కార్యాలయ సిబ్బందికి మన్మోహన్ వీడ్కోలు
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం తన కార్యాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ తనకు సహకరించిన ఉద్యోగులందరికీ వీడ్కోలు పలికారు. సౌత్బ్లాక్లో జరిగిన ఈ సమావేశానికి110 మంది వ్యక్తిగత సిబ్బంది, 400 మంది ఇతర ఉద్యోగులు హాజరయ్యారు.
మన్మోహన్ ప్రతి ఒక్కరినీ పలకరించి కృతజ్ఞతలు తెలియజేశారు. 2004లో తొలిసారి ప్రధాని అయిన మన్మోహన్ పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. శనివారం మన్మోహన్ చివరిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన అనంతరం చివరిసారి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని గత జనవరిలో మన్మోహన్ ప్రకటించారు. ఆ తర్వాత మన్మోహన్ తన అధికార నివాసం రేస్ కోర్సు రోడ్డులోని ఏడో నెంబర్ బంగ్లా నుంచి మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఇంటికి మారవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుండగా, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమికి పూర్తి మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.