Paddy Seeds
-
నేటి నుంచి రాయితీ వరి విత్తనం
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఖరీఫ్‌లో రాయితీ వరి విత్తనం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ద్వారా నేటి నుంచి 13 రకాల వరి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. గతేడాది రాష్ట్రంలో 39.54 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ఈ ఏడాది 41.20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ప్రస్తుత సీజన్ కోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సర్టిఫై చేసిన 2.37 లక్షల క్వింటాళ్ల రాయితీ విత్తనాన్ని సిద్ధం చేసింది. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో కిలోకి రూ.10, మిగిలిన 8 జిల్లాల్లో కిలోకు రూ.5 చొప్పున రాయితీపై పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. ఆర్బీకేల్లో టెస్టింగ్ కిట్లు.. ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారులకు మాత్రమే వరి వంగడాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న రోజే సబ్సిడీ పోను మిగిలిన నగదు మొత్తాన్ని తీసుకుంటారు. పంపిణీకి ముందు వాటి నాణ్యతను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ), మండల వ్యవసాయాధికారి (ఎంఏవో), వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)లు పరీక్షించనున్నారు. ఇందుకోసం ప్రతి ఆర్బీకే వద్ద మినీ సీడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. సబ్సిడీ విత్తన పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. సబ్సిడీ విత్తనంతో నాటిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తారు. ఏ గ్రామంలో ఏ రైతుకు ఏ రకం వంగడం.. ఎంత పరిమాణంలో సరఫరా చేశారో ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఆ వంగడాలొద్దంటున్న ప్రభుత్వం ఏళ్ల తరబడి సాగు చేస్తున్న కొన్ని రకాల వంగడాలు తెగుళ్లను తట్టుకోలేకపోవడం, గింజలపై మచ్చలేర్పడడం, మిల్లింగ్‌లో ముక్కలైపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో వీటి సాగును పూర్తిగా ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా రైతులకు అవగాహన కల్పించనుంది. సాగుకు అనుకూల వంగడాలు, మేలైన సాగు, నీటి యాజమాన్య పద్ధతులపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయనుంది. సాగుకు అనుకూలంగా లేని వరి విత్తనాలను డీలర్లు విక్రయించకుండా చర్యలు చేపట్టింది. 13 రకాల వంగడాలు.. ఖరీఫ్–2021 సీజన్లో 13 రకాల వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. వాతావరణాన్ని తట్టుకోలేని, నూక శాతం ఎక్కువగా ఉన్న మార్కెట్లో డిమాండ్ లేని వంగడాలను ఈ సీజన్లో ఆపేయాలని నిర్ణయించాం. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వంగడాల సాగును ప్రోత్సహించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. నేటి నుంచి పంపిణీ చేయనున్న రాయితీ విత్తనం కోసం రైతులు డి.క్రిష్ యాప్ ద్వారా ఆర్బీకేల్లో వివరాలను నమోదు చేసుకుంటున్నారు. – అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
వరి.. బ్యాక్టీరియా పని సరి
హైదరాబాద్: వరి.. దేశంలోనే అతి ముఖ్యమైన పంట. వరి పంట వేసిన తర్వాత అది చేతికందే లోపు అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేసి రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వరిని పట్టిపీడిస్తున్న వాటిలో జాంతోమోనాస్ ఒరిజే అనే బ్యాక్టీరియా ఒకటి. ఇది సోకడం వల్ల దేశంలోని రైతులు 60 శాతం పంటను నష్టపోతున్నారు. ఈ బ్యాక్టీరియా తెగులు నుంచి వరి పంటను కాపాడేందుకు గాను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు డాక్టర్ హితేంద్రపటేల్, డాక్టర్ రమేష్, సోహినీదేవ్‌లు అధ్యయనం నిర్వహించారు. జాంతోమోనాస్ బ్యాక్టీరియాలోని జోప్– క్యూ అనే ఎంజైమ్ వరి పంట నష్టానికి కారణమని గుర్తించారు. జోప్– క్యూ వరి మొక్క కణాలపై దాడి చేసి మొక్క కణకవచాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తుంది. రోగనిరోధక శక్తి కలిగిన మాలిక్యూల్స్‌ను టార్గెట్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి వాటిపై దాడి చేస్తుంది. ప్రోటీన్ దిశను మార్చి... కణాల మీద బ్యాక్టీరియా దాడి చేసినపుడు మొక్కలోని రక్షిత వ్యవస్థకు, సూక్ష్మక్రిమికి మధ్య జరిగే పోరాటంలో మొక్క తనను తాను కాపా డుకుంటే రక్షించబడుతుంది. లేదంటే వ్యాధి బారిన పడుతుంది. అయితే బ్యాక్టీరియాదే పైచేయిగా నిలవడంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లు తూ వస్తోందని చెప్పారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు వరి మొక్కలో వ్యాధికి కారకంగా మారిన ప్రోటీన్ అనుక్రమాన్ని ఒక దశ వద్ద మార్చివేశారు. రోగనిరోధక శక్తి కలిగి వ్యాధి బారిన పడుతున్న 14–3–3 అనుక్రమం కలిగిన ప్రోటీన్ దిశలో మార్పు చేయడం వల్ల బ్యాక్టీరియా దాడి ప్రభావం చూపలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోటీన్ దిశను మార్చడం వల్ల వరి మొక్కకణాలను నాశనం చేసే బ్యాక్టీరియల్ హైజాక్‌ను అడ్డుకోవడంతో పాటు మొక్క కణజాలంలో రక్షణ సంబంధ ప్రతిచర్యలను పటిష్టపర్చడం కూడా సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
కోటి గోటి తలంబ్రాల పంటకు శ్రీకారం
వరి విత్తనాలు జల్లిన ఏసీబీ డీఎస్పీ మురళీకృష్ణ రాజానగరం: వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఒంటిమిట్ట రాములవారికి గోటితో ఒలిచే కోటి తలంబ్రాలు సమర్పించే నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం ఆధ్వర్యంలో వరిసాగుకు సో మవారం శ్రీకారం చుట్టారు. రాజానగరం మం డలం వెలుగుబంద గ్రామంలో నాతిపా ము శ్రీరామ్మూర్తికి చెందిన పొలంలో ‘జై శ్రీరా మ్’ అని జపిస్తూ ఏసీబీ డీఎస్పీ జి.మురళీకృష్ణ చేతుల మీదుగా వరి విత్తనాలు చల్లించారు. తొలుత శాస్త్రోక్తంగా ధాన్యలక్ష్మి అనుష్టానంతో విత్తనశుద్ధి చేశారు. ‘శ్రీరామ నామం అనే విత్త నం మనస్సులో నాటుకుంటే జ్ఞానం అనే పం ట పండుతుంది’ అని సంఘం ప్రతినిధి కల్యా ణం అప్పారావు అన్నారు. అదే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాములోరి కల్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందించనున్నట్టు చెప్పారు. భద్రాద్రి రాముడి కల్యాణానికి గత సంవత్సరం మాదిరే ఈ సంవత్సరమూ గోకవరం మండలంలో ప్రత్యేకంగా వరి పంటను సాగు చేస్తున్నారు. -
మెట్ట వరికి మేలైన గొర్రు!
నేరుగా పొడి దుక్కిలోనే సులువుగా విత్తనాలేయొచ్చు ఒక్క మనిషే గంటకో ఎకరంలో వెద పెట్టవచ్చు ఎకరానికి రూ. 5 వేలు ఆదా పొడి దుక్కిలోనే వరి విత్తనం అరకతో వెదపెట్టే గొర్రుతో ఆరు తడి వరి సాగును సులభతరంగా మార్చాడు మేడిపల్లి రమేష్ అనే యువ రైతు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామం. పదో తరగతి చదివిన రమేష్ తన తొమ్మిదెకరాల పొలంలో సేద్యం చేస్తున్నాడు. మెట్ట పైర్లలో విత్తనాలు వెద బెట్టేందుకు వాడే గొర్రుకు తగిన మార్పులు చేర్పులు చేసి వరి విత్తనాలు వెదబెట్టే గొర్రును రూపొందించాడు. దీనికి జడిగంను అమర్చి పైన ఐదు కేజీల విత్తనాలు పోసుకునేలా డ్రమ్మును ఏర్పాటు చేశాడు. దీంతో అరక వెంట ఉండి విత్తనం వెదపెట్టేందుకు మరో మనిషి అవసరం లేకుండా పోయింది. గొర్రు ఎక్కువ లోతుకు దిగకుండా రెండు వైపులా కర్ర చక్రాలను అమర్చాడు. గొర్రుకు ఉండే ఐదు చెక్కల వద్ద.. ప్రతి రంధ్రంలో నుంచి జారే ధాన్యం గింజలు అంగుళం లోతులో పడేలా పైపులను అమర్చాడు. సాళ్ల మధ్య 9 అంగుళాలు, మొక్కల మధ్య రెండు అంగుళాల దూరం ఉంటుంది. పాదుల్లో పడే విత్తనాల సంఖ్యను పెంచుకు నేందుకు, తగ్గించు కునేందుకు లివర్‌ను ఏర్పాటు చేశాడు. చేలో చెత్తా చెదారం లేకుండా దుక్కి మెత్తగా చేసుకొంటే చాలు. రైతు ఒంటరిగానే రోజుకు నాలుగెకరాల్లో విత్తనాలు వెద పెట్టవచ్చు. దీని తయారీకి రమేష్‌కు రూ. 6 వేలు ఖర్చయింది. నాట్లు వేసే పద్ధతితో పోల్చితే ఈ విధానంలో ఎకరాకు రూ. 5 వేల వరకు ఖర్చు త గ్గుతుంది. నారు పోయడం మొదలుకొని నాట్లు వేసేందుకు, దారులు తీసేందుకయ్యే కూలి ఖర్చు తగ్గుతుంది. ట్రాక్టర్‌తో దమ్ము చేసే ఖర్చు కలిసి వస్తుంది. ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు చాలు. సాళ్ల విధానంతో మొక్కల మధ్య దూరం ఉండి.. గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. పురుగుల బెడద, పురుగుమందుల ఖర్చు తగ్గుతుంది. సాగునీటి కొరత ఉన్న సందర్భాల్లో రమేష్ ఆరుతడులు అందిస్తున్నారు. మెట్ట వరిలో ఎకరానికి 35 బస్తాలకు పైగా దిగుబడి సాధించడం ఈ ప్రాంతంలో విశేషమే. - ఆళ్ల కిషోర్ కుమార్, గోవిందరావుపేట, వరంగల్ జిల్లా ఇతరుల పొలాల్లోనూ వరి విత్తనాలు వెద పెడుతున్నా.. ఈ గొర్రు వాడకం ద్వారా ఖర్చులు తగ్గి, రైతుకు నికర లాభం పెరుగుతుంది. నా పొలంతో పాటు ఇతర రైతుల పొలాల్లోనూ ఈ గొర్రుతో విత్తనాలు వేస్తున్నా. అందరికీ మంచి దిగుబడులే వచ్చాయి. రైతులడిగితే గొర్రును తయారుచేసిస్తా. దమ్ము చేసిన పొలాల్లోనూ వెదపెట్టేందుకు పనికొచ్చేలా ఈ గొర్రులో మార్పులు చేస్తున్నా. - మేడిపల్లి రమేష్ (84669 33668), చల్వాయి గ్రామం, గోవిందరావు పేట మండలం, వరంగల్ జిల్లా -
‘జైశ్రీరాం’ వరికి పెరుగుతున్న డిమాండ్
మోర్తాడ్: సన్నరకంలో మరింత సన్నగా ఉండే జై శ్రీరాం రకం వరికి డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేటు విత్తన కంపెనీలు ఐదేళ్ల కింద జై శ్రీరాం రకం వరి విత్తనాలను ఉత్పత్తి చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్ సబ్ డివిజన్లోని రైతులు దీనిని ఎక్కువగా సాగు చేశారు. సాధారణంగా సన్న రకాల్లో బీపీటీ, హెచ్ఎంటీ రకాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. జై శ్రీరాం రకం బీపీటీ, హెచ్‌ఎంటీల కంటే సన్నగా ఉండటంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బీపీటీ, హెచ్ఎంటీ ల ధర అంతంతమాత్రమే. జై శ్రీరాం రకానికి మాత్రం పెరుగుతోంది. మార్కెట్ ఆరంభమైన మొదట్లో క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,750 పలికిన ధర ఇప్పుడు రూ. 2,200కు చేరింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సన్న రకాలను దాదాపు 70 వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. జై శ్రీరాం రకాన్ని ఎనిమిది వేల ఎకరాల వరకు పండించారు. బీపీటీ, హెచ్‌ఎంటీలు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే జై శ్రీరాం రకం 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది. జై శ్రీరాం క్వింటాల్ ధర రూ. 2,300 ఉంది. ఈ రకం బియ్యం క్వింటాల్‌కు రూ. 5,200కు పైగా ఉంది. -
ఇవి పెట్టుబడి లేని రాచ‘బాటలు’!
పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా): వరి నాట్లు వేస్తున్నారా? ఇప్పటికే వేశారా? విత్తనాలను చేలో వెదజల్లారా? డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించి విత్తనాలు వేశారా?... ఏం చేసినా ఫర్వాలేదు. కాలిబాటలు తీయడం మాత్రం మరచిపోవద్దు. ఎందుకంటే వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందుకోసం పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, పంటకాలంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కాలిబాటలు పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు రిటైర్డ్ ఏడీఏ పి.సత్యనారాయణ. ఆ వివరాలు మీ కోసం... ఎలా తీయాలి? వరి నాట్లు వేసిన తర్వాత చేలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాట తీయాలి. నాట్లు వేసిన 12 నుంచి 16 రోజుల లోపు కాలిబాట తీయడం మంచిది. మందపాటి తాడును చేనుకు అవతలి గట్టున ఒకరు, ఇవతలి గట్టున ఒకరు పట్టుకొని లాగాలి. వాటి చివర్లను ఒక కట్టెకు కట్టి గట్టు మీద గుచ్చాలి. ఆ తాడుకు 20 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా మరో తాడును ఇదే పద్ధతిలో ఏర్పాటు చేయాలి. రెండు తాళ్ల మధ్య ఉన్న ప్రదేశంలోని మొక్కలను తీసేయాలి. పైరు పలచగా ఉన్న చోట ఆ మొక్కలను నాటుకోవచ్చు. కొందరు రైతులు వరి నాట్లు వేసేటప్పుడే కాలిబాటలు తీస్తుంటారు. అలాంటప్పుడు ముందుగానే గట్ల మధ్య తాళ్లు లాగి, ఆ ప్రదేశాన్ని వదిలి, మిగిలిన రెండు వైపులా మొక్కలు నాటాలి. చేలో విత్తనాలను వెదజల్లిన రైతులు కూడా కాలిబాటలు తీసుకోవచ్చు. విత్తనాలు చల్లిన 15-20 రోజుల మధ్యలో... అంటే పైరు ఎదుగుతున్న సమయంలో ప్రతి 2 మీటర్లకూ 20 సెంటీమీటర్ల వెడల్పులో మొక్కలను తొలగిస్తే సరిపోతుంది. సాధారణంగా వెదజల్లే పద్ధతిలో పైరును పలచన చేస్తుంటారు. ఆ సమయంలోనే కాలిబాటలు తీయడం మంచిది. డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించి విత్తనాలు వేసే వారు... దానితో ఒక వరుస విత్తనాలు వేయడం పూర్తయిన తర్వాత 20 సెంటీమీటర్ల స్థలాన్ని వదిలి మరో వరుస విత్తనాలు వేసుకోవాలి. ఖరీఫ్‌లో తూర్పు-పడమర దిశగా, రబీలో ఉత్తర-దక్షిణ దిశగా కాలిబాటలు తీసుకోవాలి. అంతరసేద్యం సులభం వరి చేలో అంతరసేద్యానికి కాలిబాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కూలీలతో కలుపు తీయించడానికి ఇవి బాగా అనువుగా ఉంటాయి. అనేక రకాల పురుగులకు ఆశ్రయమిచ్చే ఊద, తూటుకాడ, బొక్కెనాకు, పిల్లి అడుగు వంటి కలుపు మొక్కలను తేలికగా తీసేయవచ్చు. చేలో ఎలుక బొరియలను గుర్తించడం, అవసరమైన నివారణ చర్యలు చేపట్టడం కూడా సులభమవుతుంది. కేళీల్లో అరుదైన రకాలను కూడా కాలిబాటల ద్వారా గుర్తించి తొలగించవచ్చు. కాలిబాటల వల్ల ఒత్తుగా ఉన్న మొక్కలను తీసి, పైరును పలచన చేయడం తేలికవుతుంది. చీడపీడలు దూరం కాలిబాటల వల్ల వరి పైరుకు గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. మొక్కల్లో పత్రహరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది. పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గాలి సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి వరి మొక్కలు ఆక్సిజన్‌ను గ్రహించేందుకు పెద్దగా శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. గాలి, వెలుతురు ధారాళంగా అందడం వల్ల పైరులో చీడపీడల బెడద కూడా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఉన్నా వాటిని నిర్మూలించడం తేలిక. దుబ్బులను ఆశించి పైరుకు నష్టం కలిగించే బూడిద రంగు దోమ, తెల్లదోమ, పచ్చ దీపపు పురుగులను సకాలంలో గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. కాలిబాటలు ఉంటే పొలం నుంచి ఎప్పటికప్పుడు మురుగు నీటిని తీసేయడం తేలిక. దీనివల్ల ఆకు గొట్టాల పురుగు, నాము పురుగు ఉధృతి తగ్గుతుంది. కాలిబాటల చివర పంగలకర్రలు నాటితే పక్షులు వాటి పైకి చేరి, హానికారక కీటకాలను పట్టుకొని తినేస్తాయి. దిగుబడులు పెరుగుతాయి కాలిబాటలు తీయడం వల్ల వరి పైరులో దిగుబడులు 10-13 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. కాలిబాటలు సాగు నీటి వినియోగ సామర్థ్యం పెరగడానికి దోహదపడతాయి. ఎందుకంటే పంటకు ఎంత నీరు అవసరమో ఎప్పటికప్పుడు గమనిస్తూ అంతే నీటిని అందించవచ్చు. భూమిలోని సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్లడానికి కాలిబాటలు ఉపయోగపడతాయి. దీనివల్ల మొక్కలకు పోషకాలు లభించి, మంచి దిగుబడులు వస్తాయి. కోత దశలోనూ ఉపయోగపడతాయి కాలిబాటలు కోత దశలోనూ రైతులకు ఉపయోగపడతాయి. పంట కోత దశలో జరిగే నష్టాన్ని ఇవి నివారిస్తాయి. ఎలాగంటే కాలిబాటలు తీస్తే... పంట కోసేటప్పుడు వంగిపోయిన మొక్కలను నిలబెట్టడం తేలికవుతుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దుబ్బులు నేలకు ఒరిగితే వాటిని సరిచేయవచ్చు. కాలిబాటలు లేకపోతే పంట ఒరిపిడికి గింజలు రాలిపోతాయి. కోత ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ లాభాలు కూడా... కాలిబాటల వల్ల వరి పైరులో చీడపీడలు-కలుపు నివారణకు మందులు పిచికారీ చేయడం చాలా సులభమవుతుంది. ఎరువులు వేయడం కూడా తేలికవుతుంది. ఎరువులను పొలమంతా సమానంగా పడేలా వేసుకోవచ్చు. కాలిబాటలు వేసిన చేలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలియదిరగవచ్చు. పంటను నిశితంగా పరిశీలించవచ్చు. పొలంలో నీటి పరిస్థితిపై ఒక అవగాహనకు రావచ్చు. చీడపీడల ఉనికి, ఉధృతిని గమనిస్తూ ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వరి కోతకు ముందు మినుములు, పెసలు వంటి పప్పు పంటల విత్తనాలు చల్లుకోవడానికి కూడా కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి. -
దగాపై కన్నెర్ర
- నాసిరకం వరి విత్తనాలను - అంటగట్టారంటూ రైతన్న ఆగ్రహం - ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ఆందోళన - పట్నం చౌరస్తాలో రాస్తారోకో.. - విత్తనాలను తగులబెట్టి నిరసన ఇబ్రహీంపట్నం రూరల్: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో ప్రకృతి వికటాట్టహాసం చేస్తుండడంతో ఇప్పటికే పుట్టెడు క ష్టాలతో కాలం నెట్టుకొస్తున్న అన్నదాతను విత్తన వ్యాపారులూ దగా చేస్తున్నారు. నాసిరకం విత్తనాలను అంటగట్టి నిలువునా దోచుకుంటున్నారు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యాపారుల దగాపై కన్నెర్రజేశారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని నాసిరకం విత్తనాలను విక్రయి స్తూ మోసం చేస్తున్నారని రైతులు రాస్తారోకో చేశారు. నాసిరకం విత్తన బ్యాగులను తగులబెట్టారు. పాలకుల నుంచి అధికారుల వరకు అందరూ రైతుల జీవితాలతో ఆడుకునేవారే.. ఒక్కరూ పట్టించుకోరంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల కథనం ప్రకారం ఇదీ మోసం..ఇబ్రహీంపట్నంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ దుకాణంలో పలువురు రైతులు కొన్నాళ్ల క్రితం ఒక్కో వరి విత్తన బస్తాను రూ.750కి కొనుగోలు చేశారు. సాధారణ రకం కాకుండా లక్ష్మీగణపతి, అర్ణపూర్ణ కంపెనీలకు చెందిన బీపీటీ 1010, ఐఈఆర్64, తెల్లహంస విత్తనాలను కొన్నారు. నెలలు గడుస్తున్నా నారు మొలక కూడా రాలేదు. ‘ఇప్పటికే తాము సమస్యలతో సతమతమవుతుంటే సందట్లో సడేమియాలాగా ఫర్టిలైజర్ దుకాణాల వారూ నిండాముంచారు. మొలకెత్తని నాసిరకం విత్తనాలను అంటగడతారా’ అంటూ రైతులు కన్నెరజేశారు. ఫర్టిలైజర్ షాపులోని నాసిరకం విత్తనాలను రోడ్డుపై పోసి తగులబెట్టారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని సోమవారం ఇక్కడ జరిగిన ఘటనతో స్పష్టమైంది. రైతులు ఎంత మొత్తుకుంటున్నా వ్యాపారులు పెడచెవినబెట్టి.. నాసిరకం విత్తనాలనే విక్రయిస్తున్నారు. రోహిణి కార్తెలో విత్తనాలు వేస్తే సకాలంలో మొలకెత్తి.. నాటు వేయడానికి వీలుంటుందని భావించిన రైతులను నిలువెల్లా మోసం చేస్తున్నారు. మాకేం సంబంధం లేదు.. ఈ విషయంలో ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుల వాదన మరోలా ఉంది. నాసిరకం విత్తనాలతో తమకెటువంటి సంబంధం లేదని.. అది పూర్తిగా ఆయా కంపెనీల తప్పిదమేనని చెబుతున్నారు. వారిచ్చిన విత్తనాలనే తాము విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు మాత్రం ఈ దగాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. తమ పొట్టకొట్టిన షాపు నిర్వాహకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విత్తనాలను పరిశీలిస్తాం: కంపెనీ ప్రతినిధులు విత్తనాల విషయమై రైతులు ఆందోళన చేపట్టడంతో రంగంలోకి దిగిన వ్యవసాయాధికారులు సదరు విత్తన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. మంగళవారం విత్తనాలను పరిశీలించేందుకు వస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. విత్తనాలు తీసుకున్న రైతులకు తిరిగి డబ్బులను వాపసు ఇస్తామని చెప్పగా.. రైతులు దీనికి ససేమిరా అన్నారు. కార్తె బలం ఉన్నప్పుడే విత్తనాలు వేస్తే ఫలితం ఉంటుందని.. ప్రస్తుతం వేస్తే ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. విత్తనాలతోపాటు, ఎరువులు, దున్నడానికి, ఇతరత్రా ఖర్చులు కలుపుకొని సుమారు రూ.4వేలు ఖర్చయ్యిందని.. ఆ డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్ షాపు నిర్వాకంపై వ్యవసాయాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు ఆకుల ఆనంద్‌కుమార్, ఆదర్శ రైతు యాదయ్యతోపాటు సుమారు 40 మంది రైతులు పాల్గొన్నారు.