ఆ క్షణం ఆలోచిస్తే..
సంగారెడ్డి క్రైం : పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య చేసుకుందో మహిళ.. ప్రేమ పెళ్లి కాదన్నం దుకు ప్రేమికుల ఆత్మహత్య.. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని యువకుడి బలవన్మరణం.. టెన్త్, ఇంటర్ తప్పానని తనువు చాలించిన విద్యార్థి.. ఇలా జిల్లా లో ప్రతిరోజూ ఏదో ఒక మారుమూల గ్రామాల్లో సైతం వినిపిస్తున్న వార్తలు. విచక్షణ, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నూరేళ్ల జీవితాన్ని ఉరికొయ్యకు తగిలి స్తున్నారు. క్షణికావేశంతో తనువు చాలించే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే తామెందుకు చనిపోతున్నామో తెలుసుకోవచ్చు.
తననే నమ్ముకుని తనపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. ఆత్మహత్య ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు. సమస్యను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలే తప్ప కృంగి పోయి ప్రాణాలు తీసుకోవడం సబబు కాదని గుర్తించాలి. ఇటీవల చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలే ఎక్కువ కారణంగా తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తే భవిష్యత్ అంతా ఉజ్వలంగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వారి భార్య, పిల్లలు రోడ్డున పడి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల ను తట్టుకుని జీవితంలో రాణించాలన్న భరోసా, ఆత్మస్త్యైం అందరిలో వుండాలి.
ఆత్మహత్యల నివారణకు కౌన్సెలింగ్
ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆత్మహత్యల నివారణ కోసం పోలీసు శాఖ తరఫున సదస్సులు నిర్వహించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ముఖ్యంగా యువత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యువత, మహిళలే ఉంటున్నారు. జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దు. బతకడానికి కష్టపడాలే తప్ప డిప్రెషన్‌కు లోను కావొద్దు. - సుమతి, ఎస్పీ
ఒత్తిడిని తట్టుకుని కష్టపడాలి
జీవితంలో అనుకున్నది సాధించడానికి వత్తిడిని తట్టుకునే శ క్తిని పెంచుకోవాలి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోయినా వారు ఆత్మహ త్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. జీవితంపై సరైన అవగాహన లేక ఈ చర్యకు పాల్పడతారు. జీవితంలో ఎలా బతకాలో, ఎలా కష్టపడి జీవించాలో వారికి నేర్పాలి. వ్యామోహానికి లోను కావొద్దు. ఆత్మహత్యనే అన్నింటికీ పరిష్కారం కాదన్న విషయం తెలుసుకోవాలి. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలి.
- డాక్టర్ కుమార రాజ, సంగారెడ్డి