గుర్మీత్ రోజు కూలీ రూ.20
జైలులో కూరగాయలు పండిస్తున్న డేరా బాబా
చండీగఢ్: ఇన్నాళ్లూ డేరా సచ్చా సౌదాలో సకల భోగాలు అనుభవిస్తూ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ ప్రస్తుతం రోజు కూలీగా మారాడు. జైలులో ఎనిమిది గంటలు పనిచేస్తే అతనికి రోజుకు లభించే కూలీ రూ.20. శిష్యురాళ్లపై అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన గుర్మీత్ తన జైలు శిక్ష కాలంలో కూరగాయలు పెంచుతున్నాడు. చెట్ల కొమ్మలను కత్తిరించాల్సి ఉంటుంది. జైలులో గుర్మీత్ గది పక్కనే కొంత ఖాళీ స్థలం ఉందనీ, అందులో కూరగాయలు పండిస్తున్నాడని హరియాణా జైళ్ల శాఖ డీజీపీ మంగళవారం చెప్పారు.
గుర్మీత్ తండ్రి వ్యవసాయదారుడే. చిన్నప్పుడు రాజస్తాన్‌లో పెరిగిన గుర్మీత్ తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేసేవాడు. గుర్మీత్ జైలులో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతున్నాడనీ, ఆయనకు జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదనీ, ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని డీజీపీ వివరణ ఇచ్చారు. ‘అది (గుర్మీత్‌కు జైలులో ప్రత్యేక సౌకర్యాలున్నాయనడం) ఆధారం లేని, ఊహాజనిత వార్త. గుర్మీత్ సహా జైలులో ఏ ఖైదీకి ప్రత్యేక సౌకర్యాలు లేవు. మిగతా అందరు ఖైదీల్లాగానే అతను కూడా సాధారణంగానే జీవిస్తున్నాడు. అందరికీ పెట్టే తిండే అతనికి ఇస్తున్నాం’ అని డీజీపీ చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా గుర్మీత్‌కు ఇతర ఖైదీలతో సంబంధం లేకుండా ఆయన గదిని కొంతదూరంగా ఏర్పాటు చేశామన్నారు.
హనీప్రీత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
రేప్ కేసులో గుర్మీత్ దోషిగా తేలాక హరియాణాలో హింసను రగిలించారనే ఆరోపణలమీద గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.