one ticket
-
ఒకే టికెట్‌తో సిటీ బస్, మెట్రో, రైలులో ప్రయాణం.. ఎక్కడంటే!
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నై రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇక్కడికి రోజూ లక్షలాది మంది వచ్చివెళ్తుంటారు. ఇక 2026లో చెన్నై సరిహద్దులు పూర్తిగా మారిపోనున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలు, రాణిపేట జిల్లా పరిధిలోని అరక్కోణం వరకు 1,225 గ్రామాలు, ప్రాంతాలు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి రానున్నాయి. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలు 1,189 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండగా.. సరిహద్దు మార్పుతో అది ఏకంగా 5,904 చదరపు కిలోటమీటర్లకు చేరనుంది. కొత్తగా చెన్నై నగర సరిహద్దు చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం వరకు, రాణి పేట జిల్లా అరక్కోణం వరకు ఉండనుంది. ఈ విస్తరణ నేపథ్యంలో చెన్నై మహా మహా నగరంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా ఒకే గూటి కిందికి తెచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎండీఏ చుట్టూ రవాణా.. ప్రధాన రవాణా వ్యవస్థలుగా చెంగల్పట్టు నుంచి బీచ్ వరకు, సెంట్రల్ నుంచి అరర్కోణం , గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ రైలు సేవలు, బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీఎస్ రైలు సేవలు చెన్నైలో ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల విమానాశ్రయం నుంచి కోయంబేడు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్‌కు ఓ మార్గం, సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఆలందూరు మీదుగా అన్నా సాలై వైపుగా సెంట్రల్‌కు మారో మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ఎంఆర్టీఎస్ సేవలు మరికొన్ని నెలల్లో వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు విస్తరించనున్నాయి. అలాగే మెట్రో సేవలు చెన్నై నగర శివారుల్లో ఓ వైపు కీలాంబాక్కం వరకు, మరోవైపు సిరుచ్చేరి వరకు, ఇంకో వైపు మాధవరం వరకు విస్తరించనున్నాయి. ఈ నగరానికి నలుదిశల్లో మెట్రో ప్రయాణమే కాకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థను సులభతరం చేయనున్నారు. ఇందుకోసం కంబైన్డ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ రంగంలోకి దిగింది. మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్‌లను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసింది. 2024లో అందుబాటులోకి.. ఒకే గూటి కిందికి అన్ని రకాల రవాణా సేవలను తీసుకొచ్చేందుకు కంబైన్డ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ వేగవంతం చేసింది. ఒకే టికెట్టుతో పైన అన్ని రకాల రవాణా సేవలను ప్రజలు పొందేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయా మార్గాలను ఏకం చేయడం, రైల్వేతో అనుసంధానించడం, బస్టాండ్ల ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా మార్గాలను సులభతరం చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రయాణ టికెట్ పొందేందుకు వీలుగా రూట్ మ్యాప్‌తో పాటు అన్ని రకాల రవాణా సమాచారం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా ప్రయాణికులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాప్‌లో ప్రయాణంలో బయలుదేరే ప్రాంతం, సమయం, చేరవలసిన ప్రాంతం గురించి వివరాలను, మధ్యలో ఉన్న అన్ని రకాల రవాణాలకు సంబంధించిన స్టేషన్లు, స్టాపింగ్‌ల సమాచారం ఉంటుంది. చేరవలసిన రూట్ మ్యాప్ ఆధారంగా వివరాలను నమోదు చేసిన పక్షంలో చార్జీ మొత్తం వివరాలు యాప్ ద్వారా తెలుసుకుని ఆన్లైన్ నగదు బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు. ఒకే టికెట్టు ద్వారా అన్ని రకాల రవాణా సేవలను 2024 జనవరిలో అమల్లోకి తెచ్చే విధంగా ఆ అథారిటీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. -
Congress chintan shivir: ప్రజలతో బంధం తెగింది
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: దేశ ప్రజలతో కాంగ్రెస్ బంధం తెగిపోయిందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొని బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అక్టోబర్‌లో దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. చింతన్ శిబిర్‌లో ముగింపు సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక కుటుంబం, ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉద్ఘాటించారు. ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పార్టీ కోసం పనిచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని అన్నారు. ‘‘నేను మీ కుటుంబం, మీరు నా కుటుంబం. ఇది ఒక కుటుంబం. నా పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంపైనే. అది దేశానికి ముప్పుగా మారింది. మనం కేవలం ఒక రాజకీయ పార్టీతో కాదు, దేశంలో అతిపెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం’’ అని చెప్పారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ వంటి శక్తులకు తాను భయపడనని పేర్కొన్నారు. ‘‘నేను జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. భరతమాత నుంచి ఒక పైసా కూడా తీసుకోలేదు. కాబట్టి నాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల దగ్గర ఎక్కువ డబ్బులున్నాయ్ రానున్నది చాలా కఠినమైన పోరాటమని రాహుల్ చెప్పారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని తెలిపారు. భారతదేశ సంస్థాగత నిర్మాణాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు పని చేయడం మానేసిన రోజు మనమంతా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతామన్నారు. ఇప్పటికే అలాంటి పరిస్థితులు చూస్తున్నామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలతో కలిసి పోరాడటం, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ బాధ్యత అని వివరించారు. నాయకుల దృష్టి అంతా ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంపైనే ఉండాలన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెమట చిందించాల్సిందేనని.. ఇది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఉద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్థులను అధిగమించేలా పని చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు. మన దగ్గరి కంటే ప్రత్యర్థుల వద్దే ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పారు. అందుకే వారిలాగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగతంగా యువత, సీనియర్లతో కూడిన మిశ్రమ నాయకత్వం ఉండాలని చెప్పారు. -
Congress Chintan Shivir: ఒక కుటుంబం.. ఒకే టికెట్
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: భవిష్యత్ ఎన్నికల్లో ‘ఒక కుటుంబం, ఒకే టిక్కెట్’ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్ ఆశించే వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఉండాలి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ శుక్రవారం ప్రారంభమైంది. పార్టీలో మార్పు తీసుకొచ్చే దిశగా నేతలు మథనం సాగిస్తున్నారు. ‘ఒక కుటుంబం.. ఒకే టిక్కెట్’ సహా అనేక నియమాలను ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో ఆమోదించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన, మినహాయింపు ఫార్ములా గాంధీ కుటుంబంతో సహా పార్టీ శ్రేణులందరికీ వర్తిస్తుందని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఈ నిబంధనపై పార్టీలో దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. ఐదేళ్ల తర్వాత ఎవరినీ పార్టీ పదవి కొనసాగించకూడదని, మళ్లీ అదే పోస్టు కోరితే కనీసం మూడేళ్లు కూలింగ్ పీరియడ్‌లో ఉంచాలన్న అంశాలపై చింతన్ శిబిర్‌లో చర్చ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కాంగ్రెస్‌లో ప్రతి స్థాయిలో ఉన్న పార్టీ కమిటీల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం (ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ) పదవులు కేటాయించాలనే ప్రతిపాదన సైతం పార్టీ పెద్దల పరిశీలనలో ఉంది. పార్టీలో ఎలాంటి పని చేయనివారి పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ రాజకీయ ప్యానెల్ సభ్యుల మధ్య దాదాపు పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరును పర్యవేక్షించేందుకు ‘అసెస్మెంట్ వింగ్’ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, ఎన్నికలకు సమాయత్తం కావడానికి సర్వేలు చేసేందుకు ‘ప్రజా అంతర్దృష్టి విభాగం’ ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయి. పార్టీలో బూత్, బ్లాక్ స్థాయిల మధ్య మండల కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో మండల కమిటీలో 15–20 బూత్‌లు ఉంటాయి. బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో 3–4 మండలాలు ఉంటాయి. చింతన్ శిబిర్ కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్స్ చేసిన సూచనలను ఆమోదించిన తర్వాత పార్టీలో అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కనిపించనుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. చింతన్ శిబిర్‌లో మొదటి రెండు రోజులు చర్చలు సాగుతాయి. చివరి రోజు తీర్మానం చేస్తారు. ఈ తీర్మానం ముసాయిదాపై అదే రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చిస్తారు. సెల్ ఫోన్లకు అనుమతి లేదు! ఉదయ్‌పూర్‌లోని తాజ్ ఆరావళి రిసార్ట్‌లో జరుగుతున్న నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో దాదాపు 450 మంది నేతలు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి రైలులో ఉదయ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నేతలు, కార్యకర్తలు రాజస్థానీ సంప్రదాయ స్వాగతం పలికారు. చర్చల వివరాలు బయటికి పొక్కకుండా మొబైల్ ఫోన్లను హాల్ బయట డిపాజిట్ చేసిన తర్వాతే నేతలను లోపలికి అనుమతించారు. వేదిక వద్ద మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా కాంగ్రెస్ దిగ్గజాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు నేతల సందడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు చింతన్ శిబిర్కు హాజరయ్యారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు. -
నా భార్య తప్పుకోవాల్సిందే!: అమరిందర్ సింగ్
అమృత్సర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ (వన్ ఫ్యామిలీ-వన్ టికెట్) ఇస్తామని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ స్పష్టంచేశారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను అసలు మార్చే ఉద్దేశమే లేదని, అలా చేస్తే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఏది ఏమైనా ఈ రెండు ఫార్ములాలను మార్చేది లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన తర్వాత వచ్చే వారం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. వన్ ఫ్యామిలీ-వన్ టికెట్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తన భార్య, పాటియాలా ఎమ్మెల్యే ప్రిణీత్ కౌర్ కు టికెట్ ఇవ్వలేదని (తన కోసం ఎలక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు) చెప్పారు. రాష్ట్రంలో మరికొందరు నేతల ఇళ్లల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఇతర నియోజకవర్గాల నుంచి బరిలో దింపితే ప్రతికూల ఫలితాలు వస్తాయని, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇది తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని కెప్టెన్ అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే జనరల్ సీట్లను మాత్రమే వారికే ఇస్తామని, 34 శాతం ఉన్న రిజర్వ్డ్ స్థానాల్లో కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం గానీ, నియోజకవర్గాల మార్పు చేయడం తదితర అంశాలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకే 61 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించామని, ఇక మిగిలిన 56 సీట్లను పార్టీ ఎలక్షన్ కమిటీ భేటీ అనంతరం వెల్లడిస్తామన్నారు. ఈ సారి ఎలాగైనా అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీని గెలిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు.