'ఆన్లైన్ రివ్యూలపై ఆధారపడొద్దు'
బోస్టన్: వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లోని రివ్యూలపై ఆధారపడుతున్నారా? అయితే, మీకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఎలాంటి ఉత్పత్తి లేదా వస్తువుకైనా యావరేజ్ స్కోరింగ్‌తో పాటు రివ్యూలను భారీగా ఇవ్వటం వెబ్సైట్లు, యాప్‌లలో సర్వసాధారణంగా జరిగేదే. ఆన్లైన్లో రివ్యూలను చూసి వస్తువులను కొనుగోలు చేసే అలవాటున్న 132 మందిని సర్వే చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని స్టాన్ఫోర్డ్ వర్సిటి పరిశోధకుడు డెరెక్ పావెల్ వెల్లడించారు.
ఉదాహరణకు అమెజాన్.కామ్ వెబ్సైట్లో లభ్యమయ్యే ఉత్పత్తులకు సంబంధించి చూస్తే.. ఇందులోని రివ్యూలకు, వాటికిచ్చే సరాసరి రేటింగ్‌లకు ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు విశ్లేషించారు. ఎవరైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు.. ఎక్కువమంది ఏ బ్రాండ్‌కు చెందిన లేదా ఎలాంటి వస్తువును కొనుగోలు చేశారనేది తెలుసుకునేందుకు కొందరు పెట్టిన రివ్యూలపై ఆధారపడుతున్నారు.
అయితే, ఇలాంటి సందర్భాల్లో సదరు కొనుగోలు దారులు నష్టపోతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉండే తప్పుడు రివ్యూలను నమ్మి నాసిరకం వస్తువులను వీరు కొనుగోలు చేస్తున్నట్లు రుజువైంది. తక్కువ రేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కువ రివ్యూలు ఉన్న ప్రొడక్టులను కొనుగోలు చేయటం తెలివైన పని కాదని పరిశోధనకులు చెబుతున్నారు.