెక్టరేట్లో అందిన వాటిలో అప్పీళ్లలో కాగితాల సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల పరిశీలన, అప్లోడ్ పనులు కొంత ఆలస్యంగా సాగుతున్నాయి. ప్రక్రియ పూర్తి కావడానికి ఒకటి రెండురోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఆన్లైన్ ద్వారా మంగళవారం రాత్రి వరకు అందిన అప్పీళ్ల వివరాలు..
జిల్లా జిల్లాపై డివిజన్‌పై మండలంపై మొత్తం
హన్మకొండ 2476 306 373 3155
జయశంకర్ 1093 57 92 1242
మహబూబాబాద్ 154 673 88 915
వరంగల్ 9388 110 865 10363
===========================================
మొత్తం 13111 1146 1418 15675