బహూకరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గోల్డెన్ పేజర్ బహుమతిగా ఇచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న నెతన్యాహు మంగళవారం అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్‌కు ఈ కానుక అందించారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హెజ్‌బొల్లా సాయుద సంస్థ సభ్యులను వేర్వేరు చోట్ల ఒకేసారి వేలాది పేజర్‌లను పేల్చేసి హతమార్చినందుకు గుర్తుగా ఈ బంగారు పేజర్‌ను ట్రంప్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
బంగారు పేజర్‌ను చూశాక ట్రంప్ సైతం ఆనాడు శత్రుదేశంలో ఇజ్రాయెల్ సాహస దాడి ఆపరేషన్ మెచ్చుకుంటూ ‘‘ అది నిజంగా ఒక గొప్ప ఆపరేషన్’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ సైతం నెతన్యాహు దంపతుల ఒక ఫొటోను బహూకరించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాదులు ఉపయోగించిన వేలాది పేజర్లు పేలాయి. ఆ మరుసటి రోజే వందలాది వాకీటాకీలు పేలాయి. ఈ వరుస ఘటనల్లో మొత్తం 39 మంది హెజ్‌బొల్లా సభ్యులు మరణించగా, దాదాపు 3,000 మంది గాయపడ్డారు.
లెబనాన్‌లో పేజర్ పేలుళ్లకు తామే కారణమని దాదాపు రెండు నెలల తర్వాత నెతన్యాహు వ్యాఖ్యానించడం తెల్సిందే. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో పేలుళ్లకు కొన్ని నెలల ముందు హెజ్‌బొల్లా ఆర్డర్ చేసిన పేజర్లలో ఇజ్రాయెల్‌కు గూఢచార సంస్థ మొస్సాద్ పేలుడు పదార్థాలను అమర్చినట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ దాడి తరువాత గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్– హెజ్‌బొల్లా మధ్య పోరు సాగుతోంది. ఈ దాడుల్లో గ్రూప్ మాజీ చీఫ్ హసన్ నస్రుల్లా సహా పలువురు హెజ్‌బొల్లా నేతలు హతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment