‘అందోల్’ ఫలితాలపై ఆసక్తి
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నియోజకవర్గ విజేత ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికి కారణం మాజీ డిప్యూటీ సీఎం ఇక్కడి నుంచి పోటీ చేయడమే. దామోదర్ రాజనర్సింహకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి, సినీ నటుడు పి.బాబూమోహన్ బరి లో ఉన్నారు. గతంలో కూడా వీరిద్దరూ పోటీ పడగా నువ్వా? నేనా అన్నట్లు ఫలితాలు వ చ్చాయి. దీంతో ఈ సారి కూడా ఫలితాలు ఎలా ఉంటాయోనని అందరూ ఆత్రుతగా ఎ దురు చూస్తున్నారు. అయితే ఫలితాలపై ఇద్ద రు అభ్యర్థులు మాత్రం ధీమాతో ఉన్నారు.
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఎ మ్మెల్యే సీటు కూడా తమదేనని ఆ పార్టీ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. అయితే ఈ రెండు ఎన్నికలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ంటాయని టీఆర్ఎస్ నాయకులు భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర్ రాజనర్సింహ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగగా, టీఆర్ఎస్ను గెలిపిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
మెజార్టీపై ధీమాలు
ఎన్నికల్లో 30వేల మెజార్టీతో గెలుపొందుతామంటూ మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ ధీమాతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ధీమా రెట్టింపయ్యింది.
తాము చేపట్టిన అభివృద్దే తమకు ఓట్లు రాల్చిందని, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాబూమోహన్ మాత్రం 20వేల మెజార్టీతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కీలకపాత్ర పోషించాడని, టీఆర్ఎస్ గాలితో తాను తప్పకుండా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు.
భారీగా ఓట్లు సంపాదించనున్న వైఎస్ఆర్సీపీ
అందోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సంజీవరావు పోటీలో ఉండడంతో భారీగా ఓట్లు పొందే అవకాశం ఉంది. నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ది పథకాలు చాలా ఉన్నాయి. సింగూరు కాలువల నిర్మాణానికి నిధులను, పెన్షన్లు, పెద్ద ఎత్తున పొందిన లబ్ధిదారులున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ సీపీ తన ప్రచారంతో దూసుకుపోయారు.
ఎంపీ అభ్యర్థుల క్రాస్ ఓటింగ్
నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థుల మద్దతుదారులు భారీగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ మద్దతుదారులు భారీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఒక్కో మండలంలో ఒక్కోరకంగా పార్టీలకు మద్దతునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి బిబి పాటిల్ మద్దతుదారులు సైతం ఇలాంటి చర్యలకే పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రాస్ ఓటింగ్ కారణంగా ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి ప్రతి కూలంగా మారతాయన్నది తెలువాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.