owk
-
సొరంగంలో పని చేస్తుండగా.. హిటాచి వాహన ఆపరేటర్ దుర్మరణం
అవుకు (నంద్యాల): అవుకు సొరంగంలో పని చేస్తుండగా పైనుంచి రాళ్లు పడి హిటాచి వాహన ఆపరేటర్ దుర్మరణం చెందాడు. పనిలో చేరిన రెండో రోజు ఈ ఘటన జరగడంతో బాధిత కుటుంబం విషాదంలో మునిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఆల నారాయణ, ఆల కృష్ణవేణి దంపతులకు ఏకైక కుమారుడు ఆలగిరి మద్దిలేటి(28). రెండున్నర ఏళ్ల క్రితం తండ్రి నారాయణ బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం ఈ యువకుడిపై పడింది. అవుకు మూడవ టన్నెల్లో పనిచేసేందుకు హిటాచి వాహనం ఆపరేటర్ కావాలని పిలుపు రావడంతో ఈనెల 5వ తేదీ వెళ్లి విధుల్లో చేరాడు. రెండో రోజు మంగళవారం సొరంగంలోకి వెళ్లి పని చేస్తుండగా పై నుంచి ఉన్నట్టుండి పెద్ద బండరాయి పడింది. ఈ ఘటనలో మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని టన్నెల్ నిర్మాణ అధికారులు కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహంపై పడి బోరున విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఏడాదిన్నర క్రితం డోన్ మండలం వెంగనాయునిపల్లె గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైన మద్దిలేటికి ఆరు నెలల కుమారుడు మౌనిత్‌కుమార్ ఉన్నాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...) -
అవుకు సొరంగం పనులు కొలిక్కి..
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మరో తార్కాణమిది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (బలహీనమైన మట్టి పొరలు) వల్ల తవ్వలేకపోతున్నామని గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఆ సొరంగాన్ని హిమాలయ పర్వతాల్లో సొరంగాల తవ్వకానికి వినియోగిస్తున్న అత్యాధునిక పోర్ ఫిల్లింగ్ టెక్నాలజీతో ప్రభుత్వం తవ్వుతోంది. ఈ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆగస్టు నాటికి 1,038 మీటర్ల పొడవున్న సొరంగాన్ని లైనింగ్‌తో సహా పూర్తి చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి.. 2.60 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్ గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టారు. చేతులెత్తేసిన గత టీడీపీ సర్కార్ శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల(ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో ఒకటో సొరంగాన్ని 5.835 కి.మీ. పొడవున.. రెండో సొరంగాన్ని 4.962 కి.మీ. మేర తవ్వకం పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఒకటో సొరంగంలో మిగిలిన 165 మీటర్ల పనులను ఫాల్ట్ జోన్ సాకు చూపి పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకుండా.. పక్క నుంచి కాలువ(లూప్) తవ్వి చేతులు దులుపుకుంది. అవుకు రెండో సొరంగం పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో సొరంగం తవ్వకం పనులు వేగవంతమయ్యాయి. రెండో సొరంగంలో మిగిలిన 1,038 మీటర్లలో ఇప్పటికే 615 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో 165 మీటర్ల పనులు చేసేందుకు ‘పోర్ ఫిల్లింగ్’ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు హిమాచల్ నుంచి నిపుణులను రప్పించారు. -
జలపాత సోయగం
భారీ వర్షాలతో అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని మల్లాలమ్మ ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. అవుకు నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న దీనిని చూడటానికి ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. జలపాతం కింద స్నానం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. - అవుకు -
బైపాస్ టన్నెల్ పూర్తి
అవుకు: గాలేరు నగరి సుజల స్రవంతి ప్యాకేజ్ నెంబర్–30లో భాగంగా అవుకులో నిర్మిస్తున్న సొరంగాల్లో ఒక (బైపాస్) టన్నెల్ పూర్తి అయినట్లు ఈఈ పాపారావు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ రెండు సోరంగాలు ఒక్కొక్కటి 6కిమీ పొడవుతో 20 వేల క్యూసెక్కుల నీటిని పంపడానికి డిజైన్ చేసినట్లు తెలిపారు. ఎన్ట్రీ నుంచి ఆడిట్ పాయింట్‌కు మధ్యలో లెఫ్ట్ టన్నెల్లో 300 మీటర్లు, రైట్ టన్నెల్లో 394 మీటర్ల మేర ఫాల్ట్‌జోన్ ఉండటం వల్ల టన్నెల్ పని సమస్యగా మారిందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికె బైపాస్ టన్నెల్‌ను నిర్మించామన్నారు. బైపాస్ టన్నెల్లో 5 వేల క్యూసెక్కుల నీరు వెళ్తుందన్నారు. రెండు నెలల్లో లైనింగ్ పనులు పూర్తి చేసి వచ్చె ఖరీఫ్ సీజన్‌కు ఒక సొరంగం ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీరు తప్పక అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ మనోహర్ రాజు, టన్నెల్ జీఎం శ్రీవారి, సిబ్బంది నాగభూషణం పాల్గొన్నారు. -
అవుకులో స్టూడెంట్ నెంబర్-1
అవుకు : స్థానిక రిజర్వాయర్ కట్టపై సోమవారం సినిమా షూటింగ్ జరిగింది. శ్రీలక్ష్మీనరసింహ బ్యానర్‌పై స్టూడెంట్ నెంబర్-1 సినిమాను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు రవికిరణ్ తెలిపారు. హీరో, హీరోయిన్లుగా కృష్ణచైతన్య, కల్కిమిశ్రా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు నిర్మాత కేఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ కొత్త కావడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. -
నీటి విడుదల నిలిపివేత
అవుకు: స్థానిక రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు వెళుతున్న నీటిని ఆదివారం నిలిపివేశారు. గతేడాది నవంబర్ నుంచి మూడు నెలల పాటు నీటిని వదలినిట్లు ఎస్సార్బీసీ ఈఈ పాపారావు తెలిపారు. శ్రీశైలం నుంచి నీటి విడుదల వేయడంతో ప్రస్తుతం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉందన్నారు. సంగపట్నం ప్రధాన కాలువకు 200 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉందని తెలపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1.80 టీంఎసీల నీరు నిల్వ ఉందని ఈఈ పేర్కొన్నారు. వారం రోజుల్లో గోరకుల్లు నుంచి నీటి విడుదల నిలిపివేస్తారని తెలిపారు. -
డిసెంబర్ 15 నాటికి సొరంగం పూర్తి
అవుకు: డిసెంబర్ 15 నాటికి ఒక సొరంగం పూర్తి అయి, 10 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో వైఎస్సాఆర్ కడప జిల్లాకు నీరు అందిస్తామని సీఈ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం అవుకు టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ స్థానిక టన్నెల్ నిర్మాణ పనుల్లో లెఫ్ట్ సొరంగంలో 208 మీటర్లు, రైట్ సొరంగంలో 388 మీటర్ల మేర ఫాల్ట్‌జోన్ పెండింగ్ ఉన్న కారణంగా ఆ సమస్యను అధిగమించడానికి 7మీ పొడవు, 7మీ వెడల్పుతో బైపాస్ టన్నెల్ సొరంగం పనులు చేపట్టినట్లు తెలిపారు. లైఫ్ట్ బైపాస్ టన్నెల్ కేవలం 67 మీటర్ల మాత్రమే పెండింగ్ ఉందని, రోజు 10 మీటర్ల మేర పని జరగాల్సి ఉండగా, ఫాల్ట్ జోన్ సమస్యలతో కేవలం 3 మీటర్ల పని మాత్రమే జరగుతుందన్నారు. లెఫ్ట్ బైపాస్ టన్నెల్ పూర్తి అయిన వెంటనే లైనింగ్ చేసి, రైట్ సొరంగం సంబంధించి బైపాస్ టన్నెల్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ సూర్యకుమార్, ఈఈ పాపారావు, డీఈలు మనోహర్ రాజు, ఈశ్వర రెడ్డి, శివప్రసాద్, అనిల్‌కుమార్ రెడ్డి, ఏఈ బోష్రెడ్డి, టన్నెల్ జీఎమ్ శ్రీహరి, ప్రాజెక్టు మేనేజర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని వ్యక్తి శవం
అవుకు: స్థానిక రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా కొట్టుకు వచ్చి చిన్న చెరువు తూమ్వద్ద పడినట్లు తెలుస్తోంది. మూడు రోజల క్రితమే మరణించి ఉంటాడని, మృతునికి దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి రిజర్వాయర్ వద్ద పోస్టుమార్టం అనంతరం అంతక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనువాసులు, పురుషోత్తం తెలిపారు.