ఆ పూల్ ఆకుపచ్చగా ఎందుకు మారిందంటే..
బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ సందర్భంగా ఓ స్విమ్మింగ్ పూల్ నీలిరంగు నుంచి హఠాత్తుగా ఆకుపచ్చ రంగులోకి మారిపోవడంపై క్రీడాకారుల నుంచి ఆందోళన వ్యక్తం అవడం తెల్సిందే. ఆల్గే (శిలీంధ్రాలు.. ఆకుపచ్చ నాచు) వల్ల నీటి రంగు మారిపోయిందని, గాలి, వెలుతురు కూడా సరిగ్గా సోకకపోవడం వల్ల అలా జరిగిందని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్పారు. నీటిని శుభ్రం చేయడానికి అధిక రసాయనాలను ఉపయోగించడం వల్ల నీటి రంగు ఆకుపచ్చగా మారిందని, ఈ రంగు నీటి వల్ల క్రీడాకారులకు ఎలాంటి హాని లేదని నీటిని పరీక్షించిన ఈత ఈవెంట్లను నిర్వహించే అంతర్జాతీయ సంఘం 'ఫినా' ప్రకటించి ఈ అంశానికి తెరదించాలని భావించింది. కానీ ఏ రసాయనం వల్ల రంగు మారిందనే విషయానికి విజ్ఞానపరమైన కారణాలను మాత్రం ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు.
యూనివర్సిటీలో వాటర్ కెమిస్ట్రీ చదువుకోవడంతో పాటు స్విమ్మింగ్ పూల్ బాయ్‌గా పనిచేసిన అనుభవం కలిగిన 'జీఆర్‌ఆర్‌ఎల్ సైంటిస్ట్' స్విమ్మింగ్‌పూల్‌లో నీటి రంగు మారడానికి వివరణ ఇచ్చారు. ఆల్గే కారణంగా నీటిరంగు మారలేదని, నీటిలో ఆల్గే పెరగడానికి కొన్ని రోజులు పడుతుందని ఆయన చెప్పారు. సరైన గాలి, వెలుతురు లేకపోవడం కూడా కారణం కాదన్నారు. నీలిరంగులో ఉండే కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్ పెంటా హైడ్రేట్‌ను అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉంటాయని ఆయన చెప్పారు.
నీటిలో ఆల్గే పెరగకుండా నిరోధించేందుకు పెద్ద స్విమ్మింగ్ పూల్స్‌లో, మున్సిపల్ వాటర్ ట్యాంకుల్లో కాపర్ సల్ఫేట్‌ను ఉపయోగిస్తారని, ఈ సల్ఫేట్‌ను తగిన మోతాదులో ఉపయోగిస్తే మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, చేపల లాంటి జలచరాలు మాత్రం పెరగవని ఆయన తెలిపారు. ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే మాత్రం మనుషులకు చర్మంపై దురదలు లేస్తాయని, కళ్లు మండుతాయని చెప్పారు. ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా కళ్లు మండుతున్నాయని, చర్మంపై దురద పెడుతోందని ఫిర్యాదుచేసిన విషయం ఇక్కడ గమనార్హం. కాపర్ సల్ఫేట్‌ను ఎక్కువ మొత్తంలో నీటిలో కలపడం వల్ల నీలిరంగులో ఉండే కాపర్ అయాన్లు నీటిలోని నాలుగు క్లోరిన్ అయాన్లతో కలసిపోయి కాపర్ (2) టెట్రాక్లోరో కాంప్లెక్స్‌గా మారుతుందని, అది ఆకుపచ్చగా ఉంటుందని, అప్పుడు నీరంతా ఆకుపచ్చగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
స్విమ్మింగ్ ఫూల్ ఆవరణ అంతా కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయని, నీటిలోపల సల్ఫేట్ అయాన్లు హైడ్రోజన్ సల్ఫైడ్‌గా మారిపోతాయని, అప్పుడు నీటి నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తుందని జీఆర్‌ఆర్‌ఎల్ సైంటిస్ట్ వివరించారు. ఒలింపిక్స్‌లో ఆకుపచ్చగా మారిన నీటిని పూర్తిగా తొలగించి కొత్త నీటితో నింపి ఈత ఈవెంట్లను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.