సొంతకార్ల బిల్లులకు చెల్లుచీటీ
తహసీల్దార్లు ప్రభుత్వ ఏజెన్సీ కార్లు వాడాల్సిందే
కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు ∙
టెండర్ ప్రకటనకు చురుగ్గా కసరత్తు
రాజమహేంద్రవరం రూరల్ :
అద్దె వాహనాల బిల్లులు డ్రా చేసుకుంటూ సొంత వాహనాల్లో తిరగడం తహసీల్దార్లకు ఇక కుదరదు. ఏజెన్సీల ద్వారానే అన్ని మండలాలకు తహసీల్దార్లకు వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీల ద్వారా వాహనాలు సమకూర్చాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కసరత్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు తహసీల్దార్లకు ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. తాలుకా కేంద్రాల్లో ఇందుకు ప్రభుత్వ వాహనాలు ఉండగా మిగతా చోట్ల అద్దె వాహనాలు ఉండేవి. ప్రస్తుతం పురపాలకసంఘాల్లో మినహా ఎక్కడా సొంత వాహనాలు లేవు. ఈ నేపథ్యంలో అందరూ అద్దె వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.
సగానికిపైగా సొంత వాహనాలే..
జిల్లాలో 64 మండలాలు ఉండగా అందులో మండలాల్లో అద్దె వాహనాలు వాడుతున్నట్లు 55 మంది తహసీల్దార్లు బిల్లులు డ్రా చేస్తున్నారు. ఒక్కో తహసీల్దార్‌కు రూ.24వేలు బిల్లు విడుదల చేయాల్సి ఉండగా బడ్జెట్ తక్కువగా ఉండడంతో రూ.16వేల నుంచి రూ.21వేలు మధ్య ప్రభుత్వం బిల్లును ఇస్తుంది. ఇలా బిల్లులు డ్రా చేస్తున్న సగం మందికి పైగా తహసీల్దార్లు విధి నిర్వహణకు సొంత వాహనాలే వాడుతున్నారు. మరికొందరు ద్విచక్రవాహనాలపై వెళ్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు.
ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు
ఇకపై జిల్లా వ్యాప్తంగా ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం కలెక్టరుకు ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి, వారు సమకూర్చే వాహనాలను తహసీల్దార్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో వాహనానికి రూ.36వేలు బిల్లు చెల్లించాలని, నెలకు ఆ వాహనం 2200 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుందని సూచించింది. పారదర్శకంగా వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించడంతో టెండరు ప్రక్రియ ద్వారా ఏజెన్సీని నిర్ణయించాలని కలెక్టరు భావిస్తున్నారు. అయితే ఎటువంటి వాహనాలను సమకూర్చాలో ప్రభుత్వం చెప్పకపోవడంతో దీనిపై స్పష్టత లేదు. టెండరు విడుదల నాటికి ఒక నిర్ణయానికి వస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే తహసీల్దార్లు మాత్రం బొలెరో వాహనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంత మొత్తానికి ఏజెన్సీలు వాహనాలను సమకూరుసాయా లేదా అన్నది ప్రశ్నార్థకమే. ఇదిలా ఉండగా తాహసీల్దారులు తాము సూచించిన వారినే డ్రైవర్లుగా నియమించాలని అంటున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది . మొత్తానికి తహసీల్దార్లకు బల్క్‌గా అద్దెవాహనాలను సమకూర్చడం ఖాయం.