వారంలోగా హరితహారం టార్గెట్ పూర్తి
కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్
నేలకొండపల్లి: మొక్కలు నాటడం, పెంపకం కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని మరో వారంలోగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం నేలకొండపల్లి మండలం ఆరెగూడెం, కోనాయిగూడెం గ్రామాల్లో హరితహారం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..జిల్లాలో 3.9 కోట్ల మొక్కలు నాటాలన్నది టార్గెట్ అని, ఇప్పటికే 1.9 కోట్ల మొక్కలను నాటించామని తెలిపారు. మరో వారంలో మిగిలిన మొక్కలు కూడా నాటించాలన్నది లక్ష్యంగా వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా నాటాలని, కాల్వ కట్టలపై మొక్కలు వేయించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు కూడా మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించినట్లు వివరించారు. ప్రతి మండలంలో హోం సీడ్ మొక్కలను ఐదు వేల వరకు నాటేలా చూడాలన్నారు. నాటిన మొక్కలను డిసెంబర్ వరకు సంరక్షించుకోవాలని, ఆ తర్వాత అవే ఎదుగుతాయని తెలిపారు. ఆన్లైన్ ఇబ్బందుల వల్ల దాదాపు 29 వేల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మ్యాన్యువల్ పహనీలు ఇప్పిస్తామని, రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ.3300 కోట్ల రుణాలకు గాను రూ.1100 కోట్లు చెల్లించామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ వసంత, ఈజీఎస్ ఏపీఓ సునీత, ఏఓ నారాయణరావు, సర్పంచ్ కొమ్మినేని కృష్ణయ్య, ఈఓఆర్డీ ప్రభాకర్, వీఆర్వో చైతన్యభారతి తదితరులు పాల్గొన్నారు.