మరింత తగ్గిన బంగారం ధర..
ప్రపంచ మార్కెట్ సరళిని ప్రతిబింబిస్తూ దేశీయంగా బంగారం ధర వరుసగా మూడోవారమూ క్షీణించింది. గ్రీస్ సంక్షోభం, చైనా స్టాక్ మార్కెట్ పతనం అంతర్జాతీయంగా పుత్తడి ధరను ప్రభావితం చేశాయి. దాంతో న్యూయార్క్ మార్కె ట్లో ఔన్సు పుత్తడి ధర 5.6 డాలర్లు కోల్పోయి 1,157 డాలర్లకు తగ్గింది. దాంతో గతవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి రూ. 26,170 వద్ద ముగిసింది. అంతక్రితంవారంతో పోలిస్తే రూ. 170 నష్టపోయింది. 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధర అంతేనష్టంతో రూ. 26,020 వద్ద ముగిసింది.
ఎందుకు పెరిగాయంటే...
ఫార్మా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుండడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో సహా పలు ఫార్మా షేర్లు ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో హెచ్‌పీసీఎల్, మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఆశావహంగా ఉంటాయన్న అంచనాల కారణంగా భెల్ షేర్లు లాభపడ్డాయి.
ఎందుకు తగ్గాయంటే...
టార్గెట్ ధరను రూ.1,000 నుంచి రూ.740కు బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ తగ్గించడంతో యస్ బ్యాంక్ షేర్, చైనా షాంఘై సూచీ భారీ పతనం, ఆ దేశంలో మందగమనం ఆందోళనల ప్రభావంతో లోహషేర్లు(వేదాంత, కెయిర్న్, టాటా స్టీల్, సెయిల్, హిందాల్కో) క్షీణించాయి. 10 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను కేంద్రం ప్రారంభించడంతో ఎన్టీపీసీ షేర్లు పతనమయ్యాయి.