కారును పోలీసులే తీసుకెళ్లారు: శేషయ్య
న్యాయవాది కిడ్నాప్‌నకు వాడిన కారు యజమాని శేషయ్య
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై కోర్టుకెక్కిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో వినియోగించిన కారును పోలీసులు తీసుకెళ్లినట్లు దాని యజమాని పబ్బు శేషయ్య ధ్రువీకరించారు. అయితే ‘సాక్షి’ నుంచి వచ్చినట్లు చెప్పగానే లేదు లేదు.. తన స్నేహితులు తీసుకెళ్లారని మాట మార్చారు. ఎవరా స్నేహితులు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు.
కారు అక్కడ నిలబెట్టి ఉండగా, న్యాయవాదికి చెందినవారు అనవసర రాద్ధాంతం చేశారని వ్యాఖ్యానించారు. న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇందుకు ఉపయోగించిన ఏపీ26-ఎపి9559 కారు నెల్లూరులోని శ్రీనివాస అగ్రహారానికి చెందిన పబ్బు శేషయ్యది. ఆయన రాజరాజేశ్వరి ట్రావెల్స్‌ను నడుపుతున్నారు. ట్రావెల్స్ ద్వారా కారును నడుపుతున్నా, దానికి టూరిస్టు పర్మిట్ లేదు. సొంత కారుగానే చెప్పుకుంటూ అద్దెకు తిప్పుతున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు కారును బాడుగకు తీసుకున్నట్లు తెలిసింది. కారును హైదరాబాద్‌కు తీసుకెళ్లి పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌నకు ప్రయత్నించారు.