రిమ్స్‌లో సమస్యలపై ప్రత్యేక కమిటీ
ఒంగోలు సెంట్రల్ : స్థానిక రిమ్స్‌లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ అంజయ్య, ఇతర అధికారులు, భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీర్లు, మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి బుధవారం రిమ్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం రిమ్స్ లెక్చర్‌హాల్‌లో వారందరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ అంజయ్య మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) వారు రిమ్స్‌లో ఎంబీబీఎస్ నాలుగో ఏడాది తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు కారణమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఎంసీఐ బృందాన్ని మరోసారి తనిఖీలకు ఆహ్వానిస్తూ దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
రిమ్స్‌లో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్‌లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. రిమ్స్‌లో సమస్యలపై ఆ కమిటీ ప్రతినెలా సమీక్షిస్తుందన్నారు. మెడికల్ కాలేజీ, సిబ్బంది క్వార్టర్స్, ఇతర భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రభుత్వంతో మాట్లాడి ఎంసీఐ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగాన్ని పరిశీలించి సిబ్బందికి వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమకు వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య విభాగం సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పలువురు రోగులు, వారి బంధువులు రిమ్స్‌లో నెలకొన్న మంచినీరు, మరుగుదొడ్లు, ఐసీయూలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రిమ్స్ ఆర్‌ఎంవో డాక్టర్ బాలాజీనాయక్ పాల్గొనగా, ఎమ్మెల్యే వెంట ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు ఉన్నారు.