తాను రూపొందించిన గొర్రుతో వరి విత్తనాలను వెద పెడుతున్న రైతు రమేష్. (పక్కన) గొర్రు
నేరుగా పొడి దుక్కిలోనే సులువుగా విత్తనాలేయొచ్చు
ఒక్క మనిషే గంటకో ఎకరంలో వెద పెట్టవచ్చు
ఎకరానికి రూ. 5 వేలు ఆదా
పొడి దుక్కిలోనే వరి విత్తనం అరకతో వెదపెట్టే గొర్రుతో ఆరు తడి వరి సాగును సులభతరంగా మార్చాడు మేడిపల్లి రమేష్ అనే యువ రైతు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామం. పదో తరగతి చదివిన రమేష్ తన తొమ్మిదెకరాల పొలంలో సేద్యం చేస్తున్నాడు. మెట్ట పైర్లలో విత్తనాలు వెద బెట్టేందుకు వాడే గొర్రుకు తగిన మార్పులు చేర్పులు చేసి వరి విత్తనాలు వెదబెట్టే గొర్రును రూపొందించాడు. దీనికి జడిగంను అమర్చి పైన ఐదు కేజీల విత్తనాలు పోసుకునేలా డ్రమ్మును ఏర్పాటు చేశాడు. దీంతో అరక వెంట ఉండి విత్తనం వెదపెట్టేందుకు మరో మనిషి అవసరం లేకుండా పోయింది. గొర్రు ఎక్కువ లోతుకు దిగకుండా రెండు వైపులా కర్ర చక్రాలను అమర్చాడు. గొర్రుకు ఉండే ఐదు చెక్కల వద్ద.. ప్రతి రంధ్రంలో నుంచి జారే ధాన్యం గింజలు అంగుళం లోతులో పడేలా పైపులను అమర్చాడు. సాళ్ల మధ్య 9 అంగుళాలు, మొక్కల మధ్య రెండు అంగుళాల దూరం ఉంటుంది. పాదుల్లో పడే విత్తనాల సంఖ్యను పెంచుకు నేందుకు, తగ్గించు కునేందుకు లివర్‌ను ఏర్పాటు చేశాడు. చేలో చెత్తా చెదారం లేకుండా దుక్కి మెత్తగా చేసుకొంటే చాలు. రైతు ఒంటరిగానే రోజుకు నాలుగెకరాల్లో విత్తనాలు వెద పెట్టవచ్చు. దీని తయారీకి రమేష్‌కు రూ. 6 వేలు ఖర్చయింది.
నాట్లు వేసే పద్ధతితో పోల్చితే ఈ విధానంలో ఎకరాకు రూ. 5 వేల వరకు ఖర్చు త గ్గుతుంది. నారు పోయడం మొదలుకొని నాట్లు వేసేందుకు, దారులు తీసేందుకయ్యే కూలి ఖర్చు తగ్గుతుంది. ట్రాక్టర్‌తో దమ్ము చేసే ఖర్చు కలిసి వస్తుంది. ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు చాలు. సాళ్ల విధానంతో మొక్కల మధ్య దూరం ఉండి.. గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. పురుగుల బెడద, పురుగుమందుల ఖర్చు తగ్గుతుంది. సాగునీటి కొరత ఉన్న సందర్భాల్లో రమేష్ ఆరుతడులు అందిస్తున్నారు. మెట్ట వరిలో ఎకరానికి 35 బస్తాలకు పైగా దిగుబడి సాధించడం ఈ ప్రాంతంలో విశేషమే.
- ఆళ్ల కిషోర్ కుమార్, గోవిందరావుపేట, వరంగల్ జిల్లా
ఇతరుల పొలాల్లోనూ
వరి విత్తనాలు వెద పెడుతున్నా..
ఈ గొర్రు వాడకం ద్వారా ఖర్చులు తగ్గి, రైతుకు నికర లాభం పెరుగుతుంది. నా పొలంతో పాటు ఇతర రైతుల పొలాల్లోనూ ఈ గొర్రుతో విత్తనాలు వేస్తున్నా. అందరికీ మంచి దిగుబడులే వచ్చాయి. రైతులడిగితే గొర్రును తయారుచేసిస్తా. దమ్ము చేసిన పొలాల్లోనూ వెదపెట్టేందుకు పనికొచ్చేలా ఈ గొర్రులో మార్పులు చేస్తున్నా.
- మేడిపల్లి రమేష్ (84669 33668),
చల్వాయి గ్రామం, గోవిందరావు పేట మండలం, వరంగల్ జిల్లా