Pager
-
ట్రంప్‌కు గోల్డెన్ పేజర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గోల్డెన్ పేజర్ బహుమతిగా ఇచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న నెతన్యాహు మంగళవారం అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్‌కు ఈ కానుక అందించారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హెజ్బొల్లా సాయుద సంస్థ సభ్యులను వేర్వేరు చోట్ల ఒకేసారి వేలాది పేజర్లను పేల్చేసి హతమార్చినందుకు గుర్తుగా ఈ బంగారు పేజర్‌ను ట్రంప్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగారు పేజర్‌ను చూశాక ట్రంప్ సైతం ఆనాడు శత్రుదేశంలో ఇజ్రాయెల్ సాహస దాడి ఆపరేషన్ మెచ్చుకుంటూ ‘‘ అది నిజంగా ఒక గొప్ప ఆపరేషన్’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ సైతం నెతన్యాహు దంపతుల ఒక ఫొటోను బహూకరించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హెజ్బొల్లా ఉగ్రవాదులు ఉపయోగించిన వేలాది పేజర్లు పేలాయి. ఆ మరుసటి రోజే వందలాది వాకీటాకీలు పేలాయి. ఈ వరుస ఘటనల్లో మొత్తం 39 మంది హెజ్బొల్లా సభ్యులు మరణించగా, దాదాపు 3,000 మంది గాయపడ్డారు. లెబనాన్‌లో పేజర్ పేలుళ్లకు తామే కారణమని దాదాపు రెండు నెలల తర్వాత నెతన్యాహు వ్యాఖ్యానించడం తెల్సిందే. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో పేలుళ్లకు కొన్ని నెలల ముందు హెజ్బొల్లా ఆర్డర్ చేసిన పేజర్లలో ఇజ్రాయెల్‌కు గూఢచార సంస్థ మొస్సాద్ పేలుడు పదార్థాలను అమర్చినట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ దాడి తరువాత గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య పోరు సాగుతోంది. ఈ దాడుల్లో గ్రూప్ మాజీ చీఫ్ హసన్ నస్రుల్లా సహా పలువురు హెజ్బొల్లా నేతలు హతమయ్యారు. -
పేజర్ దాడులు.. యస్ మా పనే
జెరూసలేం: ఇటీవల లెబనాన్, సిరియాలపై జరిగిన పేజర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు అందిన కొద్ది రోజులకే ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.కాగా ఈ పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది. ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు