అర్చకులకే శఠగోపం..!
160 ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా అందని వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాల ఆదాయం భారీగా పెరుగుతోంది. కొన్నిచోట్ల బడ్జెట్ కోట్ల రూపాయలు దాటుతోంది. అయినా అర్చకులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించని దుస్థితి. కొన్ని నెలలుగా వేతనాలు సరిగా చెల్లించకపోతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 160 దేవాలయాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాలకమండళ్లతోపాటు కొందరు అధికారుల అవినీతి కారణంగానే ఈ దుస్థితి. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో అక్రమాలు పెచ్చరిల్లి.. దేవాలయాలకు వస్తున్న ఆదాయం పక్కదారి పడుతోంది.
ఓ ఆలయానికి ఎంత ఆదాయం వస్తోంది, అందులో దేవాదాయశాఖకు చెల్లించాల్సిందెంత, ఆలయ ఖర్చులకు, సిబ్బంది జీతభత్యాలకు చేస్తున్న వ్యయం ఎంతనే లెక్కల్లో స్పష్టత ఉండడం లేదు. చాలా దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి రెండు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. అదేమంటే ఆదాయం సరిపోవడం లేదనే సమాధానం వస్తోంది.
కొన్ని నెలలుగా అందని జీతాలు
దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 635 ఆల యాలున్నాయి. వాటిలో కొన్నింటికే పాలక మండళ్లు ఉన్నాయి. పాలక మండళ్లు లేని చోట కార్యనిర్వహణాధికారు(ఈవో)ల పాలన. వీటికితోడు పలు ఆలయాలను వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొత్తంగా దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయాల్లో 5,600 మంది అర్చకులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరేగాకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారు. అయితే వేములవాడ, యాదగిరిగుట్ట వంటి పలు ప్రధాన దేవాలయాలు కాకుండా.. చాలా ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా వేతనాలు అందడం లేదు.
కామారెడ్డి సమీపంలోని భిక్కనూరు సిద్ధరామేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నెలలుగా సిబ్బందికి, అర్చకులకు జీతాలు చెల్లించడం లేదు. హైదరాబాద్ శివార్లలో ఉండి, రూ.కోట్లలో వార్షికాదాయం ఉన్న కీసర రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ సకాలంలో వేతనాలు అందడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, మెదక్ జిల్లాలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి... ఇలా చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా దేవాలయాల్లో ఇదే దుస్థితి. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడానికి అర్చకులు, సిబ్బంది జంకుతున్నా రు. తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుం దోనని భయపడుతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పాలకమండళ్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆదాయం ఏమవుతోంది?
ఆలయానికి సమకూరే మొత్తం ఆదాయంలో 12 శాతాన్ని దేవాదాయశాఖ అధికారుల వేతనాల కోసం ఆ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. సర్వశ్రేయోనిధికి మరో 3శాతం సమర్పించాలి. మరో 30శాతానికి మించకుండా నిధులను జీతాలకు కేటాయించాలి. మిగిలే నిధులను ఆయా ఆలయాల నిర్వహణ, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. దేవాదాయశాఖకు అందాల్సిన మొత్తాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వసూలు చేస్తున్నారు. ఆల య ఖర్చులు, సిబ్బంది జీతభత్యాల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిన ప్పుడు.. సరుకుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు తేలింది.
దీనిపై అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇలా చాలాచోట్ల అధికారులు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ దేవుడి నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మరీ విచ్చలవిడిగా కొనసాగుతుండడంతో దేవాలయాల్లో నిధులకు కటకట ఎదురవుతోంది. చివరికి అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందున తమకేమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. తమకు జీతాలు సరిగా రావడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ అర్చకులు, సిబ్బంది చేస్తున్న విజ్ఞప్తులు అరణ్యరోదనే అవుతున్నాయి.
‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు పట్టదా..?
అర్చకులు, ఆలయ సిబ్బంది తమ వేతనాల సమస్యపై ఆందోళనలు చేయడంతో కొన్నేళ్ల కింద ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేవాలయాల ఆదాయంలో 30 శాతం వరకు అర్చకులు, సిబ్బంది వేతనాల కోసం వెచ్చిస్తున్నారు. పలు దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండడంతో కనీస వేతనాల్లో వ్యత్యా సం వస్తోంది. అంతేగాకుండా ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో ఆదా య, వ్యయాల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితిని నివారించేందుకు అన్ని ఆలయాల ఆదాయం నుంచి 30 శాతం చొప్పున వసూలు చేసి ‘ప్రత్యేక నిధి’ని ఏర్పాటు చేయాలని... ఆ నిధి నుంచే అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దీనివల్ల ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ఆలయాల అర్చకులు, సిబ్బందికి వేతనాలు సకాలంలో అందడంతోపాటు, ఆలయాల ఆదాయ, వ్య యాలను ప్రభుత్వం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఐదురుగు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ సబ్ కమిటీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేయకపోవడం గమనార్హం. తమ అవకతవకలు బయటపడతాయని కొందరు పాలక మండళ్ల సభ్యులు, అధికారులు... పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సబ్ కమిటీ పరిశీలనను జాప్యం చేసేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.