offline feature
-
ఇంటర్నెట్ లేకున్నా ఓలా బుకింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది. దీనితో ఇంటర్నెట్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాబ్‌ను బుక్ చేయవచ్చు. బుక్ వయా ఎస్ఎంఎస్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ నుంచి లొకేషన్‌తో కూడిన వివరాలతో ఒక మెసేజ్ ఓలాకు వెళ్తుంది. వెంటనే కస్టమర్‌కు సమీపంలో ఉన్న మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కస్టమర్ తనకు నచ్చిన క్యాబ్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకోగానే డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్ఎంఎస్ వస్తుంది. అటు డ్రైవర్‌కూ కస్టమర్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ సైతం ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. ఇంటర్నెట్ ఉంటే రైడ్ వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్ వంటి ఫీచర్లు వినియోగించుకోవచ్చు. ఓలా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉంది. దశలవారీగా మొత్తం 102 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఓలా ఒక ప్రకటనలో తెలియజేసింది. -
అక్కడ ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్!
కరాచీ: పాకిస్థాన్ లో ఎనిమిది నెలల తర్వాత యూట్యూబ్ తిరిగి ప్రారంభమైంది. పాక్ యూజర్లు చేరువయ్యేందుకు కొత్తగా మరిన్ని ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఆఫ్ లైన్ ల్లోనూ వీడియోలు వీక్షించే అవకాశం కల్పించింది. రీ లాంచింగ్ సందర్భంగా కరాచీలోని డీహెచ్ఏ గోల్ఫ్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆఫ్ లైన్ ఫీచర్లను ప్రకటించింది. ‘పాపులర్ వీడియోలు తాత్కాలికంగా ఆఫ్ లైన్ ల్లోనూ వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. యూజర్లు తమకు ఇష్టమైన వీడియోలను సులువుగా వీక్షించేందుకు ఈ ఫీచర్ ప్రవేశపెట్టాం. దీని ద్వారా వీడియోలకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయ’ని గూగుల్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ బిలియన్ యూజర్స్ టీమ్ హెడ్ తానియా అయిడ్రస్ తెలిపారు. పాకిస్థాన్ వినియోగదారులకు వీడియో కంటెంట్ ను మరింత అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ ఫీచర్ ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వీడియోలు చూడొచ్చని వెల్లడించారు. తాము ఎంచుకున్న వీడియో 48 గంటల పాటు ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. వై-ఫై, డేటా కనెక్షన్ లేకుండానే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చన్నారు. కంటెంట్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ ను ప్రకటించారు. దీని ద్వారా వీడియోలు రూపొందించేవారికి అవకాశాలు, నైపుణ్యాలు పెంచుకోవచ్చని వివరించారు.