జిల్లా పోలీస్‌శాఖకు డ్రోన్
► డెమోను పర్యవేక్షించిన ఒంగోలు డీఎస్పీ
ఒంగోలు : జిల్లా పోలీసు యంత్రాంగానికి డ్రోన్ రూపంలో మరో అధునాతన పరికరం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రతి జిల్లాకు ఒక డ్రోన్‌ను కేటాయించింది. దానిలో భాగంగా జిల్లాకు కేటాయించిన డ్రోన్‌ను ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సోమవారం కలెక్టరేట్ వద్ద ప్రదర్శించారు. డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుందో స్వయంగా ఆయన పరిశీలించారు. ముందుగా ప్రకాశం భవనం ముందు భాగంలో డ్రోన్‌ను పరీక్షించారు.
అనంతరం ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు వెళ్లే మార్గంలో మరోమారు పరీక్షించారు. డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుందో డీఎస్పీ వివరించారు. డ్రోన్‌ను ఒక కిలోమీటర్ ఎత్తుకు పంపి మూడు కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న సంఘటనలను దానికి అనుసంధానం చేసిన అధునాతనమైన కెమేరా సాయంతో రిమోట్ కంట్రోల్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. క్వాలిటీ కలిగిన ఫొటోల ద్వారా అక్కడి పరిస్థితులను తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందన్నారు. కేసులకు సంబంధించిన దర్యాప్తులకు ఈ డ్రోన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సభలు, సమావేశాలు జరిగే సమయంలో, ప్రకాశం భవనం ముందు జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను కూడా దీని ద్వారా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు.
అంతేగాకుండా వరదలు పంట విపత్తులు సంభవించిన సమయంలో డ్రోన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనుమానాస్పద భవనాలపై ఎవరున్నారన్న విషయాలను కూడా దీని ద్వారా చూడవచ్చన్నారు. 500 నుంచి 600 మీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో కూడా డ్రోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా నీటిపై మృతదేహాలుంటే వాటి ఆనవాళ్లను కూడా డ్రోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాకు కేటాయించిన డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.