OCI
-
ఎన్ఆర్ఐ, ఓసీఐల కోసం కొత్త ఫామ్స్.. సులభమైన ఆధార్ ఎన్రోల్మెంట్
ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేట్ ఫామ్‌లు యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి. ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేసారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నమోదు చేసుకోవాలనుంటే.. ఫామ్ 5 (చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్ 6 (చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం ఆధార్ ఫామ్‌లు నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు OCIలను యాడ్ చేశారు. వీరు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండడం తప్పనిసరి. 18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి ఉంటుంది. ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. UIDAI అంతర్జాతీయ నంబర్లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్ నంబర్‌ను అందించినట్లయితే మీ ఆధార్‌కు సంబంధించి SMS/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను అందుకోలేరు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి. -
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?
కెనడాలో ఉంటున్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో విదేశాలలో ఇదేరీతిలో తలదాచుకున్న ఇతర ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కోరింది. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను గుర్తించాలని, వారు భారతదేశానికి తిరిగి రాకుండా వారి విదేశీ పౌరసత్వాన్ని (ఓసిఐ) రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ఏజెన్సీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫలితంగా భారతదేశానికి చెందిన ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందదని, అప్పుడు వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కెనడా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్లో నివసిస్తున్న 11 మందిని గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎనిమిది మంది అనుమానితులు కెనడాలోనే ఉన్నట్లు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జాబితాలో గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్లో హర్విందర్ సంధు అలియాస్ రిండా ఉన్నాడని భావిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ అలియాస్ లాండా, సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునాకే (మూడు రోజుల క్రితం హతమయ్యాడు), అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, రమణదీప్ సింగ్ అలియాస్ రామన్ జడ్జి, చరణ్‌జిత్ సింగ్ అలియాస్ రింకూ బిహాలా, సనావర్ ధిల్లాన్, గుర్పిందర్ సింగ్ అలియాస్ బాబా డల్లా కెనడాలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక అమెరికాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్‌లు ఉన్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న తాజా చర్యలు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులతో విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు భారతదేశంలో ఉద్యమాలు చేపట్టి, యువతను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
వీసాల పునరుద్ధరణ తక్షణం అమల్లోకి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం రద్దు చేసిన వీసాలను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్, టూరిస్టు, మెడికల్ కేటగిరీ మినహా మిగిలిన అన్ని రకాల వీసాలను పునరుద్ధరిస్తారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌ను సందర్శించేందుకు గాను ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(పీఐఓ) కార్డుదారులకు, ఇతర విదేశీయులకు టూరిస్టు వీసా మినహా ఇతర వీసాలు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా విదేశీయులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశ సందర్శనకు కాకుండా వారు వ్యాపారం, సదస్సులు, ఉద్యోగాలు, విద్యాభ్యాసం, పరిశోధనల కోసం ఇండియాకు రావొచ్చు. కరోనా వైరస్ బయటపడడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి జనం రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్‌లాక్‌లో భాగంగా ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. అలాగే వీసాలు, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. అందులో భాగంగా వీసాలను పునరుద్ధరించింది. ఒకవేళ వాటి గడువు తీరిపోతే మళ్లీ వీసాలు పొందవచ్చని కేంద్రం సూచించింది. విదేశీయులు భారత్‌లో వైద్య చికిత్స పొందాలని భావిస్తే మెడికల్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది. -
ఓసీఐ వర్క్ షాప్ సక్సెస్
టెక్సాస్: డల్లాస్‌లో డీఎఫ్డబ్ల్యూలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) వర్క్ షాప్ విజయవంతమైంది. ఇండియన్ అసోసియేషన్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్టీ), డీఎఫ్డబ్ల్యూలోని ప్రవాసభారతీయుల కమ్యునిటీల సహకారంతో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) (హూస్టన్)లో ఆగష్టు20న(శనివారం) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారీ ఎత్తున ప్రవాస భారతీయులు ఈ వర్క్ షాప్‌కు హాజరయ్యారు. కాన్సుల్ ఆర్.డీ. జోషీ, రాకేష్ శర్మ, చంద్రసేన్లు తమ అమూల్యమైన సలహాలను అందించారు. ఈ కార్యక్రమానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను తయ్యబ్ కుందావాలా- ఎక్సిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఎఫ్‌సీ చూసుకున్నారు. ప్రసాద్ తోటకూర-ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్, నరసింహ భక్తుల-ఐఏఎన్టీ సెక్రటరీ, శైలేష్ షా-ఐఏఎన్టీ బోర్డు ఆఫ్ డైరెక్టర్, ముజీబ్ సయ్యద్- నజీం బోర్డు ఆఫ్ డైరెక్టర్, అబిద్ అబేడీ, ఇందు మందాడి, సల్మాన్ ఫర్షోరీ, షబ్నమ్ మోడ్గిల్, సుధీర్ పరీక్, జాక్ గోద్వానీలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేశారు. -
అనవసర నియంత్రణలకు చెల్లు
బ్రిస్బేన్: అనవసరమైన చట్టాలు, నియంత్రణలను తొలగించడం ద్వారా పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరంగా చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాపారాలకు అనుకూలంగా పారదర్శక విధానాలను అమల్లోకి తెస్తున్నామని, ఈ మేరకు భారత్‌లో మార్పును చూడొచ్చని ఆయన తెలిపారు. క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రేలియా ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. ‘గుడ్ గవర్నెన్స్ అన్నది మార్పునకు నాంది. సాధారణ పౌరుల విషయంలోనే కాదు.. వ్యాపారాలకు కూడా ఇది చాలా ముఖ్యం. అనుకూల పరిస్థితులు ఉంటే అవకాశాలను ఉభయతారకమైన భాగస్వామ్యాలుగా మల్చుకోవచ్చు. ఈ దిశగా మేం వ్యాపారాలకు అనుకూలమైన పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చాం. మరిన్ని తెస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంధనం, ఖనిజ సంపద, వ్యవసాయం, ఆహార భద్రత తదితర అంశాల్లో భారత్ పురోగమించడంలో క్వీన్స్‌ల్యాండ్ కీలక భాగస్వామి కాగలదన్నారు. వ్యవసాయోత్పత్తిని మెరుగుపర్చేందుకు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు అవసరమైన పరిశోధనలను ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. అలాగే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీల విషయంలోనూ కలిసి పనిచేయాలని ఆయన తెలిపారు. పర్యాటక రంగంపరంగా కూడా ప్రత్యేకత ఉన్న క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు భారతీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో తయారీకి ఊతమిచ్చే విధంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మోదీ తెలిపారు. 100 స్మార్ట్ సిటీలు, 50 మెట్రో ప్రాజెక్టులు మొదలైన బృహత్తర ప్రాజెక్టులను తలపెట్టినట్లు వివరించారు. వీటిలో పాలుపంచుకోవాలని క్వీన్స్‌ల్యాండ్ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థికంగా, భద్రతాపరంగా సమగ్రమైన బంధం ఉందని, అంతర్జాతీయ వేదికల్లో రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం నెలకొనడానికి ఇది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. జీవీకే, అదానీ గ్రూప్‌లు చేపట్టిన భారీ మైనింగ్ ప్రాజెక్టులకు తోడ్పాటునిచ్చేలా రైలు రవాణాపరమైన మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టనున్నట్లు మోదీతో భేటీలో క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ క్యాంప్‌బెల్ న్యూమన్ హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని గెలిలీ బేసిన్లో భారతీయ కంపెనీలు భారీ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాయి. కార్మైఖేల్ గనిపై అదానీ గ్రూప్ 16.5 బిలియన్ డాలర్లు, అల్ఫా మైన్‌పై జీవీకే గ్రూప్ 6 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నాయి. అదానీ ఆస్ట్రేలియా బొగ్గు ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్... మెల్బోర్న్: భారత ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన 7 బిలియన్ డాలర్ల బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్లాండ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలిచే రైల్వే మౌలికసదుపాయాల పెట్టుబడులకు సైతం ఓకే చెప్పింది.గెలిలీ బేసిన్లో తలపెట్టిన కార్మైఖేల్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు అనుమతి లభించడాన్ని స్వాగతిస్తున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఈ అంశంపై అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా కంట్రీ హెడ్ జయకుమార్ జనక్‌రాజ్ స్పందిస్తూ దీర్ఘకాలంగా కంపెనీ చేస్తున్న కృషికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు. ప్రణాళికలో భాగంగా 2017కల్లా బొగ్గును వెలికితీయగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గెలిలీ బేసిన్లో తలపెట్టిన మూడు ప్రాజెక్ట్‌ల ద్వారా 28,000 మందికి ఉపాధి లభించే అవకాశమున్నట్లు అంచనా. వీటిలో జీవీకే అల్ఫామైన్, క్లైవ్ పామర్ వారతా కోల్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ 11 బిలియన్ టన్నుల థర్మల్ బొగ్గు నిల్వలున్నట్లు అంచానా. కాగా, కార్మైఖేల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎస్బీఐతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పం దాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనిలోభాగంగా ఎస్బీఐ బిలియన్ డాలర్లవరకూ రుణాన్ని ఇవ్వనుంది. ఎస్బీఐతో ఎంవోయూ ఒక మెలురాయికాగా, క్వీన్స్‌లాండ్‌లో ఇది విలువైన పెట్టుబడని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు.