జమ్ము-శ్రీనగర్ హైవేలో వన్ వే ట్రాఫిక్
శ్రీనగర్: జమ్మూ-శ్రీనగర్ హైవేలో వాహనాలను శనివారం వన్ వేలో మాత్రమే అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. రోడ్డు మార్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఆర్మీ, పారామిలిటరీ బలగాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ప్రయాణించే వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు.
కశ్మీర్ లోయకు సరుకుల రవాణాకు ఉపయోగించే ఏకైక మార్గం ఇదే కావడంతో రోడ్డు మూసివేత ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చలికాలంలో కొండచరియలు విరిగిపడటం, మంచు కారణంగా ఈ రోడ్డును అధికారులు మూసివేసి ఉంచారు. ఈ సమయంలో పర్యాటకులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.