మార్స్‌పైకి అమెరికా ఉపగ్రహం
చెన్నై/వాషింగ్టన్: అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండు వారాలకు.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఓ ఉపగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ నుంచి అట్లాస్ వీ 401 రాకెట్ ద్వారా మార్స్ అట్మాస్పియర్ అండ్ వొలెటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. మార్స్‌పై ఇప్పటికే రోవర్లు, ల్యాండర్లను దింపిన అమెరికా తాజాగా మార్స్ స్కౌట్ ప్రోగ్రామ్‌లో.. రెండోదైన మావెన్ ఉపగ్రహాన్ని పంపింది. మంగళ్‌యాన్ ఉపగ్రహంతోపాటు మావెన్ కూడా వచ్చే సెప్టెంబరు నాటికి అంగారకుడిని చేరనుంది. కాగా, ఈ నెల 5న ప్రయోగించిన మంగళ్‌యాన్ డిసెంబర్ 1న అంగారకుడి వైపు ప్రయాణం ప్రారంభించనుందని ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడించారు.