గోల్డ్ బాండ్లను బహుమతిగా ఇవ్వవచ్చా?
నా వయస్సు 43 సంవత్సరాలు. నేనొక బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకున్నాను. నాకు ఒక మంచి బీమా పాలసీ సూచించండి.
–రంజిత్, హైదరాబాద్
బీమా కోసమైతే, ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకోవడం మంచిది. బీమా రక్షణ అధికంగానూ, ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి.సాంప్రదాయ బీమా పాలసీల్లో అయితే వ్యయాలు అధికంగా ఉంటాయి. దీంతో మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్ అధికంగా ఉంటుంది. పైగా తగిన బీమా రక్షణ ఇవ్వలేవు. కానీ టర్మ్ బీమా పాలసీలు దీనికి భిన్నం. వీటిల్లో అనవసర వ్యయాలేమీ ఉండవు. మీ ఉద్యోగం లేదా వృత్తి, సంపాదన తదితర వివరాలు వెల్లడించలేదు. అందుకని 43 సంవత్సరాల సగటు వ్యక్తికి సరిపడే బీమా పాలసీలను సూచిస్తున్నాం. రూ. కోటి బీమా కవర్‌కు మీరు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియమ్ వివరాలను కూడా అందిస్తున్నాం. . మీకు 60 ఏళ్లు వచ్చే వరకూ అంటే 17 సంవత్సరాల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. మీ కోసం మూడు బీమా పాలసీలను, వాటి వార్షిక వివరాలు, ఆయా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి వివరాలను పొందుపరుస్తున్నాం. ఏగాన్ ఐ టెర్మ్ ప్లాన్– ఈప్లాన్‌లో మీరు ఏడాదికి రూ.13,394 ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.63 శాతంగా ఉంది. మ్యాక్స్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్‌లో అయితే వార్షిక ప్రీమియమ్ రూ.13,995గా ఉంటుంది. ఈ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి కూడా 98.63 శాతంగా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ క్లిక్2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్‌కు ఏడాది ప్రీమియమ్ రూ.16,861గా ఉంది. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.06 శాతంగాఉంది. బీమా పాలసీ తీసుకునేటప్పుడు, మీకు సంబంధించిన అన్ని వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య పరిస్థితులను వెల్లడించండి. ఇలా చేయడం వల్ల బీమా పాలసీ క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
నేను సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ రూ.50,000 సావరిన్ గోల్డ్ బాండ్‌ను నా మనవరాలికి బహు మతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అది సాధ్యమేనా ? వివరాలు తెలపండి.
–జానకీ రామ్, విశాఖపట్టణం
మీరు ఇన్వెస్ట్ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ)ను ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. లేదా బదిలీ చేయవచ్చు. మైనర్లకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, వారి తల్లిదండ్రులు కానీ, సంరక్షకులు కానీ మైనర్ల తరపున ఆ బాండ్లను హోల్డ్ చేస్తారు. బహుమతిగా ఇవ్వడానికి లేదా బాండ్లను బదిలీ చేయడానికి సంబంధించిన విధి, విధానాలు చాలా సులభం. ఈ ప్రక్రియను మీరు ఎక్కడైతే ఆ బాండ్లను కొనుగోలు చేశారో. ఆ బ్యాంక్/ఏజెంట్/పోస్ట్ ఆఫీస్ పూర్తి చేస్తుంది. పూర్తి వివరాలకు మీరు ఈ గోల్డ్ బాండ్లను ఎక్కడ కొనుగోలు చేశారో, అక్కడ సంప్రదించండి.
నేను ఎల్ఐసీ న్యూ జీవన్ సురక్ష పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ కోసం ఏడాదికి కొంత మొత్తం ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఈ ప్రీమియమ్లకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద పన్ను మినహాయింపులు పొందవచ్చా? అలా వీలుంటే ఎంత వరకూ మినహాయింపులు పొందవచ్చు.
–సురేశ్, తిరుపతి
బీమా పాలసీల ప్రీమియమ్‌లపై పన్ను మినహాయింపులను ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద పొందే వీలు లేదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) టైర్–1 అకౌంట్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి మాత్రమే రూ.50,000 వరకూ సెక్షన్80 సీసీడీ(1బీ) కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద లభించే పన్ను మినహాయింపు రూ.లక్షన్నరకు ఇది అదనం. బీమా, పెన్షన్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియమ్లకు సెక్షన్ 80సీ నుంచి పన్ను మినహాయింపులు పొందవచ్చు.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్