రూ.60 వేల కోట్ల జలాంతర్గాముల ప్రాజెక్టు
న్యూఢిల్లీ: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రూ.60,000 కోట్ల విలువైన జలాంతర్గాముల ప్రాజెక్టును త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హిందూ మహా సముద్ర గర్భంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలో అందుకు దీటుగా భారత్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనికి పీ–75– ఐ అని పేరు పెట్టారు. వ్యూహాత్మక భాగస్వామ్య పద్ధతిలో రక్షణ శాఖ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇది. వ్యూహాత్మక భాగస్వామ్య పద్ధతి అంటే జలాంతర్గాములు, యుద్ధవిమానాలు తదితరాలను భారత్లో తయారు చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను ఎంపిక చేస్తుంది.
విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో ప్రైవేటు కంపెనీలు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాయి. గరిష్టంగా 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తారు. జలాంతర్గాముల ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ త్వరలోనే కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించనుంది. అయితే ఎల్ అండ్ టీ, రిలయన్స్ డిఫెన్స్, మజ్గావ్ డాక్ లిమిటెడ్ సంస్థలకు మాత్రమే పీ–75– ఐని చేపట్టే అర్హతలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.