Odd-Even Rule
-
‘సరి-బేసి విధానానికి ఇక సరి’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్య తీవ్రత తగ్గడంతో వాహనాల నియంత్రణకు సరి-బేసి విధానం ఎంతో కాలం అవసరం ఉండబోదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీపావళి అనంతరం దేశ రాజధానిలో కాలుష్య స్ధాయిలు అత్యంత ప్రమాదకరంగా మారడంతో నవంబర్ 4 నుంచి 16 వరకూ సరి-బేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గురునానక్ దేవ్ 550వ జయంతోత్సవాల సందర్భంగా ఈనెల 11, 12 తేదీల్లో సరి-బేసి విధానానికి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కీమ్‌ను తొలిసారి 2016 జనవరి 1-15న మళ్లీ అదే ఏడాది ఏప్రిల్ 15-30 వరకూ అమలు చేశారు. తొలి రెండు ఎడిషన్స్‌లో ఈ రూల్ నుంచి ఆదివారాలకు మినహాయింపు ఇచ్చారు. -
ఢిల్లీలో గుర్రంపై ఎంపీ హల్ చల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనను వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎంపీలు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ ఇటీవల ఉద్దేశ్యపూర్వకంగా ఈ నిబంధనను ఉల్లంఘించగా, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ గుర్రపు స్వారీ చేసి నిరసన తెలియజేశారు. బుధవారం రామ్ ప్రసాద్ గుర్రంపై పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. కాలుష్య రహిత వాహనం (పొల్యూషన్ ఫ్రీ వెహికల్) అని ఇంగ్లీష్ రాసిన బోర్డును గుర్రానికి తగిలించారు. బీజేపీకే చెందిన ఎంపీ, నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఇటీవల సరి-బేసి నిబంధనను ఉల్లంఘించారు. ఆప్ సర్కార్ రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందని ఎంపీలు విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనం కోసం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సరి-బేసి నిబంధన ఉల్లంఘించినవారికి వేసే 2 వేల జరిమానా చాలా ఎక్కువని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. -
సైకిల్‌పై డిప్యూటీ సీఎం పయనం
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి నిబంధనకు మంచి స్పందన వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆప్ నేతలు ఈ నిబంధనను అనుసరిస్తున్నారు. కొందరు కార్లను పక్కనబెట్టి సైకిల్, ఆటోలు, బస్సుల్లో ఆఫీసుకు వెళ్లారు. జనవరి 1 నుంచి అమలు చేస్తున్న సరి-బేసి రూల్ ప్రకారం ఢిల్లీలో శనివారం సరి వాహనాలను రోడ్లపైకి అనుమతించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైకిల్ ఎక్కారు. ఢిల్లీలోని ఆలిండియా రేడియో స్టేషన్ ఆఫీసు నుంచి సచివాలయానికి సిసోడియా సైకిల్‌పై వెళ్లారు. శుక్రవారం ఢిల్లీ ఆప్ కన్వీనర్ దిలీప్ పాండే ఆటోలో ఆఫీసుకు వెళ్లారు. సీఎం కేజ్రీవాల్.. రవాణా మంత్రి గోపా ల్‌రాయ్ కారులో సచివాలయానికి వెళ్లారు. సీఎం, గోపాల్‌రాయ్, పీడబ్ల్యూడీ మంత్రి ఒకే కారులో ప్రయాణించారు. -
సరి-బేసి రూల్‌ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సరి-బేసి నిబంధనను బీజేపీ ఎంపీ ఉల్లంఘించారు. సరి-బేసి రూల్ ప్రకారం ఢిల్లీలో శుక్రవారం బేసి సంఖ్య గల కార్లను మాత్రమే అనుమతించారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ సరి నెంబర్ ప్లేట్ గల కారులో వెళుతూ ఇండియా గేట్ వద్ద కనిపించారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవుదినం కావడంతో ఢిల్లీలో రద్దీ తక్కువగా ఉంది. సరి-బేసి సంఖ్య గల వాహనాలను ఢిల్లీలో రోజు మార్చి రోజు అనుమతిస్తారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ విమర్శించింది. ప్రత్యామ్నాయ ప్రజా రవాణ ఏర్పాట్లు చేయకుండా ఈ నిబంధన అమలు చేయడాన్ని తప్పుపట్టింది. కాగా సరి-బేసి నిబంధన విజయవంతమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ రూల్‌ను నిరంతరం అమలు చేయడం సాధ్యంకాదని చెప్పారు. -
'ఏ సెక్షన్ కింద చలానా రాస్తారు?'
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి కార్లకు అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల విధానంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ వెలుపల నమోదైన వాహనాలను ఎలా నియంత్రిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ తో దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలకు సరి-బేసి విధానాన్ని ఎలా అమలు చేస్తారని అడిగారు. నార్త్ ఇండియా, ఢిల్లీ చుట్టుపక్కల నుంచి చాలా మంది వాహనాల్లో హస్తినకు వస్తుంటారని.. వారందరికీ జరిమానా విధిస్తారా అని ప్రశ్నించారు. మోటారు వాహనాల చట్టంలోని ఏ సెక్షన్ కింద ప్రతిరోజూ చలానా రాస్తారని నిలదీశారు. వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేసేముందు బాగా ఆలోచించాలని ఆయన సూచించారు. -
'టూవీలర్స్ కూ వర్తింపజేయండి'
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ఆదర్శ్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఉంటే టూవీలర్స్ ను సరి-బేసి పాలసీలో చేర్చవచ్చని చెప్పారు. దిచక్ర వాహనదారులకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఈ పథకం విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సరి-బేసి సంఖ్య విధానం అమలుచేసిన వారం రోజుల్లో దీన్ని సమీక్షించి ద్విచక్ర వాహనాలకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. సరి-బేసి విధానం అమల్లోకి వచ్చిన వారం తర్వాత టూవీలర్స్ కు దీన్ని వర్తింపజేయడం సాధ్యమేనని శాస్త్రి పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న 85 లక్షల వాహనాల్లో 55 లక్షల వరకు ద్విచక్ర వాహనాలున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు జనవరి 1 నుంచి కార్లకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూల్స్ బ్రేక్ చేస్తే రూ.2వేలు ఫైన్...
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం న్యూఢిల్లీలో కొత్తగా ప్రతిపాదించిన సరి-బేసి ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, 12 ఏళ్లలోపు పిల్లలతో ఉండి వాహనాలు డ్రైవ్ చేసే మహిళలు, సీఎన్జీ కార్లు వాడేవాళ్లు, వీఐపీలు ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపారు. సరి-బేసి విధానం ఢిల్లీ సీఎం వాహనానికి అయినా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ పేర్కొన్న 'సరి-బేసి' ట్రాఫిక్ రూల్స్ : 15 రోజుల ట్రయల్ రన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న సరి-బేసి ట్రాఫిక్ రూల్స్... రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు జడ్జీలు, డిప్యూటీ స్పీకర్, ఏవైనా అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో ద్విచక్ర వాహనాలు, రక్షణశాఖ వాహనాలు, పైలట్ కార్లు, సీడీ నంబర్ ప్లేట్లు ఉండే ప్రత్యేక భద్రతా బలగాల వాహనాలకు కూడా సరి-చేసి ఫార్ములా వర్తించదని కేజ్రీవాల్ వివరించారు. ఈ 15 రోజులకు గానూ అవసరమైన నిమిత్తం ఎమర్జన్సీ వాహనాలు, పీసీఆర్ లు దీని పరిధిలోకి రావు. ప్రభుత్వ నిర్ణయం విజయవంతమైతే ఈ విధానాలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు అదనంగా న్యూఢిల్లీలో మరో 6వేల బస్సులు రోడ్డెక్కనున్నాయి. న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన 19 లక్షలకు పైగా నాలుగు టైర్ల వాహనాలున్నాయి. నూతన విధానం వల్ల రోజులో సగం వాహనాలు మాత్రమే తిరుగుతాయి.