orbiter
-
ఆదిత్య–ఎల్1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మొదటిసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూనియంత్రత కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. శనివారం ప్రయోగం చేసినపుడు భూమికి దగ్గరగా 235 కిలోమీటర్లు, దూరంగా 19,500 కిలోమీటర్లు ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత కక్ష్య దూరం పెంపుదలలో భూమికి దగ్గరగా 235 కిలోమీటర్ల నుంచి 245 కిలోమీటర్లకు పెంచారు. భూమికి దూరంగా ఉన్న 19,500 కిలోమీటర్ల దూరాన్ని 22,459 కిలోమీటర్లకు పెంచారు. అంటే ప్రస్తుతం 245‘‘22459 కిలోమీటర్లు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంది. రాబోయే 15 రోజుల్లో మరో నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచుతూ ఈనెల 18న భూ మధ్యంతర కక్ష్య నుంచి సూర్యుని వైపునకు మళ్లిస్తారు. అక్కడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు 1 వద్దకు చేర్చడానికి 125 రోజులు సమయం తీసుకుంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. -
చంద్రయాన్-2 జాబిల్లి చిత్రాలు విడుదల
చెన్నై: చంద్రయాన్-2లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. జాబిల్లి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ కెమెరా ద్వారా ఆర్బిటర్ తీసిన చిత్రాలు...బోగుస్లావ్స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది. -
మార్స్‌పైకి అమెరికా ఉపగ్రహం
చెన్నై/వాషింగ్టన్: అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళ్యాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండు వారాలకు.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఓ ఉపగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ నుంచి అట్లాస్ వీ 401 రాకెట్ ద్వారా మార్స్ అట్మాస్పియర్ అండ్ వొలెటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. మార్స్‌పై ఇప్పటికే రోవర్లు, ల్యాండర్లను దింపిన అమెరికా తాజాగా మార్స్ స్కౌట్ ప్రోగ్రామ్‌లో.. రెండోదైన మావెన్ ఉపగ్రహాన్ని పంపింది. మంగళ్యాన్ ఉపగ్రహంతోపాటు మావెన్ కూడా వచ్చే సెప్టెంబరు నాటికి అంగారకుడిని చేరనుంది. కాగా, ఈ నెల 5న ప్రయోగించిన మంగళ్యాన్ డిసెంబర్ 1న అంగారకుడి వైపు ప్రయాణం ప్రారంభించనుందని ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడించారు.