ఢిల్లీలో గుర్రంపై ఎంపీ హల్ చల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనను వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎంపీలు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ ఇటీవల ఉద్దేశ్యపూర్వకంగా ఈ నిబంధనను ఉల్లంఘించగా, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ గుర్రపు స్వారీ చేసి నిరసన తెలియజేశారు.
బుధవారం రామ్ ప్రసాద్ గుర్రంపై పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. కాలుష్య రహిత వాహనం (పొల్యూషన్ ఫ్రీ వెహికల్) అని ఇంగ్లీష్ రాసిన బోర్డును గుర్రానికి తగిలించారు. బీజేపీకే చెందిన ఎంపీ, నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఇటీవల సరి-బేసి నిబంధనను ఉల్లంఘించారు.
ఆప్ సర్కార్ రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందని ఎంపీలు విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనం కోసం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సరి-బేసి నిబంధన ఉల్లంఘించినవారికి వేసే 2 వేల జరిమానా చాలా ఎక్కువని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.