వ్యవస్థ ప్రక్షాళనకే నోట్ల రద్దు..!
ప్రధాని స్పష్టీకరణ
► నవంబర్ 8నిర్ణయం తర్వాత కాంగ్రెస్‌లో నిరాశ
న్యూఢిల్లీ: నోట్లరద్దు లాంటి కఠిన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ నాయకత్వం నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయిందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్నాయన్నారు. ఇండియాటుడే చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నోట్లరద్దు నిర్ణయం తర్వాత తలెత్తిన పరిణామాలు, విపక్షాల విమర్శలు, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు, ప్రజల కష్టాలు, పన్ను కట్టేవారికి భరోసా వంటి అంశాలపై మోదీ స్పష్టతనిచ్చారు. వివిధ అంశాలపై ప్రధాని స్పందనను గమనిస్తే..
కాంగ్రెస్‌పై: ‘విపక్షాలను చూస్తే జాలేస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌నాయకత్వం. నోట్లరద్దు తర్వాత వారి నిరాశ, నిస్పృహలను బహిరంగంగా వెళ్లగక్కారు. ఎప్పుడు చూసినా ఎన్నికల గురించే తప్ప వారు దేశం గురించి ఆలోచించరు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఎలాంటి చర్చ జరగకుండా ఆందోళన చేశారు. పార్లమెంటులో విపక్షాల ఆందోళన అర్థం చేసుకోవచ్చు. కానీ తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై అవినీతికి అనుకూలంగా సభాకార్యక్రమాలను స్తంభింపజేశాయి. సభ జరిగేలా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది’
మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై: ‘ఘోరమైన తప్పిదం, వ్యవస్థీకృత దోపిడీ అని మన్మోహన్ అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. 45 ఏళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా?. మన్మోహన్ వ్యాఖ్యలు.. ఆయన నాయకత్వంలో జరిగిన కుంభకోణాల (2జీ, సీడబ్ల్యూజీ, బొగ్గు కుంభకోణం ఇలా చాలానే జరిగాయి) గురించే అనుకుంటా’ (వ్యంగ్యంగా)
నోట్లరద్దు విమర్శలపై: ‘నోట్లరద్దు నిర్ణయంలో రాజకీయమేమీ లేదు. స్వల్పకాల రాజకీయ లబ్ధికోసం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని క్లీన్ చేసేందుకు మొదలుపెట్టిన ప్రయత్నిమిది. అవినీతి, దోపిడీని పూర్తిగా అణచివేసేందుకు తీసుకున్న కఠినమైన నిర్ణయం. ఎన్నికల కోసం రాజకీయాలు చేసే వాణ్ణికాను. దీర్ఘకాల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నా. రాజకీయ అవినీతిని పారద్రోలేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి. నోట్లరద్దు నిర్ణయం మా నీతి (విధానం), తప్పుచేసిన వారిపై కఠినంగా వ్యవహరించటం మా రణ్–నీతి (వ్యూహం). నల్లధనం ఉన్నవారు ఏ కొత్త మార్గంలో వెళ్లినా మేం వెతికి పట్టుకుంటాం.. ఏమాత్రం సందేహం లేదు’
రద్దుకు తర్వాత ఏం మార్పు వస్తుంది?: ‘దేశంలో పన్నులు కట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. అంతకుముందు ఐటీ అధికారులు చీకట్లో కాల్చేవారు (లక్ష్యం లేకుండా దాడులు జరిగేవి). కానీ ఈ నిర్ణయంతో ప్రజలు దాచుకున్నది స్వచ్ఛందంగా డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ అధికారులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లేందుకు వీలుంటుంది. అవినీతిని సహించేది లేదు. తప్పుచేసిన వారెంతవారైనా సరే వదిలేది లేదు. ’
31న మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: నోట్లరద్దు నిర్ణయం, తదనంతర పరిణామాలు, భవిష్యత్తు గురించి దేశ ప్రజలనుద్దేశించి శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. నవంబర్ 8 నిర్ణయం తర్వాత పాతనోట్ల డిపాజిట్‌కు 50 రోజులు పూర్తవనున్న సందర్భంగా మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘కొత్త సంవత్సరం సుర్యోదయానికి ముందే దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నోట్లరద్దు తర్వాతి పరిస్థితులు, నగదు సరఫరాకు సంబంధించిన వివరాలు, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కారం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను మోదీ వివరించే అవకాశం ఉంది.
మంగళవారం నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితిపై మోదీ చాలాసేపు చర్చించారు. కాగా, నల్లధనం, అవినీతి నిర్మూలనకోసం కేంద్రం ప్రతిషా్ఠత్మకంగా ఈ నిర్ణయం వెల్లడిస్తున్న సందర్భంగా నవంబర్ 8న ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు కొన్నాళ్లపాటు సమస్యలు తప్పవని.. అయితే.. 50 రోజుల తర్వాత ఈ సమస్యలు మెల్లిగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. వివిధ వేదికల ద్వారా కూడా ప్రధాని ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు.