అందుబాటులో 'ఆర్డర్ ఏ డాడీ' యాప్..!
లండన్ః ఆన్ లైన్ లో తగిన భర్తను ఎంచుకొని పెళ్ళిళ్ళు చేసుకునే కాలానికీ ఇక కాలం చెల్లనుంది. ఏకంగా వివాహ బంధం, సంసార జీవితం కొనసాగించాల్సిన అవసరం లేకుండానే మహిళలు ఆన్ లైన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని, తమ పిల్లలకు ఓ మంచి తండ్రిని ఎంచుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మహిళలు సంతానోత్సత్తికోసం నచ్చిన పురుషుడి వీర్యాన్ని పొందే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన ఓ లండన్ వైద్యుడు కొత్తగా సృష్టించిన యాప్ తో మహిళలు ప్రపంచంలో ఎక్కడైనా తమకు నచ్చిన పురుషుడి వీర్యాన్ని ఎంచుకొని పిల్లలను కనే అవకాశం కల్పించాడు. 'ఆర్డర్ ఏ డాడీ' పేరున ఈ సదవకాశాన్ని అందుబాటులోకి తెచ్చాడు.
లండన్ లోని సైంటిఫిక్ స్మెర్మ్ బ్యాంకు డైరెక్టర్ డాక్టర్ కమల్ అహుజా.. సంతానోత్సత్తికోసం ఈ వినూత్న యాప్ ను రూపొందించాడు. తల్లికావాలనుకున్న స్త్రీలకోసం 'ఆర్డర్ ఏ డాడీ యాప్' సృష్టించాడు. ఈ యాప్ ద్వారా తమకు నచ్చిన పురుషుడి వీర్యాన్ని ఎంచుకొని, దానిద్వారా పిల్లలను కనే అవకాశం కల్పించాడు. ఈ పద్ధతి పూర్తిగా చట్టబద్ధమైనదని, యాప్ ద్వారా వీర్యాన్ని పొందాలనుకునేవారు 950 పౌండ్లు చెల్లించి, కోరుకున్న సంతానోత్సత్తికేంద్రంలో వీర్యాన్ని పొందొచ్చని డాక్టర్ కమల్ అహూజా చెప్తున్నాడు. యాప్ ద్వారా వీర్యాన్ని ఎంచుకోవాలనుకున్నవారు యాప్ లో పొందుపరిచిన పలువురు పురుషుల శరీరాకృతి, రంగు, కనుముక్కుతీరులతో కూడిన ఫోటోలను చూసి స్పెర్మ్ ను ఎంచుకునే వెసులుబాటును కల్పించాడు. అలాగే సదరు పురుషుల విద్య, వృత్తి, స్థాయిల వివరాలను వ్యక్తిత్వ లక్షణాలను కూడా యాప్ లో పరిశీలించే అవకాశం ఉంది.
ఈ కొత్త 'ఆర్డర్ ఏ డాడీ యాప్' కు బ్రిటన్ లో అత్యంత ఆదరణ లభిస్తున్నట్లు డాక్టర్ అహూజా చెప్తున్నాడు. సంతానోత్సత్తికోసం రూపొందించిన ఈ యాప్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా విడుదల చేసినట్లు అతడు పేర్కొన్నాడు. ఇప్పటికే బ్రిటన్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో వీర్యం ఆర్డర్ల క్రేజ్ పెరిగిందని, ఆన్ లైన్ లోనే వీర్యం ఆర్డర్ చేసి అతి సులభంగా సంతానోత్సత్తిని పొందేందుకు మహిళలకు ఇదో గొప్ప అవకాశమని డాక్టర్ అహూజా వెల్లడించాడు.