ఈసారీ ఆస్కారం లేదు! | This Year 28 Films Competed For The Best Foreign Film Oscar For Our Country | Sakshi
Sakshi News home page

ఈసారీ ఆస్కారం లేదు!

Published Wed, Dec 18 2019 12:29 AM | Last Updated on Wed, Dec 18 2019 3:52 AM

This Year 28 Films Competed For The Best Foreign Film Oscar For Our Country - Sakshi

రణ్‌వీర్‌ సింగ్

మరో ఏడాది. మరో నిరాశ. మరో నిరుత్సాహం. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ని అందుకోవాలనే ఆశ అలానే మిగిలిపోనుంది.  92వ ఆస్కార్‌ అవార్డులకి ఈ ఏడాది మన దేశం నుంచి అఫీషియల్‌ ఎంట్రీగా నిలిచిన  హిందీ చిత్రం ‘గల్లీ బాయ్‌’ ఆస్కార్‌ విడుదల చేసిన షార్ట్‌ లిస్ట్‌లో చోటు సాధించలేకపోయింది. ఆస్కార్‌ ఆశల్ని తొలి దశలోనే తుంచేసింది.

ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ పోటీల్లో మన దేశం తరఫున నిలబడటానికి ఈ ఏడాది  28 సినిమాలు పోటీపడ్డాయి. ప్రపంచంవ్యాప్తంగా ఈ విభాగంలో 91 సినిమాలు ఆయా దేశాలు నుంచి నామినేట్‌ చేశారు. మన దేశం తరఫున ‘గల్లీ బాయ్‌’ని పంపాం. రణ్‌వీర్‌ సింగ్, ఆలియా భట్‌ జోడీగా జోయా అక్తర్‌ తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ బాయ్‌’. ర్యాపర్‌ కావాలనుకునే ముంబై మురికివాడ కుర్రాడిగా ఇందులో రణ్‌వీర్‌ కనిపించారు. ర్యాపర్‌గా తన కలను ఎలా చేరుకున్నాడు అన్నది కథ. 40 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసింది ‘గల్లీ బాయ్‌’. అయితే ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకోలేదు. 91 సినిమాలను ఫిల్టర్‌ చేసి పది సినిమాలకు కుదించి షార్ట్‌ లిస్ట్‌ను ప్రకటించింది ఆస్కార్‌. ఈ పది సినిమాల జాబితాలోకి ‘గల్లీ బాయ్‌’ ప్రవేశించలేకపోయాడు. 92వ ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ షార్ట్‌ లిస్ట్‌ను మంగళవారం ప్రకటించింది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌.

9 విభాగల ఈ జాబితాలో విభాగానికో పది సినిమాలను షార్ట్‌లిస్ట్‌ చేసి ప్రకటించారు. ఉత్తమ విదేశీ చిత్రం, డాక్యుమెంటరీ మూవీ, డాక్యుమెంటరీ షార్ట్, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిల్, మ్యూజిక్‌ (ఒరిజినల్‌ స్కోర్‌), మ్యూజిక్‌ (ఒరిజినల్‌ సాంగ్‌), లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్, యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ఎంపికయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత ఒక్కో విభాగంలో 5 సినిమాలను తుది జాబితాగా పరిగణించి ఒక్క సినిమాకి అవార్డు ప్రదానం చేస్తారు. ఆస్కార్‌ నామినేషన్‌ ఓటింగ్స్‌ వచ్చే ఏడాది జనవరి 2న ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకూ ఓటింగ్‌ నడుస్తూనే ఉంటుంది. ఆ జాబితాను జనవరి 13న ప్రకటిస్తారు. దాని తర్వాత జనవరి 30న తుది జాబితాకు సంబంధించిన ఓటింగ్‌ ప్రక్రియ మొదలువుతుంది. ఫిబ్రవరి 4 వరకూ ఈ ఓటింగ్‌ సాగుతుంది.

ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. హాలీవుడ్‌ అండ్‌ హైల్యాండ్‌ సెంటర్‌లో జరగబోయే 92వ ఆస్కార్‌ వేడుక ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. సుమారు 225 దేశాల్లో ఆస్కార్‌ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది.   ఆస్కార్‌ అవార్డులు సినిమా ప్రియులకు పండుగే. కానీ హాలీవుడ్‌ చిత్రాల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ ఫంక్షన్‌ను అన్ని దేశాల వాళ్లు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని వందల సినిమాల్లో ఒక్క దేశం ఆస్కార్‌ దక్కించుకోకపోతే చిన్నబోవాల్సిన అవసరం ఏంటి? అనే వాదనలూ ఉన్నాయి. ‘ఆస్కార్‌ అవార్డులు ప్రపంచ స్థాయివేం కాదు. చాలా లోకల్‌ అవార్డులు’ అని అభిప్రాయపడ్డారు కొరియన్‌ సినిమా ‘ప్యారసైట్‌’ దర్శకుడు బాంగ్‌ జూన్‌–హో. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఫలితం ఆస్కార్‌ ఓటింగ్‌కి వదిలేద్దాం!

ప్రతి ఏడాది ఇస్తూ వస్తున్న ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ కేటగిరీను ఈసారి ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా పేరు మార్చారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌  విభాగంలో ఎంపికయిన సినిమాలు. 1. ది పెయింటెడ్‌ బర్డ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), 2. ట్రూత్‌ అండ్‌ జస్టిస్‌ (ఎస్టోనియా), 3. లెస్‌ మిసరబుల్స్‌ (ఫ్రాన్స్‌), 4. దోస్‌ హూ రిమైండ్‌ (హంగేరి), 5. హనీ ల్యాండ్‌ (నార్త్‌ మెకడోనియా), 6. కోర్పస్‌ క్రిస్టీ (పోల్యాండ్‌), 7. ‘బీన్‌ పోల్‌ (రష్యా), 8. అట్లాంటిక్స్‌ (సెనెగల్‌), 9. ప్యారసైట్‌ (సౌత్‌ కొరియా), 10. పెయిన్‌ అండ్‌ గ్లోరీ (స్పెయిన్‌). 

మార్వెల్‌ వర్సెస్‌ డీసీ

‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’


కామిక్‌ బుక్స్‌ నుంచి సూపర్‌ హీరోల సినిమాలు తీసి బస్టర్స్‌ సాధి స్తుంటాయి నిర్మాణ సంస్థలు. కానీ ఆ సినిమాలను పెద్దగా పరిగణలోకి తీసుకోదు ఆస్కార్‌. టెక్నికల్‌ విభాగాల్లో కొన్నిసార్లు అవార్డు ఇచ్చి వెన్ను తట్టింది కానీ సూపర్‌ హీరో సినిమాలంటే ఆస్కార్‌కి చిన్న చూపే. అయితే ఈ ఏడాది బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సూపర్‌ హీరో ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్‌’ వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. మార్వెల్‌ సంస్థ నుంచి వచి్చన ‘ఎండ్‌ గేమ్‌’ బెస్ట్‌ మ్యూజిక్‌ (ఒరిజినల్‌ స్కోర్‌), విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగల్లో, ‘కెప్టెన్‌ మార్వెల్‌’ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో నామినేట్‌ అయ్యాయి. డీసీ సంస్థ ఆస్కార్‌ బాధ్యతను ‘జోకర్‌’ భుజాలపై ఉంచింది. ఒరిజినల్‌ స్కోర్, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిల్‌ విభాగాల్లో ‘జోకర్‌’ సినిమా నామినేట్‌ అయింది.

చాన్స్‌ ఎవరికి?

ప్యారసైట్‌

ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్‌ దక్కే ఛాన్స్‌ ఎక్కువగా సౌత్‌ కొరియా చిత్రం ‘ప్యారసైట్‌’కి ఉందని విశ్లేషకుల అంచనా. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతానికైతే చాలామంది హాట్‌ ఫేవరెట్‌ ‘ప్యారసైట్‌’. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement