టీఎస్ ప్రొడక్షన్స్...కేసీఆర్ 'ఆగడు'
తెలంగాణలో 'ఆగడు' హీరో మహేష్ బాబు కాదట. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులకు మాత్రం ..ఆగడు హీరో...కేసీఆరేనట. 19 రోజుల పాటు జరిగిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ స్టార్ హీరో అయ్యారు. ప్రతిపక్షంతో పాటు ఇతర పార్టీ నేతల ఒకెత్తు అయితే...కేసీఆర్ ఒక్కరే తన మాటలతో మాయజాలం చేశారు. తెలంగాణ ప్రొడక్షన్స్ సమర్పించు ...అన్న చందంగా 'ఆగడు' షోలో ...మొత్తం 119మంది సభ్యులు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ సభను అంతా తన భుజస్కంధాలపై నడిపించారు.
సభలో తన మాటల తూటాలతో ప్రతిపక్షాల్ని కేసీఆర్ నోరెత్తేందుకు ఛాన్సు ఇవ్వలేదు. కొన్ని చోట్ల తగ్గినట్టు కనిపిస్తూనే.. మొత్తంగా కేసీఆర్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా కనబరిచారు. అసెంబ్లీలో మై హోమ్స్‌కు భూముల కేటాయింపునకు సంబంధించిన చర్చతో పాటు, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంలో భాగంగా ముఖ్యమంత్రి చూపిన చొరవ ప్రతిపక్షాలే ప్రశంసించాయంటే చెప్పుకోవాల్సిందే. ఓవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు అసెంబ్లీని తన కనుసైగలతో శాసించారు. ఇక ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ...ధీటుగా సమాధానం ఇచ్చారు.
దాంతో కేసీఆర్ ధాటికి చేతులెత్తేసిన ప్రతిపక్షాలు...రాను రాను కేసీఆర్‌ను విమర్శించడం కన్నా ఓ మంచి సూచన చేసి సరిపెట్టుకున్నాయి.ఇక సభలో ప్రతిపక్షం కాంగ్రెస్ అయినా... తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని చెప్పుకోవాల్సిందే. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అవకాశం దొరికినప్పుడల్లా ఆరోపణలు గుప్పించారు.
మాటల తూటాలతో... ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో దూసుకు పోయినా 'ఆగడు' దెబ్బకు చతికిలపడాల్సి వచ్చింది. సమావేశాలకు అడ్డుపడి సస్పెన్షన్ వేయించుకున్న ఆయన... ఆనక మీడియా పాయింట్ వద్ద నోటికి ఎంత పని చెప్పినా ఫలితం మాత్రం శూన్యం. దాంతో 'వన్ మెన్' ఆర్మీ పోరాటం చేసిన రేవంత్ రెడ్డి 'ఒక్కడు'గానే మిగిలిపోవాల్సి వచ్చింది.