ఇవి పెట్టుబడి లేని రాచ‘బాటలు’!
పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా): వరి నాట్లు వేస్తున్నారా? ఇప్పటికే వేశారా? విత్తనాలను చేలో వెదజల్లారా? డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించి విత్తనాలు వేశారా?... ఏం చేసినా ఫర్వాలేదు. కాలిబాటలు తీయడం మాత్రం మరచిపోవద్దు. ఎందుకంటే వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందుకోసం పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, పంటకాలంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కాలిబాటలు పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు రిటైర్డ్ ఏడీఏ పి.సత్యనారాయణ. ఆ వివరాలు మీ కోసం...
ఎలా తీయాలి?
వరి నాట్లు వేసిన తర్వాత చేలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాట తీయాలి. నాట్లు వేసిన 12 నుంచి 16 రోజుల లోపు కాలిబాట తీయడం మంచిది. మందపాటి తాడును చేనుకు అవతలి గట్టున ఒకరు, ఇవతలి గట్టున ఒకరు పట్టుకొని లాగాలి. వాటి చివర్లను ఒక కట్టెకు కట్టి గట్టు మీద గుచ్చాలి. ఆ తాడుకు 20 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా మరో తాడును ఇదే పద్ధతిలో ఏర్పాటు చేయాలి. రెండు తాళ్ల మధ్య ఉన్న ప్రదేశంలోని మొక్కలను తీసేయాలి. పైరు పలచగా ఉన్న చోట ఆ మొక్కలను నాటుకోవచ్చు.
కొందరు రైతులు వరి నాట్లు వేసేటప్పుడే కాలిబాటలు తీస్తుంటారు. అలాంటప్పుడు ముందుగానే గట్ల మధ్య తాళ్లు లాగి, ఆ ప్రదేశాన్ని వదిలి, మిగిలిన రెండు వైపులా మొక్కలు నాటాలి. చేలో విత్తనాలను వెదజల్లిన రైతులు కూడా కాలిబాటలు తీసుకోవచ్చు. విత్తనాలు చల్లిన 15-20 రోజుల మధ్యలో... అంటే పైరు ఎదుగుతున్న సమయంలో ప్రతి 2 మీటర్లకూ 20 సెంటీమీటర్ల వెడల్పులో మొక్కలను తొలగిస్తే సరిపోతుంది. సాధారణంగా వెదజల్లే పద్ధతిలో పైరును పలచన చేస్తుంటారు. ఆ సమయంలోనే కాలిబాటలు తీయడం మంచిది. డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించి విత్తనాలు వేసే వారు... దానితో ఒక వరుస విత్తనాలు వేయడం పూర్తయిన తర్వాత 20 సెంటీమీటర్ల స్థలాన్ని వదిలి మరో వరుస విత్తనాలు వేసుకోవాలి. ఖరీఫ్‌లో తూర్పు-పడమర దిశగా, రబీలో ఉత్తర-దక్షిణ దిశగా కాలిబాటలు తీసుకోవాలి.
అంతరసేద్యం సులభం
వరి చేలో అంతరసేద్యానికి కాలిబాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కూలీలతో కలుపు తీయించడానికి ఇవి బాగా అనువుగా ఉంటాయి. అనేక రకాల పురుగులకు ఆశ్రయమిచ్చే ఊద, తూటుకాడ, బొక్కెనాకు, పిల్లి అడుగు వంటి కలుపు మొక్కలను తేలికగా తీసేయవచ్చు. చేలో ఎలుక బొరియలను గుర్తించడం, అవసరమైన నివారణ చర్యలు చేపట్టడం కూడా సులభమవుతుంది. కేళీల్లో అరుదైన రకాలను కూడా కాలిబాటల ద్వారా గుర్తించి తొలగించవచ్చు. కాలిబాటల వల్ల ఒత్తుగా ఉన్న మొక్కలను తీసి, పైరును పలచన చేయడం తేలికవుతుంది.
చీడపీడలు దూరం
కాలిబాటల వల్ల వరి పైరుకు గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. మొక్కల్లో పత్రహరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది. పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గాలి సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి వరి మొక్కలు ఆక్సిజన్‌ను గ్రహించేందుకు పెద్దగా శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. గాలి, వెలుతురు ధారాళంగా అందడం వల్ల పైరులో చీడపీడల బెడద కూడా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఉన్నా వాటిని నిర్మూలించడం తేలిక. దుబ్బులను ఆశించి పైరుకు నష్టం కలిగించే బూడిద రంగు దోమ, తెల్లదోమ, పచ్చ దీపపు పురుగులను సకాలంలో గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. కాలిబాటలు ఉంటే పొలం నుంచి ఎప్పటికప్పుడు మురుగు నీటిని తీసేయడం తేలిక. దీనివల్ల ఆకు గొట్టాల పురుగు, నాము పురుగు ఉధృతి తగ్గుతుంది. కాలిబాటల చివర పంగలకర్రలు నాటితే పక్షులు వాటి పైకి చేరి, హానికారక కీటకాలను పట్టుకొని తినేస్తాయి.
దిగుబడులు పెరుగుతాయి
కాలిబాటలు తీయడం వల్ల వరి పైరులో దిగుబడులు 10-13 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. కాలిబాటలు సాగు నీటి వినియోగ సామర్థ్యం పెరగడానికి దోహదపడతాయి. ఎందుకంటే పంటకు ఎంత నీరు అవసరమో ఎప్పటికప్పుడు గమనిస్తూ అంతే నీటిని అందించవచ్చు. భూమిలోని సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్లడానికి కాలిబాటలు ఉపయోగపడతాయి. దీనివల్ల మొక్కలకు పోషకాలు లభించి, మంచి దిగుబడులు వస్తాయి.
కోత దశలోనూ ఉపయోగపడతాయి
కాలిబాటలు కోత దశలోనూ రైతులకు ఉపయోగపడతాయి. పంట కోత దశలో జరిగే నష్టాన్ని ఇవి నివారిస్తాయి. ఎలాగంటే కాలిబాటలు తీస్తే... పంట కోసేటప్పుడు వంగిపోయిన మొక్కలను నిలబెట్టడం తేలికవుతుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దుబ్బులు నేలకు ఒరిగితే వాటిని సరిచేయవచ్చు. కాలిబాటలు లేకపోతే పంట ఒరిపిడికి గింజలు రాలిపోతాయి. కోత ఖర్చు కూడా పెరుగుతుంది.
ఈ లాభాలు కూడా...
కాలిబాటల వల్ల వరి పైరులో చీడపీడలు-కలుపు నివారణకు మందులు పిచికారీ చేయడం చాలా సులభమవుతుంది. ఎరువులు వేయడం కూడా తేలికవుతుంది. ఎరువులను పొలమంతా సమానంగా పడేలా వేసుకోవచ్చు. కాలిబాటలు వేసిన చేలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలియదిరగవచ్చు. పంటను నిశితంగా పరిశీలించవచ్చు. పొలంలో నీటి పరిస్థితిపై ఒక అవగాహనకు రావచ్చు. చీడపీడల ఉనికి, ఉధృతిని గమనిస్తూ ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వరి కోతకు ముందు మినుములు, పెసలు వంటి పప్పు పంటల విత్తనాలు చల్లుకోవడానికి కూడా కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి.