Online shopping Company
-
అమెజాన్ ప్రత్యర్థి కంపెనీలో సంక్షోభం! భారీగా ఉద్యోగాల తొలగింపు..
Zulily: ఒకప్పుడు 7 బిలియన్ డాలర్ల విలువతో అమెజాన్‌కు ప్రత్యర్థిగా ఉన్న ఆన్లైన్ షాపింగ్ సంస్థ జులిలీ.. అమెరికాలో కార్యకలాపాలను మూసివేస్తూ వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. సీటెల్‌తోపాటు వాషింగ్టన్‌లోని పలు ప్రాంతాలలో 292 మంది కార్మికులను జులిలీ తొలగించిందని, ఇది ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని అక్కడి రాష్ట్ర ఉపాధి భద్రతా విభాగం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు సీటెల్ టైమ్స్ వార్తా సంస్థ నివేదించింది. గీక్‌వైర్ అనే న్యూస్ సైట్ ప్రకారం.. 13 ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జులిలీ తన పయనీర్ స్క్వేర్ ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అనేక ఇతర కేంద్రాలను కూడా మూసివేస్తోంది. నెవాడా, ఒహియోలోని గిడ్డంగులను మూసివేయడం వల్ల మరో 547 మంది కార్మికుల తొలగింపులు జరుగుతాయని రెండు రాష్ట్రాల నోటీసుల ప్రకారం తెలుస్తోంది. తాజా ఉద్యోగాల కోతలకు ముందు కూడా జులిలీలో పలు రౌండ్ల తొలగింపులు జరిగాయి. అక్టోబర్‌లో కంపెనీ సీఈవో టెర్రీ బాయిల్ రాజీనామా చేశారు. 2010లో ప్రారంభం ఆన్లైన్ జ్యువెలరీ రిటైలర్ బ్లూ నైల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ వాడోన్, డారెల్ కావెన్స్ 2010లో జులీలీని ప్రారంభించారు. 2013 నాటికి జులీలీ 1.26 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉంది. 331 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2010 కంటే దాదాపు 700 శాతం అధికం. 2013లో ఐపీఓకి వచ్చినప్పుడు జులీలీ 2.6 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండగా మొదటి రోజు ముగిసే సమయానికి ఆ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది. 2014 నాటికి జులీలీ 1 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 7 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. అమెజాన్, ఓల్డ్ నేవీ కంపెనీలు మాత్రమే తక్కువ సమయంలో బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును చేరుకున్నాయి. 2015లో జులిలీని లిబర్టీ ఇంటరాక్టివ్-క్యూవీసీ 2.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని క్యూరేట్‌గా పేరు మార్చింది. ఈ ఏడాది మేలో కంపెనీని లాస్ ఏంజిల్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రీజెంట్‌కు విక్రయించింది. -
గుడ్ న్యూస్, మరింత సులభతరం కానున్న లావాదేవీలు
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. సైబర్ నేరాల నుంచి వినియోగదారుల నుంచి రక్షించేందుకు ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 2022,జనవరి నెల నుంచి ఆన్లైన్ చెల్లింపుల్లో భారీ మార్పులు చేస్తూ టోకెనైజేషన్ వ్యవస్థను అమలులోకి తీసుకు రాన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రానున్న కాలంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం కానున్నాయి. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో కావాల్సిన ప్రాడక్ట్స్ ఆర్డర్ పెట్టాలంటే తప్పని సరిగా కార్డ్ డీటెయిల్స్ తో పాటు వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే త్వరలో అమలు కానున్న కొత్త పద్దతుల్లో వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సురక్షితంగా ఉండేలా కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం క్యూఆర్ కోడ్ చెల్లింపులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ (రిటైల్ స్టోర్లలో కార్డ్ లావాదేవీలను నిర్వహించడానికి ఉపయోగించే హార్డ్‌వేర్) లావాదేవీలను నిర్వహించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. టోకెనైజేషన్ వ్యవస్థ పనితీరు ► ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే..కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది ► వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ) గా పనిచేస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు టోకెన్లను అందించడం లేదా ఏదైనా మొబైల్ చెల్లింపులకు బాధ్యత వహిస్తాయి. ► టోకెన్‌తో కార్డ్ నంబర్, సీవీవీ వివరాల్ని షేర్ చేసే అవసరం ఉండదు. ► టోకెనైజేషన్‌తో అన్ని ప్లాట్‌ఫాంలలో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ► ఈ ప్రక్రియ లావాదేవీ ప్రారంభించిన ప్రతిసారి యూజర్ల డేటాను షేర్ చేసే అవసరం ఉండదు. ఆన్లైన్ చెల్లింపులు స్పీడుగా చేసుకోవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టోకనైజేషన్ వ్యవస్థ సులభతరం అయినప్పటికీ దాని అమలు, భద్రత ఎంతవరకు అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తెలియాల్సి ఉంటుంది. చదవండి: క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే.. -
స్నాప్‌డీల్ చేతికి ఎక్స్క్లూజివ్లీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా లగ్జరీ ఫ్యాషన్ పోర్టల్ ఎక్స్క్లూజివ్లీ డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకు ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఫ్యాషన్ వ్యాపార విభాగం కింద 1 బిలియన్ డాలర్ల మేర స్నాప్‌డీల్ ద్వారా విక్రయాలు జరుగుతుండగా.. కొత్త డీల్‌తో ఇది 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా. 4 కోట్ల పైచిలుకు ఉన్న యూజర్లకు మరిన్ని లగ్జరీ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎక్స్క్లూజిలివ్లీని కొనుగోలు చేసినట్లు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ఎక్స్క్లూజివ్లీ ఇకపై కూడా స్వతంత్ర వెబ్‌సైట్‌గానే పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ మనీష్ మల్హోత్రా, తరుణ్ తహ్లియానీ, మనీష్ అరోరా, రోహిత్ బాల్, నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన డిజైన్స్‌ను విక్రయిస్తోంది. -
షాప్క్లూస్లోకి రూ.615 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ షాప్‌క్లూస్ దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 615 కోట్లు) పెట్టుబడులు సమీకరించినట్లు సోమవారం తెలిపింది. టైగర్ గ్లోబల్ సారథ్యంలోని ఇన్వెస్టర్ల గ్రూప్ తాజా విడత నిధులు ఇన్వెస్ట్ చేసింది. గతంలో ఏంజెల్, ఏ, బీ, సీ విడతల కింద నిధులు సమీకరించిన షాప్‌క్లూస్ తాజా ఫండింగ్‌ను సిరీస్ డీ కింద దక్కించుకుంది. కంపెనీలో ఇంతకు ముందు హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2011లో ప్రారంభమైన షాప్‌క్లూస్ ప్రస్తుతం ప్రతి నెలా 15 లక్షల లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇందులో 70 శాతం వ్యాపారం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే వస్తోంది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల వ్యాపార పరిమాణం రూ. 1,500 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు షాప్‌క్లూస్ వెల్లడించింది.