Oscar Films
-
పుస్తకాలు.. సినిమాలు.. వంటలు
‘‘లక్ష్యసాధన కోసం నిత్య జీవితంలో మనమందరం పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ ప్రకృతి విపత్తు వస్తే మనం ఎంతవరకు ఎదుర్కోగలమో ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే అర్థం అవుతుంది. మన ఆరోగ్యం, కుటుంబం, మనల్ని ప్రేమించేవారు, వారితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి. మిగతావన్నీ తర్వాతే అనిపిస్తోంది’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. లాక్డౌన్ సమయం ఎలా గడుస్తుందో రకుల్ చెబుతూ – ‘‘ఈ ఏడాది మార్చి 18 నా చివరి వర్కింగ్ డే. అప్పట్నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఎప్పటిలానే ఉదయం యెగాతో నా రోజు మొదలవుతుంది. పుస్తకాలు బాగా చదువుతున్నాను. ప్రస్తుతం నేను ‘వై వియ్ స్లీప్’ అనే పుస్తకం చదువుతున్నాను. ‘ఛారియట్స్ ఆఫ్ గాడ్స్’, ‘కాస్మిక్ కాన్షియస్నెస్’ అనే పుస్తకాలను చదవడం పూర్తి చేశాను. మార్నింగ్ టైమ్‌లో బుక్స్ చదువుతున్నాను. మధ్యాహ్నం ఏదైనా సోషల్ మీడియా లైవ్స్ చూస్తాను. సాయంత్రం ఒక సినిమా చూస్తాను. అలాగే ఒక షోకు సంబంధించిన రెండు, మూడు ఎపిసోడ్స్ ఫాలో అవుతాను. ఆస్కార్ అవార్డు సాధించిన అన్ని సినిమాలను చూడాలనుకుంటున్నాను. ఆస్కార్ సినిమాలను రెండేళ్లుగా చూస్తున్నాను. వీలైనప్పుడు వంట కూడా చేస్తున్నాను. దీనిపై ఓ యాట్యూబ్ చానెల్‌ను కూడా స్టార్ట్ చేశాం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. కానీ ఇంత లాంగ్ బ్రేక్ నా లైఫ్‌లో రాలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత సినిమాలతో మళ్లీ బిజీ అవుతాను’’ అన్నారు. -
ఈసారీ ఆస్కారం లేదు!
మరో ఏడాది. మరో నిరాశ. మరో నిరుత్సాహం. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ని అందుకోవాలనే ఆశ అలానే మిగిలిపోనుంది. 92వ ఆస్కార్ అవార్డులకి ఈ ఏడాది మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా నిలిచిన హిందీ చిత్రం ‘గల్లీ బాయ్’ ఆస్కార్ విడుదల చేసిన షార్ట్ లిస్ట్‌లో చోటు సాధించలేకపోయింది. ఆస్కార్ ఆశల్ని తొలి దశలోనే తుంచేసింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ పోటీల్లో మన దేశం తరఫున నిలబడటానికి ఈ ఏడాది 28 సినిమాలు పోటీపడ్డాయి. ప్రపంచంవ్యాప్తంగా ఈ విభాగంలో 91 సినిమాలు ఆయా దేశాలు నుంచి నామినేట్ చేశారు. మన దేశం తరఫున ‘గల్లీ బాయ్’ని పంపాం. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జోడీగా జోయా అక్తర్ తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ బాయ్’. ర్యాపర్ కావాలనుకునే ముంబై మురికివాడ కుర్రాడిగా ఇందులో రణ్వీర్ కనిపించారు. ర్యాపర్‌గా తన కలను ఎలా చేరుకున్నాడు అన్నది కథ. 40 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసింది ‘గల్లీ బాయ్’. అయితే ఆస్కార్ నామినేషన్ దక్కించుకోలేదు. 91 సినిమాలను ఫిల్టర్ చేసి పది సినిమాలకు కుదించి షార్ట్ లిస్ట్‌ను ప్రకటించింది ఆస్కార్. ఈ పది సినిమాల జాబితాలోకి ‘గల్లీ బాయ్’ ప్రవేశించలేకపోయాడు. 92వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ షార్ట్ లిస్ట్‌ను మంగళవారం ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. 9 విభాగల ఈ జాబితాలో విభాగానికో పది సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసి ప్రకటించారు. ఉత్తమ విదేశీ చిత్రం, డాక్యుమెంటరీ మూవీ, డాక్యుమెంటరీ షార్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్), లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఎంపికయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత ఒక్కో విభాగంలో 5 సినిమాలను తుది జాబితాగా పరిగణించి ఒక్క సినిమాకి అవార్డు ప్రదానం చేస్తారు. ఆస్కార్ నామినేషన్ ఓటింగ్స్ వచ్చే ఏడాది జనవరి 2న ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకూ ఓటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఆ జాబితాను జనవరి 13న ప్రకటిస్తారు. దాని తర్వాత జనవరి 30న తుది జాబితాకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలువుతుంది. ఫిబ్రవరి 4 వరకూ ఈ ఓటింగ్ సాగుతుంది. ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. హాలీవుడ్ అండ్ హైల్యాండ్ సెంటర్లో జరగబోయే 92వ ఆస్కార్ వేడుక ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. సుమారు 225 దేశాల్లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆస్కార్ అవార్డులు సినిమా ప్రియులకు పండుగే. కానీ హాలీవుడ్ చిత్రాల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ ఫంక్షన్‌ను అన్ని దేశాల వాళ్లు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని వందల సినిమాల్లో ఒక్క దేశం ఆస్కార్ దక్కించుకోకపోతే చిన్నబోవాల్సిన అవసరం ఏంటి? అనే వాదనలూ ఉన్నాయి. ‘ఆస్కార్ అవార్డులు ప్రపంచ స్థాయివేం కాదు. చాలా లోకల్ అవార్డులు’ అని అభిప్రాయపడ్డారు కొరియన్ సినిమా ‘ప్యారసైట్’ దర్శకుడు బాంగ్ జూన్–హో. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఫలితం ఆస్కార్ ఓటింగ్‌కి వదిలేద్దాం! ప్రతి ఏడాది ఇస్తూ వస్తున్న ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీను ఈసారి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరు మార్చారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంపికయిన సినిమాలు. 1. ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్), 2. ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా), 3. లెస్ మిసరబుల్స్ (ఫ్రాన్స్), 4. దోస్ హూ రిమైండ్ (హంగేరి), 5. హనీ ల్యాండ్ (నార్త్ మెకడోనియా), 6. కోర్పస్ క్రిస్టీ (పోల్యాండ్), 7. ‘బీన్ పోల్ (రష్యా), 8. అట్లాంటిక్స్ (సెనెగల్), 9. ప్యారసైట్ (సౌత్ కొరియా), 10. పెయిన్ అండ్ గ్లోరీ (స్పెయిన్). మార్వెల్ వర్సెస్ డీసీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ కామిక్ బుక్స్ నుంచి సూపర్ హీరోల సినిమాలు తీసి బస్టర్స్ సాధి స్తుంటాయి నిర్మాణ సంస్థలు. కానీ ఆ సినిమాలను పెద్దగా పరిగణలోకి తీసుకోదు ఆస్కార్. టెక్నికల్ విభాగాల్లో కొన్నిసార్లు అవార్డు ఇచ్చి వెన్ను తట్టింది కానీ సూపర్ హీరో సినిమాలంటే ఆస్కార్‌కి చిన్న చూపే. అయితే ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సూపర్ హీరో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్’ వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. మార్వెల్ సంస్థ నుంచి వచి్చన ‘ఎండ్ గేమ్’ బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), విజువల్ ఎఫెక్ట్స్ విభాగల్లో, ‘కెప్టెన్ మార్వెల్’ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేట్ అయ్యాయి. డీసీ సంస్థ ఆస్కార్ బాధ్యతను ‘జోకర్’ భుజాలపై ఉంచింది. ఒరిజినల్ స్కోర్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్ విభాగాల్లో ‘జోకర్’ సినిమా నామినేట్ అయింది. చాన్స్ ఎవరికి? ప్యారసైట్ ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ దక్కే ఛాన్స్ ఎక్కువగా సౌత్ కొరియా చిత్రం ‘ప్యారసైట్’కి ఉందని విశ్లేషకుల అంచనా. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతానికైతే చాలామంది హాట్ ఫేవరెట్ ‘ప్యారసైట్’. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. -
సూపర్‌స్టార్‌తో ‘ఆస్కార్’
తమిళసినిమా: ఎట్టకేలకు సూపర్‌స్టార్‌తో చిత్రం చేసే అవకాశం ఆస్కార్ ఫిలింస్ చేజిక్కించుకుంది. విశ్వనాయకుడితో ఓ దశావతారం, విజయకాంత్ హీరోగా వానతై పోలా, రమణ, విక్రమ్ కథానాయకుడిగా అన్నియన్, తాజా చిత్రం ఐ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్. విజయ్, అజిత్, సూర్య లాంటి యువస్టార్ హీరోలతోనూ చిత్రాలు తీసిన ఈ సంస్థ ఒక్క రజనీకాంత్‌తో ఇప్పటి వరకు చిత్రం చేయలేదు. ఆ కొరత ఇప్పుడు తీరబోతోందన్నది తాజా వార్త. నిజం చెప్పాలంటే రజనీకాంత్ ఇటీవల నటించిన కోచ్చడయాన్, లింగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ఇలాంటి తరుణంలో సూపర్‌స్టార్ తదుపరి చిత్రం ఏమిటన్నది చాలామందిని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇలాంటి పరిస్థితిలో శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 చేస్తారని, పి.వాసు కథ వినిపించారని, బాషా ఫేమ్ సురేష్‌కృష్ణ కూడా లైన్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా రజనీకాంత్‌ను ఆస్కార్ ఫిలింస్ సంస్థలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది అనధికార నిర్ధారణ. ఆస్కార్ ఫిలింస్‌లో రజనీకాంత్ నటించడం దాదాపు ఖరారైనట్లే. ఈ అంశంపై ఆస్కార్ రవిచంద్రన్ ఇటీవల రజనీకాంత్‌ను కలిశారు. అయితే ఈ చిత్రం విషయం చర్చల్లో ఉందని ఆయన చెప్పడం విశేషం. ఆస్కార్ ఫిలింస్‌లో ఏఆర్ మురుగదాస్ ఇంతకుముందు రమణ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. రవిచంద్రన్ ఈ సారి సూపర్‌స్టార్‌తో ఎలాంటి అద్భుతాన్ని సృష్టించనున్నారో చూడాల్సిందే. చిత్రం ఏడాది చివర్లో తెరపైకి రానుంది. -
సంక్రాంతికి మూడుముక్కలాట
మూడుముక్కలాట అంటే ముందుగా గుర్తుకొచ్చేది జూదం. ఒక రకంగా సినిమా జూదం లాంటిదేనంటారు. ఇక్కడ శ్రమ ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం ప్రేక్షకుల తీర్పుపైనే. అలాంటి తీర్పు కోసం సంక్రాంతి రేస్ లోకి మూడు మాస్ మసాలా చిత్రాలు దిగు తున్నాయి. ఈ మూడు భారీ అంచనాలు నెలకొన్నవే. అందులో ఒకటి అజిత్ నటించిన ఎన్నై అరిందాల్. అజిత్ సరసన అనుష్క, త్రిష, పార్వతి నాయర్ నటించారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎఎం.రత్నం భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మరో చిత్రం ఐ. ఈ చిత్రంలో విక్రమ్‌తో ఎమిజాక్సన్ రొమాన్స్ చేశారు. దర్శకు డు శంకర్ అద్భుత సృష్టికి ఆస్కార్ ఫిలింస్ బ్రహ్మాండ నిర్మాణ విలువలకు అద్దం పట్టనుంది ఐ. రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ సినీ ప్రియులను అబ్బురపరుస్తోంది. దీపావళికే విడుదల అవుతుందనుకున్నారు. అయితే నిర్మాణ కార్యక్రమాలు జాప్యం కారణంగా సంక్రాంతి రేస్‌కు సిద్ధమవుతోంది. హాలీవుడ్ చిత్రాలను మరిపించే విధంగా ఐ ఉంటుందనే భావన ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మూడవ చిత్రం ఆంబళ. సుందర్.సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. హన్సిక హీరోయిన్. ఈ చిత్రంపైనా అంచనాలు తక్కువగా లేవు. అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల వరుసగా పాండియనాడు, నాన్ శిగప్పు మనిదన్, పూజై చిత్రాలు విజయాలతో హాట్రిక్ సాధించారు విశాల్. ఈ చిత్రంతో రెండవ హాట్రిక్కు శ్రీకారం చుడతాననే విశ్వాసంతో ఉన్నారు. మరో విషయం ఏమిటంటే ఆంబళ విడుదల తేదీని చిత్ర ప్రారంభం రోజునే విశాల్ ప్రకటించారు. థియేటర్ల సంగతేంటి? కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో ముక్కోణపు పోటీ లేదనే చెప్పాలి. గత సంక్రాంతికి విజయ్ జిల్లా, అజిత్ వీరం చిత్రాలు పోటీపడ్డారుు. ఇవి రెండూ మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది మూడు చిత్రాలు పోటీపడుతున్నాయి. తమిళనాడులో 963 థియేటర్లు ఉన్నాయి. వాటిలో 1110 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ థియేటర్లను మూడు చిత్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. సగటున ఒక్కో చిత్రానికి నాలుగువందల స్క్రీన్స్ చొప్పు సంచుకోవాలి. ముందుగా అంటే జనవరి 8వ తేదీన అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదల అవుతుందని సమాచారం. అంటే సంక్రాంతికి వారం రోజుల ముందుగానే ఎన్నై అరిందాల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. ఈ చిత్రం తొలి వారం 800 థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ విజ్ఞులు అంచనా. సంక్రాంతి రోజుకు 400 థియేటర్లు తగ్గినా మరో 400 థియేటర్లలో ఎన్నై అరిందాల్ చిత్రం నిలబడుతుంది. ఈ విధంగా ఎన్నై అరిందాల్ చిత్రం తొలి వారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక సంక్రాంతి రోజున విక్రమ్ నటించిన ఐ, విశాల్ చిత్రం ఆంబళ చెరో 400 వందల స్క్రీన్లను పంచుకునే అవకాశం ఉంటుందని సినీ పండితుల అంచనా. మొత్తం మీద సంక్రాంతి రేసులో ముక్కోణపు పోటీ మాత్రం తప్పేటట్టులేదు. సంక్రాంతికి అధికారికంగా మూడు రోజులు సెలవు దినాలు ఉంటాయి. అదనంగా మరో రెండు రోజులు ప్రజలు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఐదు రోజులలో సినీ ప్రియులకు మూడు చిత్రాలు మంచి కాలక్షేపంగా మారనున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం మూడు రోజులు అధిక ప్రదర్శనలకు అనుమతిస్తుంది. దీంతో ఈ మూడు రోజుల్లో 15 నుంచి 25 వయసు గల వాళ్లు చిత్రాలను చూడడానికి అధిక ఆసక్తి చూపుతారన్నది వాస్తవం. ఈ ముక్కోణపు రేసులో ప్రేక్షకుల ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. -
ఐ చిత్ర యూనిట్‌కు షాక్
ఐ చిత్ర యూనిట్‌కు షాక్తగిలింది. ఈ సంఘటన ఇటీవల జరిగింది. సియాన్ విక్రమ్ నోరు కుట్టుకుని, కడుపు మాడ్చుకుని ఒళ్లు తగ్గి మళ్లీ కడుపు నింపుకుని అందరూ అచ్చెరుచెందేలా దేహం పెంచుకుని ఇలా అహర్నిశలు శ్రమించి నటించిన చిత్రం ఐ. లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా సుమారు 180 కోట్ల వ్యయంతో నిర్మించిన చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ ఒక తపస్సులా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో గ్రాండ్‌గా నిర్వహించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా శంకర్ తన చిత్రానికి సంబంధించిన విషయాలను నిర్మాణ దశలో అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికి ఈ చిత్ర కథేమిటో చిత్రానికి పనిచేసిన అతి కొద్దిమందికి మినహా ఎవరికీ తెలియదన్నది అతిశయోక్తి కాదు. ఐ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన ఒకటి, లేదా రెండు స్టిల్స్ మాత్రమే బయటకొచ్చాయంటే దర్శకుడు ఎంత కట్టడి చేస్తున్నారో అర్థమవుతుంది. అలాంటిది ఐ చిత్రం టీజర్ సోషల్ నెట్వర్స్ సైట్స్‌లో హల్చల్ చేయడం విశేషం. ఇది నిజంగా ఆ చిత్ర యూనిట్‌కు షాక్‌నిచ్చే సంఘటనే. చిత్ర యూనిట్ ఇటీవల చిత్ర ప్రచార చిత్రాన్ని కొందరు సినీ ప్రముఖులకు చూపించారు. మరి వాళ్లల్లో ఎవరు ఐ చిత్ర టీజర్‌ను ఎలా లీక్ చేసుంటారు? ఏమో? అయితే ఈ టీజర్ క్లియర్‌గా కాకుండా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
180 కోట్ల శంకర్ మనోహరుడు స్టిల్స్
-
దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’
దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు. 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్లో విక్రమ్ ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు. మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు... ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు. భారతీయ ‘జేమ్స్ కామెరూన్’ ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్! ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు. భారీ ఎత్తున విడుదల తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం. -
15న తిరుమణం ఎన్నుం నిఖా
తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువజంట జయ్, నజ్రియా నజీమ్ నటించిన చిత్రం తిరుమణం ఎన్నుం నిఖా చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా నాజర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అనిస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. చిత్ర దర్శకుడు అనిస్ మాట్లాడుతూ తిరుమణం ఎన్నుం నిఖా రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రమన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే జయ్, నజ్రియా మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఆ ప్రేమ పెళ్లికి దారి తీసిందా? లేదా? అన్నదే చిత్ర ఇతివృత్తమని తెలిపారు. చిత్రం ఆస్కార్ ఫిలింస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. రంజాన్ వేడుకలను చెన్నై నగరంలో ఒకరకంగాను, ఉత్తర చెన్నై రాయపురంలో మరో విధంగాను నిర్వహిస్తారన్నారు. ఈ రెండు ప్రాంతాల రంజాన్ నిజ వేడుకలను తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం కోసం చిత్రీకరించామని తెలిపారు. చిత్ర ఆలస్యానికి ఇదే కారణంగా పేర్కొన్నారు. అదే విధంగా మోహరం వేడుకలను యథాతథంగా చిత్రీకరించామని చెప్పారు. చిత్రంలో పలువురు నూతన తారలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి నటింప చేశామని వెల్లడించారు. కరెక్టుగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని లేటెస్ట్ కాదల్‌కోట్టై గా చెప్పవచ్చునని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన సంగీత బాణీలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.