మళ్లీ కరెంట్ కోతలు
=నేటినుంచి అమలు
=విజయవాడలో 2, బందరులో 3 గంటలు
=మున్సిపాలిటీల్లో 4, మండల కేంద్రాల్లో 6 గంటలు
విజయవాడ, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా కరెంటు కోతలు గురువారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైడల్ పవర్ జనరేషన్‌కు కావాల్సిన నీటి కొరత కారణంగా రాష్ట్రంలో అనేక థర్మల్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కోతల వేళల షెడ్యూల్‌ను రివైజ్ చేస్తున్నట్లు వివరించారు.
ఈ విద్యుత్ కోతల సమయాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 8 వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు, ఇతర మున్సిపాలిటీలలో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, తిరిగి 12 గంటల నుంచి 2 వరకు కరెంట్ ఉండదని వివరించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.