ongole mla
-
ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయం..
ఒంగోలు: స్థానిక గద్దలగుంట పారువేట కార్యక్రమం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు గద్దలగుంట పారువేటకు వచ్చారు. గద్దలగుంట ముఖ ద్వారంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు నేతృత్వంలో ఏర్పాటైన పాటకచ్చేరికి బాలినేని, ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక గద్దలగుంటలోని నాగార్పమ్మతల్లి, అంకమ్మ తల్లి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, శ్రీకోదండ రామస్వామి ఆలయం, అంకమ్మ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన పాటకచ్చేరి కార్యక్రమానికి బాలినేని, మాగుంట ఇరువురు హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సంయుక్తంగా వాల్తేరు వీరయ్య సినిమా కేక్‌ను కట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి వేగం అవుతుందన్నారు. చిరంజీవి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, ఆయన సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో తమ కుటుంబానికి మంచి బంధం ఉందని అన్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీరయ్యగా చిరంజీవి అభిమానులు పేర్కొంటుండడం మరింత ఆనందంగా ఉందన్నారు. అనంతరం అక్కడ నుంచి గాంధీబొమ్మ సెంటర్లో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఏర్పాటు చేసిన పాటకచ్చేరిలో ఇరువురు పాల్గొన్నారు. ఇక్కడ బాలినేని, మాగుంటను వైఎస్సార్ సీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, కార్పొరేటర్ తాడి కృష్ణలత సత్కరించారు. రాజరాజేశ్వరస్వామి అమ్మవారు, గద్దలగుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇరువురు గద్దలగుంట నెహ్రూబొమ్మ సెంటర్లోని పాట కచ్చేరిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. మీ వాడిని.. ఎప్పుడూ అందుబాటులో ఉంటా ‘‘నేను మీ వాడిని... మీతో కలిసి పెరిగిన వాడ్ని..తిరిగిన వాడ్ని... నా బాల్యం అంతా గద్దలగుంటలోనే గడిచింది. ఇక్కడి ప్రజల ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... గద్దలగుంటతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. ఇప్పటికే గద్దలగుంటలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, మరో వారం రోజుల్లో రూ.10 లక్షలతో మహిళా భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గద్దలగుంటలో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డిని కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు కమిటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్‌బాబు, కాపు కళ్యాణ మండపం చైర్మన్ టీవి రంగారావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివరావు, కమిటీ సభ్యులు ఈదుపల్లి అంకబాబు, కాటా నాగేశ్వరరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, చిట్టెం వెంకటేశ్వర్లు, తోటకూర చైతన్య, మలిశెట్టి రాజేంద్రప్రసాద్, దండే వెంకటేశ్వర్లు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. (క్లిక్ చేయండి: 2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా) -
టీడీపీ ఎమ్మెల్యేపై హెచ్చార్సీలో ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై సోమవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందంటూ దామచర్లకు చెందిన ముస్లిం జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలపై ఉద్యమించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని షేక్ మహమ్మద్ ఆరోపించారు. ఫిర్యాదుపై స్పిందించిన హెచ్చార్సీ ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 19లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఒంగోలు ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. -
పచ్చని బతుకుల్లో చిచ్చుపెట్టారు
♦ దుకాణాలు కూల్చిన చోటే స్థలాలు కేటారుుంచాలి ♦ లేదంటే పిల్లలతో సహా ఇక్కడే చస్తాం ♦ ఒంగోలు ఎమ్మెల్యేకి ముస్లిం మహిళల అల్టిమేటం ♦ బండ్లమిట్టలో పర్యటించిన దామచర్లపై స్థానికుల ఆగ్రహం ♦ అధికారులది తొందరపాటు చర్యేనన్న ఎమ్మెల్యే ♦ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పుకునే యత్నం ♦ కార్పొరేషన్ అధికారులపై చర్యలకు బాధితుల పట్టు ‘పండుగ రోజుల్లో సంతోషం నిండాల్సిన పేదల బతుకుల్లో ఆరని చిచ్చు పెట్టారు. 30 ఏళ్లు కాదు.. 60 ఏళ్లుగా మా కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నారుు. కనీస సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి దుకాణాల్ని, నివాసాల్ని అడ్డగోలుగా కూల్చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. కూల్చిన చోటే మాకు స్థలాలు కేటారుుంచండి. లేదా పిల్లలతో సహా ఇక్కడే ప్రాణాలొదిలేస్తాం’ అంటూ ముస్లిం మహిళలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అల్టిమేటం ఇచ్చారు. బండ్లమిట్టలో నగరపాలక సంస్థ అధికారులు కూల్చేసిన ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒంగోలు: ఒంగోలు నడిబొడ్డున, ఊరచెరువు ఒడ్డున చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న పేదలపై ఈనెల 14వ తేదీన నగర పాలక సంస్థ అధికారులు ప్రతాపం చూపించారు. పొక్లెనర్లతో వచ్చి, పోలీసు బలగాలను అడ్డుపెట్టి బండ్లమిట్టలోని రోడ్డు పక్కనున్న దుకాణాలను కూలగొట్టారు. ఈ ఘటన చిలికిచిలికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సేవ కేంద్రం నుంచి బండ్లమిట్టలోని నాలుగురోడ్ల కూడలి వరకు పరిశీలించిన ఆయన కొద్దిసేపు మసీదు వద్ద ముస్లింలతో మాట్లాడేందుకు యత్నించారు. వారికి నచ్చజెప్పేందుకు యత్నించగా ముస్లిం మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండుగ రోజుల్లో కనీసం పిల్లలకు కాసింత భోజనం పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని, రోజంతా కష్టపడితేగాని తమకు పొట్ట గడవదని, అలాంటి తమపై ఎందుకు ఇంత కక్షగట్టారంటూ ప్రశ్నించారు. పట్టాలు చూపించి మొరపెట్టుకున్నా కమిషనర్ కనికరించలేదని, నిర్థాక్షిణ్యంగా పోలీసుల అండతో కూల్చివేశారని వాపోయారు. మూడు నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని కమిషనర్ చెప్పడం అబద్దం అన్నారు. కేవలం కుట్రపూరితంగా ముస్లింలపై కక్షతోనే ఈ దాడికి యత్నించారని ఆరోపించారు. తాము ఎన్నిసార్లు ఫోన్‌చేసినా మీ ఫోన్ కలవలేదని పేర్కొన్నారు. న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యే చెప్పేందుకు యత్నించారు. దుర్మార్గంగా కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ సిబ్బందిని ఉద్దేశించి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలకు వెనుకడుగు.. అధికారులది తొందర పాటు చర్చేనని అంగీకరించిన ఎమ్మెల్యే దామచర్ల వారిపై చర్యలకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. బాధితులు పట్టాలు చూపిస్తున్నా అధికారులు లెక్కచేయకపోవడం, అసలు పట్టాలె లా వచ్చాయనే విషయూన్ని పరిశీలించకపోవడంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. నష్టపోయిన వారిని ఏ విధంగా ఆదుకుంటార నే ప్రశ్నకూ స్పష్టత ఇవ్వలేదు. తమ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి చాలా స్థలాలు ఉన్నాయని, అందుకోసం దుకాణాల్ని కూల్చలేదని మాత్రం బదులిచ్చారు. మాపైనే ఎందుకీ కక్ష.. నివాసస్థలాల కోసం పట్టాలు ఇచ్చామంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. నగరంలో ఎన్నిచోట్ల నివాస స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నా తమపైనే ఎందుకు యుద్ధకాండను తలపించేలా దాడిచేశారో సమాధానం చెప్పాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి సంబంధం లేకపోతే నోటీసులు ఇవ్వకుండా దాడిచేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తొందరపాటు చర్యే.. నగరంలో మెట్లు పడగొట్టాలన్నా ముందు నోటీసులివ్వమని అధికారులకు సూచించా. పండుగ మాసంలో ఉపవాసంలో ఉండగా ముస్లింల కట్టడాలు కూల్చడం బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులు తొందరపాటు చర్యే. ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అధికారులు తీసుకున్న చర్యే. బాధితులకు జరిగిన నష్టంపై ఒకటి రెండు రోజుల్లో అంచనాకు వస్తాం. మసీదుకు సంబంధించి కూడా వారి మతపెద్దలతో మాట్లాడతాం. తదుపరి ఎలా ఆదుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. - దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎమ్మెల్యే -
రిమ్స్‌లో సమస్యలపై ప్రత్యేక కమిటీ
ఒంగోలు సెంట్రల్ : స్థానిక రిమ్స్‌లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ అంజయ్య, ఇతర అధికారులు, భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీర్లు, మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి బుధవారం రిమ్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం రిమ్స్ లెక్చర్‌హాల్‌లో వారందరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ అంజయ్య మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) వారు రిమ్స్‌లో ఎంబీబీఎస్ నాలుగో ఏడాది తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు కారణమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఎంసీఐ బృందాన్ని మరోసారి తనిఖీలకు ఆహ్వానిస్తూ దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రిమ్స్‌లో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్‌లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. రిమ్స్‌లో సమస్యలపై ఆ కమిటీ ప్రతినెలా సమీక్షిస్తుందన్నారు. మెడికల్ కాలేజీ, సిబ్బంది క్వార్టర్స్, ఇతర భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వంతో మాట్లాడి ఎంసీఐ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగాన్ని పరిశీలించి సిబ్బందికి వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమకు వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య విభాగం సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పలువురు రోగులు, వారి బంధువులు రిమ్స్‌లో నెలకొన్న మంచినీరు, మరుగుదొడ్లు, ఐసీయూలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంవో డాక్టర్ బాలాజీనాయక్ పాల్గొనగా, ఎమ్మెల్యే వెంట ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు ఉన్నారు.