రేపు పాలీసెట్ యథాతథం: కన్వీనర్ ఎంవీరెడ్డి
హైదరాబాద్: పాలీసెట్ పరీక్ష గురువారం యథాతథంగా జరుగుతుందని కన్వీనర్, సాంకేతిక విద్య డైరెక్టర్ ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణకు సహకరించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేటు కళాశాలల జేఏసీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇయన ఇక్కడ మీడియాకు వివరాలు వెల్లడించారు. 220 కళాశాలల్లో ఉన్న 54వేల సీట్లలో ప్రవేశాల కోసం పాలీసెట్ను 1,27,951 మంది రాయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 288 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 209 ప్రభుత్వ కళాశాలలు, 79 ప్రైవేటు కళాశాలు ఉన్నట్టు చెప్పారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని... పరీక్ష ప్రారంభానికి గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 120 ప్రశ్నలు ఉంటాయని, ఓఎంఆర్ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.