పుష్కర ప్రాంతాలను పరిశీలించండి
అర్బన్ జిల్లా ఎస్పీ
గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కర బందోబస్తులో భాగంగా వచ్చిన అధికారులు వారికి అప్పగించిన ప్రాంతాలను పరిశీలించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. అర్బన్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు ఘాట్ల వద్ద వారికి కేటాయించిన ప్రాంతాలను పరిశీలించి సలహాలు, సూచనలు అందజేశారు. తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు. పుష్కరాల సమయంలో ప్రజలకు సేవలందించేందుకు 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పోలీసుశాఖకు అందుబాటులో ఉంచుతామని గుంటూరు కార్యదర్శి జీవీ కుమార్, అసిస్టెంట్ ఎస్వోసీ పి.శ్రీనివాస్ ఎస్పీకి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ డి.కోటేశ్వరరావు, అదనపు ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, బీపీ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.