Pakala lake
-
వామ్మో.. పాకాల వాగులో మొసలి.. భయాందోళనలో రైతులు..
వరంగల్: మండల కేంద్రానికి సమీపంలోని పాకాల వాగు నీటిలో ఆదివారం రైతులకు మొసలి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని వారు తమకు తెలిసిన ఓ ఫొటోగ్రాఫర్‌కు సమాచారం అందించడంతో అతను వీడియోలో బంధించాడు. గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పాకాల వాగు బ్రిడ్జికి సమీపంలో పెద్దమర్రి ఉంది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు సాగవుతున్నాయి. నిత్యం రైతులు దుక్కులు దున్నిన తరువాత పశువులను వాగు నీటితో శుభ్రం చేస్తారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగిన విషయం తెలిసిందే. ఆ నీటిలో కొట్టుకు వచ్చిన మొసలి గూడూరు సమీపంలోని నీటి గుంతలలో సంచరిస్తోంది. రెండు మూడు రోజులుగా పెద్దమర్రి ప్రాంతంలో నీరు తాగడానికి వెళ్లిన గేదెలు, పశువులను చంపడానికి యత్నించగా అవి బెదిరి బయటికి వచ్చాయి. ఈ ఘటనను చూసిన ఓ రైతు మొసలిగా గుర్తించాడు. ఎవరూ నీటిలో దిగొద్దని సహచర రైతులకు తెలిపారు. -
మొసళ్లు ఉన్నాయంటూ కథలు చెప్పారు.. అసలు విషయం వేరు.. బోటింగ్ లేనట్టేనా?
ఖానాపురం (వరంగల్): పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిపై ఆశలు పెంచుకుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. దీంతో పాటు పోస్టల్ స్టాంపుపై ముద్రణకు ఎంపికైంది. అన్ని అర్హతలున్నా అభివృద్ధిలో మాత్రం అంతంతమాత్రంగానే ముందుకు సాగుతుంది పాకాల సరస్సు. పర్యాటకానికి వచ్చే వారిని తన అందాలతో మంత్రముగ్ధులను చేసి మరోసారి తన ఒడిలోకి వచ్చే విధంగా చేస్తుంది. కానీ అధికారుల సమన్వయ లోపం, పాలకుల పట్టింపులేని తనంతో పర్యాటకులు పెదవి విరుస్తున్న దుస్థితి నెలకొంది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో పాకాల సరస్సు సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు చుట్టూ 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభయారణ్యం. (చదవండి: Hyderabad: డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..) బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) 30 ఫీట్ల నీటిసామర్థ్యం కలిగిన సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. మత్తడిపోసే సమయంలో అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి చిలుకలగుట్ట అందాలు, ఔషధవనం, బటర్‌ఫ్లై గార్డెన్తో పాటు అభయారణ్యంలోని వివిధ రకాల పక్షులను తలకిస్తూ ఆనందంగా గడుపుతారు. అభయారణ్యంలో ఉత్సాహంగా గడిపిన తర్వాత నీటిమధ్య ఆనందంగా గడపడానికి బోటింగ్‌కు వెళ్తుంటారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బోటింగ్‌కు వెళ్లి సరస్సు అందాలను తనివితీరా వీక్షిస్తుంటారు. బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) ఫారెస్ట్ అధికారుల మోకాలడ్డు.. పాకాల పర్యాటక ప్రాంతం అటవీ ప్రాంతం మధ్యలో ఉంటుంది. అభయారణ్యం మధ్యలో ఉండే సరస్సులో బోటింగ్‌ను అనేక సంవత్సరాలుగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇదే క్రమంలో సరస్సులో బోటింగ్‌ను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పర్యాటకులతో పాటు స్థానిక ప్రజల నుంచి బోటింగ్‌పై మండల ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందాయి. మండల స్థాయి అధికారులు ఫారెస్ట్ అధికారులతో గతంలో వాగ్వాదాలకు దిగడంతో కొంత కాలం యథావిధిగా నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఫారెస్ట్ అధికారులు మోకాలడ్డు పెట్టడంతో 2020 అక్టోబర్ 7 నుంచి బోటింగ్ సేవలు నిలిచిపోయాయి. (చదవండి: గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్ ) బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) ఇదేంటని పలువురు పర్యాటకులు ప్రశ్నించడంతో సరస్సులో మొసళ్లు ఉన్నాయంటూ కాలం వెళ్లదీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్ శాఖకు పంచాలనే నిబంధన తీసుకువచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్ శాఖకు పంచితే టూరిజం శాఖకు నష్టం కలుగుతుండటంతో బోటింగ్‌ను ప్రారంభించడానికి ముందుకు రావడంలేదని పలువురు అనుకుంటున్నారు. ఇరు శాఖల సమన్వయలోపంతో పర్యాటకులు బోటింగ్ చేయకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులతో చర్చిస్తాం.. పాకాలలో బోటింగ్ విషయాన్ని ఫారెస్ట్ అధికారులతో త్వరలో చర్చిస్తాం. బోటింగ్‌ను తప్పకుండా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. – మనోహర్, ఎండీ, టూరిజం -
పాకాల ఏటిపై వంతెన నిర్మించాలి
గార: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి పాకాల ఏటిపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కాన్వాయ్‌లను మండల అఖిలపక్షం నాయకులు ఆదివారం గార్లచెక్ డ్యాం వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వంతెన నిర్మాణం హామీ నెరవేర్చాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అఖిలపక్ష నాయకులతో చర్చలు జరిపారు. వంతెన నిర్మాణానికి రూ.24 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, త్వరలో నిధులు విడుదల కాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. -
అతిథులకు ఆవాసం.. వలస పక్షులు కోలాహలం
సాక్షి, ఖానాపురం(వరంగల్) : వలస పక్షులకు ఉమ్మడి వరంగల్ జిల్లా నిలయంగా నిలుస్తుంది. ఆతిథ్య కేంద్రంగా, విహార స్థలంగా విరసిల్లుతున్న ఈ ప్రాంతంలో పక్షుల ఆవాసాలకు, జీవ మనుగడకు అనువైన ప్రదేశాలు ఉండడంతో ఆయా కాలాలను అనుసరించి పక్షులు వలస వస్తున్నాయి. శీతాకాలం వచ్చిందంటే ప్రతి ఏటా వరంగల్‌లోని పలు చెరువులు, కుంటలు, మడుగుల వద్ద పక్షుల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబీరియా, ఆస్ట్రేలియా, రష్యా, హిమాలయాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు నవంబర్‌లో చేరుకుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లోని పాకాల, కేశవాపూర్, మేచరాజుపల్లి, పరకాల, ఉర్సుముచ్చర్లనాగారం, గణపురం, శాయంపేట చెరువు ప్రాంతాల్లో వలస పక్షులు ఆకట్టుకుంటున్నాయి. ఒక్క పాకాల సరస్సులోనే ఇప్పటికి 15 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇక్కడ డిసెంబర్, జనవరిలో దాదాపు 40 నుంచి 50 రకాల పక్షులు కనిపిస్తాయి. వలస పక్షులు ఎదుర్కొంటున్న సమస్యలు గడిచిన కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో వలస పక్షుల రాక గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటలను కృత్రిమ పద్ధతిలో రిజర్వాయర్లుగా మార్చడం లేదా మరమ్మతులు చేయడం వల్ల జలచర జీవుల కొరత ఏర్పడి ఆహారం దొరక్క పక్షుల వలసలు తగ్గిపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు, బయో వ్యర్థాలను చెరువుల్లో వేయడం, ఫ్యాక్టరీల వ్యర్థాలను సమీప చెరువుల్లోకి, చిత్తడి నేలల్లోకి వదలడం ద్వారా నీరంతా కలుషితమవడం వల్ల పక్షులు రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోతున్నాయని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు పేర్కొంటున్నారు. పంట పొలాల్లో చల్లే విష గుళికల ప్రభావానికి మృత్యువాత పడటం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, పక్షుల వేట పెరగడం వలసలు తగ్గడానికి కారణమని అంటున్నారు. విడిది పాకాల.. వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల వలస పక్షుల విడిది ప్రాంతంగా నిలుస్తుంది. ఇక్కడ 160 రకాల స్థానిక పక్షులు, 50 రకాల వసల పక్షుల మనుగడ సాగిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు మున్నా, చెల్పూరి శ్యాంసుందర్, నాగేశ్వర్రావు పేర్కొన్నారు. పాకాలలో పక్షులకు అనువైన జీవవైవిధ్యం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉండడం వల్ల ఏటా 50 నుంచి 60 రకాల పక్షులు వలస వస్తాయని తెలిపారు. వలస పక్షుల సంరక్షణకు ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ పనిచేస్తోందని వివరించారు. వలస పక్షులు ఎంచుకునే ప్రదేశాలు.. సాధారణంగా వలస పక్షులు నీటి ఆధారిత ప్రాంతాలు, ఆహారం సమృద్ధిగా ఉండే చెరువులు, కుంటలు, మడుగులను ఎంచుకుంటాయి. ఆయా ప్రాంతాల సమీపంలోనే అవి నివసిస్తాయి. కొన్ని రకాల పక్షులు మాత్రం వ్యవసాయ మైదానాలను ఆధానం చేసుకుని సమీపంలోని చెట్లపై గూళ్లను నిర్మించుకుంటాయి. ఆహార అన్వేషణ వలస పక్షులు అన్ని దాదాపు మాంసాహారులే. కొంగ జాతికి చెందిన పక్షులు చేపలు, నత్తలు, కప్పలను ఎక్కువగా తింటాయి. బాతు జాతికి చెందిన రెడ్‌క్రెస్టెడ్ పోచర్డ్, నార్తర్న్ పిన్ టేయిల్స్, గ్రిబు, విజిలింగ్ డక్స్ లాంటివి చేపలు, ఎండ్రికాయలను, ఇతర పురుగులను ఆహారం తీసుకుంటాయి. కూట్సు లాంటి పక్షులు నాచును తీసుకుంటాయి. వలస పక్షులు సంతానోత్పత్తి కాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. వలస పక్షుల సంరక్షణకు కృషి వలస పక్షుల సంరక్షణ కోసం ఔల్స్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అటవీశాఖ అధికారుల సహకారంతో పాకాల వంటి ప్రాంతాల్లో పక్షుల విడిదికి అవసరమైన నిర్మాణాలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లతో బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. – చెల్పూరి శ్యాంసుందర్, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం : వరంగల్ రూరల్ జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా నిలిచిన పాకాలలో బుధవారం పర్యాటకుల సందడి నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పర్యాటకులు పాకాలకు తరలివచ్చి అందాలను వీక్షించారు. కట్టపై నుంచి నడుచుకుంటూ వెళుతూ పాకాల అందాలను ఆస్వాదించారు. లీకేజీ ద్వారా వెళ్తున్న నీటిలో జళకాళాడారు. పార్కులు చిన్నపిల్లలతో కలసి ఉత్సాహంగా గడిపారు. నిండుకుండలా కనిపిస్తున్న పాకాల సరస్సులో బోటింగ్ చేస్తూ మంచి అనుభూతిని పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్సై సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. -
పాకాల.. ప్రత్యేక ప్రణాళిక...
అన్ని రంగాల్లో అభివృద్ధికి కలెక్టర్ చర్యలు ఇరిగేషన్ రంగంలో రూ.8కోట్లతో ప్రతిపాదనలు ఎకో టూరిజంతో పాటు జింకల పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం కాటేజీలు, విశ్రాంతి గృహం,బోట్ యూనిట్ కూడా.. పాకాల మీదుగా కొత్త రోడ్డుకు రూ.3కోట్లు హన్మకొండ :వరంగల్ రూరల్ జిల్లాను వ్యవసాయపరంగా అగ్రభాగంలో నిలబెట్టడమే కాకుండా ‘రైస్ బౌల్’గా పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న పాకాల సరస్సు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రఖ్యాతి గాంచిన పాకాల సరస్సును నీటి పారుదల, పర్యాటకపరంగా అభివృద్ధి చేయడంతో పాటు పాకాల మీదుగా రోడ్డు రవాణా విషయంలోనూ మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా వరంగల్ రూరల్ జిల్లాకు సరికొత్త కళ రావడంతో పాటు 962 హెక్టార్ల విస్తీర్ణం కలిగి 3.2 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో 30వేల హెక్టార్లను సస్యశ్యామలం చేస్తున్న పాకాల సరస్సు మరింత ప్రఖ్యాతి చెందనుంది. సమీకృత అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మక పాకాల సరస్సును అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇరిగేషన్, టూరిజం, అటవీ శాఖలతో కలిపి పాకాలను సమీకృత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొంచారు. జిల్లా ఆవిర్భావం సమయంలోనే పాకాలను లక్నవరం సరస్సు స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పిన కలెక్టర్.. ఇందుకు సంబంధించి ఆచరణలో అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖతో కలిసి.. పాకాల సరస్సును పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక, అటవీ శాఖలను సమన్వయం చేస్తూ కలెక్టర్ ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగా పాకాలలో ఎకో టూరిజం అభివృద్ధికి రంగం సిద్ధం చేశారు. పర్యాటకంలో భాగంగా వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో వచ్చిన రూ.20లక్షలకు తోడు కలెక్టర్ ప్రత్యేకంగా మరో రూ.15లక్షలు కేటాయించి పాకాలా జింకల పార్క్ ఏర్పాటు కోసం మొత్తం రూ.35లక్షలు అటవీ శాఖకు మంజూరు ఇచ్చారు. మరోవైపు రూ.60లక్షలతో ఆరు కాటేజీలు, ఒక విశ్రాంతి గృహం, మరో బోట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. పెద్ద బోట్లు నడిపేందుకు వీలుగా బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు. అదేవిధంగా పర్యాటకుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు నర్సంపేట నుంచి పాకాల మీదుగా ఇల్లెందు వెళ్లే రోడ్డుకు రూ.3కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయి. రూ.8కోట్లతో స్లూ గేట్లు.. పర్యాటక రంగంగా పాకాల అభివృద్ధి చేస్తూనే వ్యవసాయ పరంగా మరింత తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. -
మత్తడికి చేరువలో పాకాల
28 ఫీట్లకు చేరిన నీటిమట్టం ఖానాపురం : జిల్లాలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన పాకాల సరస్సు నీటిమట్టం శుక్రవారం నాటికి 28 ఫీట్లకు చేరింది. ఎగువ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి పాకాల సరస్సులోకి నీరు చేరుతోంది. ఈ సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా మరో 2 ఫీట్ల నీరు చేరితో అలుగుపడే అవకాశం ఉంది. ఎగువప్రాంతం నుంచి వాగులు భారీగా పొంగుతుండటంతో సరస్సులోకి నీరు చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే శనివారం ఉదయం వరకు పాకాల సరస్సు అలుగుపడే అవకాశం ఉంది. -
19 ఫీట్లకు పాకాల నీటిమట్టం
మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం నాటికి 19 ఫీట్లకు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 30.3 అడుగులు. గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి వరద నీరు భారీగా చేరుతోంది. మరో ఫీటు మేర నీటిమట్టం పెరిగితే ఖరీఫ్‌లో పాకాల ఆయకట్టు కింద ఉన్న 30వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. – ఖానాపురం