బండి సంజయ్ చొరవ.. బీజేపీ కార్యాలయ సిబ్బందిని కలిసిన మోదీ
సాక్షి, హైదరాబాద్: నగర పర్యటను విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ సిబ్బందిని కలిశారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ఆఫీస్‌లోని స్వీపర్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ మొదలు అక్కడ పనిచేసే సిబ్బంది అందిరిని ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో ఈరోజు కార్యాలయానికి చెందిన సుమారు 40 మంది ఆఫీస్ సిబ్బందిని కలిసేందుకు మోదీ కార్యాలయం అనుమతిచ్చింది.
దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి కార్యాలయ సిబ్బందిని వెంటబెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్దకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన మోదీ ఫామ్ నెంబర్ 10 వద్దకు వస్తూ అక్కడున్న సిబ్బందికి అభివాదం చేశారు. ‘మీరంతా ఎన్నేళ్ల నుంచి బీజేపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు? ఎలా ఉన్నారు?’ అంటూ పలకరించారు.
అనంతరం ఒక్కొక్కరి వద్దకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దేవుడి లాంటి మోదీని కలిసే అవకాశం రావడం తమ అదృష్టమని ఆయా సిబ్బంది పేర్కొనడం గమనార్హం. మోదీని కలిసిన వారిలో బంగారు శ్రుతితోపాటు ఆఫీస్ ఇంఛార్జ్ కేవీఎస్ఎన్.రాజు, కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులున్నారు.
చదవండి: మోదీ పర్యటన.. బీజేపీకి మంత్రి తలసాని సవాల్..
కాగా శనివారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన మోదీని గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి వందే భారత్ రైలు ప్రారంభించడంతోపాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్‌టీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లను ప్రారంభించారు. హైదరాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించిన అనంతరం పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. అనంతరం చెన్నైకు ప్రయాణమయ్యారు.