డీసీఎల్ కార్యాలయం దిగ్బంధం
విజయనగరం టౌన్ : పూసపాటిరేగ మండలం కందివలస వద్ద ఉన్న ఎస్ఎంఎస్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం డీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మిక యూనియన్‌కు, యాజమాన్యానికి మధ్య నెలకొన్న తగాదా చినికి చినికి గాలివాన లా మారింది. ఉన్నతాధికారుల జోక్యం తో గతనెల 24న జిల్లా కార్మికశాఖ కార్యాలయంలో చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారమై 18 రోజులు గడుస్తున్నా నేటికీ పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంతో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్మికులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
విధులకొచ్చిన ఉద్యోగులను బయటకు పంపించేశారు. తలుపులకు తాళాలు వేసి గేటు వద్ద అధిక సంఖ్యలో బైఠాయించి తమ సమస్యలు తీర్చేవరకూ పోరాటం చేస్తామని భీష్మించారు. దీంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. అనంతరం కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ముందు చర్చలు చేసి, ఆ చర్చల ప్రకారం కార్మికులను పనిలో పెట్టుకోకుండా తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని అనుమానం వెలిబుచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాస్థాయి అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొంతమంది అధికారులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల పొట్ట కొట్టేందుకు చూస్తున్నార ని ఆరోపించారు. కంపెనీలో సీఐటీయూ యూనియన్ అనేది ఉండకుండా చేయాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కార్మికులను విధుల్లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని, సమస్యను పరిష్కరించేవరకూ పోరాటం చేస్తామన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూనియన్ నాయకులు, కార్మికులు డీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. పైగా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కూడా యథాతథంగా ధర్నా నిర్వహిస్తామని యూనియన్ ప్రతి నిధులు తెలిపారు.