omission
-
జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?
కెనాడా నగరం మాంట్రియల్లో 2022 డిసెంబర్లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 1972లో స్టాక్హోమ్లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్ సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్ ఒప్పందం, పారిస్ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్ షేక్ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా? జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్ ప్రాంత దేశాలకే 300 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ (యుఎన్ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్ ప్లానెట్ రిపోర్టు (ఎల్పీఆర్)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్పీఆర్ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!) – టీవీ సుబ్బయ్య, సీనియర్ జర్నలిస్ట్ -
కబళించనున్న వాయుకాలుష్యం
మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిన వాయు కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య గత రెండు దశాబ్దాలలో రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ వాయు కాలుష్యానికి 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కలు చెబుతున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2019లో ప్రపంచ వ్యాప్తంగా సంభ వించిన వాయుకాలుష్య మరణాలలో మన దేశంలోనే 25 శాతానికి పైగా నమోదయ్యాయని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం ఒక్క 2019 లోనే ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం కాటుకు 66.7 లక్షల మంది బలయ్యారని తెలుస్తోంది. ఇందులో 16 లక్షల మరణాలు భారత్లోనే నమోదయ్యాయట. వాయు కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచంలో పుట్టిన నెలలోపే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 4.76 లక్షలు కాగా, మన దేశంలో అది 1.16 లక్షలుగా నమోదయింది. ప్రపంచంలో 99 శాతం మంది ప్రజలు పీలుస్తోంది కలుషిత గాలేనని డబ్లు్యహెచ్ఓ కుండ బద్దలు కొడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతున్న కర్బన ఉద్గారాల విడుదల రానున్న కాలంలో మరింత పెరిగితే ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల ముప్పు బారిన పడతాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. మానవ కల్పిత వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలన్నింటిపైనా తీవ్ర విపరిణామాలు చూపుతున్నాయని ఐపీసీసీ కమిటీ ఛైర్మన్ హో సెంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులకు బడుగు బలహీన వర్గాల ప్రజలు, వారికి సంబంధించిన మౌలిక వసతుల వ్యవస్థలు దెబ్బ తింటున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. ఈ మానవకల్పిత వాతావరణ మార్పులకు మన దేశంలో లక్నో, పట్నా నగరాలు ప్రధానంగా గురవు తున్నా... అనేక ఇతర నగరాలూ ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం మరింత పెరిగిపోయింది. కర్బన ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్ది చివరి నాటికి వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రపంచ వ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా పెరిగే ప్రమాదం వుందని ఐపీసీసీ ఛైర్మన్ హెచ్చరిస్తున్నారు. రానున్న కాలంలో వాతావరణ మార్పుల బాధితులను ఆదుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. వాతావరణ మార్పుల బాధితు లను ఆదుకునేందుకు ఇప్పటికే జాతీయ స్థాయి నిధినీ, ‘విపత్తు నివారణ మౌలిక వసతుల వ్యవస్థ’నూ ఏర్పాటు చేశామనీ, 2030 నాటికి మన విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు దేశం శిలాజ ఇంధనాల వినియోగాన్ని 30 శాతానికి తగ్గించుకునేందుకు 2015 నాటి పారిస్ ఒప్పందంలో అంగీకరించిందనీ ప్రభుత్వం గుర్తు చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటి మీదకు రావల్సిన అవసరం వుంది. మన దేశంలో పర్యావరణ మండలి వంటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసి ఉంది. దీన్ని ఏర్పాటు చేస్తే 2070 నాటికి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయా లన్న లక్ష్యసాధనకు చేరుకోవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) నవీన నాగరికతకు అనుగుణంగా పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే క్రమంలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో వెలువ డుతున్న ఉద్గారాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచుకు చేరుస్తున్నాయి. ఈ ఉద్గారాలతో కేవలం ధరిత్రి మాత్రమే, కాదు ఇంధన విపణి కూడా ఉడికిపోతోంది. ఈ ధరల పెరుగుదలతో అయినా హరిత, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా మనం ప్రయాణిస్తామా అన్న సందేహం తలెత్తు తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం చమురు సరఫరాలకు విఘాతం కలిగిస్తోందని చెప్పక తప్పదు. దీనితోనయినా మనం స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోంది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) - కేవీ రమణమూర్తి సీనియర్ పాత్రికేయులు -
కాలచక్రంపపంచానికి శాంతి చక్రం
సందర్భం దలైలామా నిర్వహించే కాలచక్ర ఉత్సవం ప్రపంచ బౌద్ధ ఉత్సవాలలో ప్రముఖమైనది. టిబెట్ దేశానికి చెందిన ఈ బౌద్ధ సంప్రదాయం ప్రపంచ మానవాళిలో ప్రేమ, దయ, కరుణ, ప్రజ్ఞ, ఉపేక్ష భావాల్ని పెంపొందించి, సర్వ జీవుల్లో సమరస భావాన్ని నింపి, మానవ మనస్సుల్లోని సంకుచితత్వాన్ని పారద్రోలి, శాంతి పరిమళాలు వెదజల్లడం కోసం కృషి చేస్తుంది. ప్రతి మనిషి నిస్వార్థంగా మారడానికి, దుఃఖాన్నుండి విముక్తి కావడానికి కావలసిన మానసిక, శారీరక సాధనల్ని ఈ కాలచక్రం నిర్దేశిస్తుంది. ఈ కాలచక్ర పూజా విధానం మనుషుల మనస్సుల్లో పరిపూర్ణత్వాన్ని నింపుతుందని బౌద్ధుల నమ్మకం. కాలచక్ర అంటే? కాలానికి సంబంధించినదే ఈ కాలచక్ర. మనం సాధారణంగా క్యాలెండరు లేదా పంచాంగాన్ని కాలచక్రం అంటాం. అంటే కాలాన్ని కొలిచే విధానంగా కాలచక్రాన్ని భావిస్తాం. కానీ బౌద్ధుల ఈ ‘కాలచక్ర’ కాలానికి సంబంధించినదే అయినా, అది రోజులకు, వారాలకు, పక్షాలకు, మాసాలకు, రుతువులకు ఆయనాలకు సంబంధించినది మాత్రం కాదు. ఈ సృష్టి రచనకు సంబంధించినది కాలచక్ర - విధానాలు ఈ కాలచక్ర ఒక అద్భుతమైన తత్త్వం. ప్రకృతి, మనిషి వేరువేరు కావని చెప్పే ఒక విశ్వ ఐక్యతావాదం. ఆ విషయం కాలచక్రంలో ప్రధానంగా ఉన్న మూడు విధానాలు తెలియజేస్తాయి. ఇందులో మొదటిది బాహ్య కాలచక్ర. దీన్ని ‘కాలచక్ర భూమి’ అని కూడా అంటారు. విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, సౌరవ్యవస్థ, భూమి, మూలకాలు, మూల రాశులు - ఇలా భౌతిక జగత్తంతా ఈ బాహ్యకాలచక్రలో భాగమే. రెండోది అంతర కాలచక్ర. మనిషి, పుట్టుక, జీవనం, అనుభవాలు, మనస్సు, నాడీ చలనాలు, హృదయ స్పందనలు - ఇలా మనిషీ మనస్సు కలిసినదంతా ఈ విభాగంలోకి వస్తుంది. ఇక మూడోది ప్రత్యామ్నాయ కాలచక్ర. పైన చెప్పిన రెండు రకాల అంతర, బాహ్య కాలచక్రాల్ని ఒకటిగా అనుసంధానం చేసే విధానం ఇది. ఈ అనుసంధానం చేసే పద్ధతి ధ్యాన పద్ధతి. - బొర్రా గోవర్ధన్ టిబెట్లో దలైలామాలు, పంచన్లామాలు అక్కడి బౌద్ధ గురువులు. కాలచక్ర పథ మార్గాన్ని నడిపించే గురువులు వాళ్ల్లే. ఒకటవ, రెండవ, ఏడవ, ఎనిమిదవ, పద్నాలుగవ దలైలామాలు ఈ కాలచక్ర కార్యక్రమాల్ని ఎక్కువగా నిర్వహించారు. ప్రస్తుత దలైలామా 14వ దలైలామా. అయన అసలు పేరు ‘టెన్జిన్ గాట్సో’. ఆయన ఇప్పటికి 33 కాలచక్రలు నిర్వహించారు. ప్రస్తుతం జూన్ 3 నుంచి 14వ తేదీవరకు భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో ‘లే’ (లడక్) లో 34వ కాలచక్రను నిర్వహిస్తున్నారు. 2006లో అమరావతిలో నిర్వహించిన కాలచక్ర ముప్పయ్యవది. కాలచక్ర పూజావిధానం కాలచక్ర అనేది భిక్షుదీక్షను ఇచ్చే కార్యక్రమం. దీక్ష నిచ్చే గురువును ‘వజ్రగురువు’ అంటారు. ఆయన ఒక ఉన్నత ఆనసం మీద కూర్చుని కార్యక్రమం నిర్వహిస్తారు. కాలచక్రలో ప్రధానంగా మూడు వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో బాహ్యకాలచక్రలో ఉండే నక్షత్రాది గ్రహాలు ఉంటాయి. రెండో వలయంలో అంతర కాలచక్రలో ఉండే శరీర, మనోస్థితులు ఉంటాయి. మూడో వలయంలో బుద్ధి, కాలం ఉంటాయి. అంటే ఆయా వలయాలు ఆయా రాశులకు సంకేతాలుగా ఉంటాయి. ఈ మూడు వలయాల్ని 12 రోజుల్లో దాటుకుంటూ చివరికి చేరాలి. ఈ 12 రోజుల్ని 11 దశలుగా పూర్తి చేయాలి. ఈ దశల్ని అభిషేకాలంటారు. లామా ఈ కాలచక్రను కొన్ని మండలాలుగా విభజిస్తాడు. ఈ మండలాల్ని రంగురంగుల ఇసుకతో నింపుతాడు. కాలచక్ర చిత్రాన్ని గీస్తాడు. ఆ చక్రంలో 720 మంది దేవతల్ని ప్రతిష్ఠిస్తాడు. కోర్కెలకు ప్రతీకగా శ్వేత వర్ణ బొమ్మల్ని కాలచక్ర కాళ్లకింద అణచివేస్తున్నట్లు చిత్రిస్తాడు. ఈ బొమ్మల్లో చక్రం.. పరిణామానికి (పురుషుడు), కాలం.. ప్రజ్ఞ (స్త్రీ) కి ప్రతీకలుగా భావిస్తారు. అయితే కాలచక్ర తంత్రం స్వభావరీత్యా స్త్రీతంత్రం. స్త్రీలు ఆచరించేది కాదు. ఈ తంత్ర స్వభావం అది. అందుకే ఈ తంత్రాన్ని ‘విశ్వమాత’గా పిలుస్తారు. కాలచక్ర అంటే విశ్వమాత అని. చివరి రోజున గుణాలకు ప్రతీకలైన రంగురంగుల ఇసుకను చెరిపివేసి, సైకత ఆలయాన్ని కూల్చేసి, ఆ ఇసుకను, రంగుల్నీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ నది ప్రవహించే కాలానికి ప్రతీక. ఈ పన్నెండు రోజుల కార్యక్రమంలో బోధి చిత్తాన్ని పొందిన భిక్షువులు దుఃఖరహితులై, శాంతి కాముకులై, సర్వజీవశ్రేయస్సు కోసం పాటుపడతారు. ప్రపంచాన్ని శాంతికమలంలా పూయిస్తారు. కాలచక్ర అంటే ప్రపంచశాంతి చక్రమే.