బుద్ధుడి విగ్రహాలకు.. కెమికల్ ట్రీట్మెంట్ తప్పనిసరి
ఒంగోలు కల్చరల్:
- లేదంటే విగ్రహాలు పాడయ్యే ప్రమాదం
- గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు సహకరించాలి
- ఆర్కియాలజీ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కేశవ
ప్రాచీన బౌద్ధ సంస్కృతికి పేరుగాంచింది ప్రకాశం జిల్లా..ముఖ్యంగా నాగులుప్పలపాడు మండలంలోని కనిగిరి ప్రధాన కేంద్రం అనే విషయం 2015 డిసెంబర్ 7న అక్కడ లభ్యమైన బుద్ధుని విగ్రహాలు చాటి చెప్పాయి. కనపర్తి గ్రామం బయట ఉన్న పొలాల్లో మట్టిని సేకరించేందుకు కూలీలు తవ్వుతున్న సమయంలో అక్కడి మట్టిలో ఒక పెద్ద కుండ వారికి దర్శనమించ్చింది. ఇందులో రాగి, ఇనుముతో చేసిన బుద్ధుడి అడుగు సైజు విగ్రహాలు లభ్యమయ్యాయి. నిలబడిన భంగిమలో 15 విగ్రహాలు, ధ్యాన బుద్ధుని విగ్రహాలు 3, గంధర్వ నృత్య విగ్రహం 1, మకర తోరణ భాగాలు, మట్టిపాత్ర, హారతి పళ్లాలు, పంచపాత్ర, గంటలు మొత్తం 55 వస్తువులు లభ్యమయ్యాయి. మట్టిని తొలగించగా రెండు పెద్ద ఆయక స్తంభాలు, ఇటుకలు బయల్పడ్డాయి. రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుడు డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ కేశవ, నెల్లూరు అసిస్టెంట్ డైరక్టర్ జాన్ కమలాకర్ ఆ ప్రాంతానికి చేరుకుని ఆధారాలను పరిశీలించారు. ఆయక స్తంభాలు క్రీస్తు శకం రెండో శతాబ్ధికి చెందినవిగా పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేశారు.
విగ్రహాలను మ్యూజియంకు తరలింపు
నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ జాన్ కమలాకర్ , నాగులుప్పలపాడు మండల తహసీల్దార్ రమణారావు తదితరులు పంచనామా నిర్వహించి లభ్యమైన విగ్రహాలను, ఆయక స్తంభాలను, ఇతర వస్తువులను కనపర్తి పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారు.
గ్రామస్తుల వ్యతిరేకత..
కనపర్తిలో దొరికిన విగ్రహాలను గ్రామంలోని పురావస్తు మ్యూజియంలోనే ఉంచాలని పలువురు గ్రామస్తులు కోరారు. విగ్రహాలను బయటకు తరలించేందుకు ఆనాడు వారు అంగీకరించ లేదు.
రెవెన్యూ సహకారం కీలకం..
సహజంగా తవ్వకాల్లో లభ్యమైన విగ్రహాలు వంటి వాటికి పంచనామా నిర్వహించిన అనంతరం రెవెన్యూ అధికారులు వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించడం సహజంగా జరిగే ప్రక్రియ. బుద్ధ విగ్రహాల విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆర్కియాలజీ అధికారుల అభ్యర్థన మేరకు బుద్ధ విగ్రహాలను కెమికల్ ట్రీట్మెంట్కు పురావస్తు శాఖ అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సుజాతా శర్మ నాగులుప్పలపాడు తహసీల్దార్‌తో పాటు ఒంగోలు ఆర్డీవోను ఆదేశించారు. అయితే వారు విగ్రహాలను అప్పగించేందుకు తాత్సారం చేస్తున్నారని, దీనివల్ల బయటి వాతావరణంలో విగ్రహాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు. నిర్లక్ష్యం మూలంగా విగ్రహాలు దెబ్బతిన్న పక్షంలో అది అందుకు బాధ్యులైన అధికారుల మెడకు చుట్టుకుంటుందని పురావస్తు శాఖ అధికారులు సూచిస్తున్నారు.
విషయం కలెక్టర్ దృష్టికి
ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ డైరక్టర్ ఎస్.కేశవకూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బుద్ధ విగ్రహాల తరలింపులో రెÐð న్యూ శాఖ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ సుజాతా శర్మ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆర్కియాలజీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
కెమికల్ ట్రీట్మెంటే కీలకం..
గ్రామస్తులు సమకూర్చిన లాకర్లో విగ్రహాలను భద్రపరచినంత మాత్రానా ప్రయోజనం లేదని అవి పాడు కాకుండా ఉండాలంటే వాటిని ఆర్కియాలజీ లాబ్‌కు తరలించి, రసాయన శుద్ధి చేయాలంటున్నారు. ల్యాబ్‌ను హైదరాబాద్ నుంచి కనపర్తికి తరలించడం సాధ్యమయ్యే పని కాదని పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అందరూ సహకరించాలి
– డిప్యూటీ డైరెక్టర్ ఎస్. కేశవ
కనపర్తిలో దొరికిన బుద్ధ విగ్రహాలకు వెంటనే కెమికల్ ట్రీట్మెంట్ అవసరం. లేకుంటే విగ్రహాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు స్పందించి అపురూప బుద్ధ విగ్రహాలు నాశనం కాకుండా వెంటనే వాటికి కెమికల్ ట్రీట్మెంట్ జరిగేందుకు వీలుగా తరలించేందుకు తమ తోడ్పాటును అందించాలి. రసాయన శుద్ధి అనంతరం విగ్రహాలను తిరిగి కనపర్తికి తరలిస్తాం.