One-stop shop
-
‘పల్లె సేవాకేంద్రాల’ ప్రక్రియ ప్రారంభం
* పెలైట్ ప్రాజెక్ట్ కింద 125 గ్రామాలు ఎంపిక * అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివిధ రకాల పౌర సేవలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాల (వన్‌స్టాప్‌షాప్)’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,695 గ్రామాల్లో దశల వారీగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. సాధారణ పౌర సేవలతో పాటు రెవెన్యూ, ఆర్థిక సేవలను కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఈ వన్స్టాప్షాప్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పెలైట్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్రంలోని తొమ్మిది (హైదరాబాద్ మినహా)జిల్లాల్లో 125 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో అక్టోబర్ 2న ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు మండల రెవెన్యూ కార్యాల యం నుంచి లభించే వివిధ రకాల పౌరసేవలు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపు లు, ఆసరా లబ్ధిదారులకు పింఛను చెల్లింపు లు కూడా ఈ కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. నేటి నుంచి శిక్షణ పల్లె సమగ్ర సేవాకేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్‌గా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 125 గ్రామాల నుంచి తగిన విద్యార్హతలున్న మహిళల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఆన్లైన్ సేవాకేంద్రం నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో శనివారం నుంచి రెండురోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. పల్లె సమగ్ర సేవాకేంద్రాలను గ్రామ పంచాయతీ భవనంలోనే ఏర్పాటు చేస్తారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మహిళకు వివిధ రకాల సేవలకు గాను లబ్ధిదారులు చెల్లించిన మొత్తం నుంచి కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం నిర్వాహకురాలికి నెలకు కనీసం రూ.7వేలు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
పంచాయతీల్లోనే అన్ని సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద సమగ్ర సేవా కేంద్రా (వన్‌స్టాప్ షాప్)లను పంచాయతీ కార్యాలయాల్లోనే ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ-పంచాయత్ వ్యవస్థను కూడా సమగ్ర సేవా కేంద్రాల్లోనే విలీనం చేయనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 150 మండలాల్లో ఈ ఏడాది వెయ్యి సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో మిగిలిన గ్రామాలకూ విస్తరించనున్నారు. వన్‌స్టాప్ షాప్‌ల ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకుకు అప్పగిస్తూ రూ. 64 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అన్ని సేవలూ ఒకేచోట.. గ్రామీణ ప్రజలకు ఈ-పంచాయత్, మీసేవ, శ్రీనిధి కియోస్క్‌ల నుంచి ప్రస్తుతం లభిస్తున్న సేవలన్నింటినీ ఇకపై ఒకేచోట లభ్యమయ్యేలా సమగ్ర సేవా కేంద్రాలను ఆయా సంస్థలకు అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా ఓఎస్‌ఎస్‌ల నుంచే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలను తెరుచుకునే సదుపాయం కల్పిస్తున్నారు. స్వయం సహాయక గ్రూపులకు పావలా వడ్డీ రుణాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఉపాధిహామీ కూలీలకు వేతన చెల్లింపులు, ఆసరా పెన్షనర్లకు పింఛను సొమ్ము.. తదితర చెల్లింపులన్నీ ఇక్కడ్నుంచే లభ్యమవుతాయి. అన్నిరకాల ధ్రువపత్రాల కోసం దరఖాస్తులను ఓఎస్‌ఎస్‌ల నుంచే సమర్పించవచ్చు. పొదుపు ఖాతాలు, నగదు జమ, డిపాజిట్లు, అన్ని రకాల చెల్లింపులు.. తదితర సేవలను సెప్టెంబర్ నుంచి ఓఎస్‌ఎస్‌ల నుంచే గ్రామంలోని ప్రజలందరూ పొందవచ్చు. నిర్వహణ బాధ్యత వీఎల్ఈలకే.. వన్‌స్టాప్ షాప్‌ల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక గ్రూపుల నుంచి మహిళల (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైనర్)ను ఎంపిక చేస్తారు. వీఎల్ఈ నియామకానికి ఇంటర్ విద్యార్హత కాగా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా చేసేందుకు అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.