పల్స్‌పోలియో కేంద్రం మార్పుపై వివాదం
పాలవలస (సరుబుజ్జిలి), న్యూస్‌లైన్ : పల్స్‌పోలియో కేంద్రం మార్పు వివాదాస్ప దమైంది. చివరకు అధికారులు గతంలో నిర్వహించిన చోటే తిరిగి ఏర్పాటు చేసి పిల్లలకు చుక్కల మందు వేయడంతో వివాదం ముగింది. దీనికి దారితీసిన కారణాలిలా ఉన్నాయి. పాలవలస కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆలవరణలో కొన్నెళ్లుగా పల్స్‌పోలి యో కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేసేవారు. అయితే ఆదివారం నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఈసారి సుమారు కిలోమీటరున్నర దూరంలోగల పాలవలస గ్రామానికి తరలించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేశారు. దీన్ని గ్రహించిన కాలనీ వాసులు వైద్య సిబ్బందిని అడ్డుకున్నారు. కేంద్రం ఎందుకు మార్పు చేశారని నిలదీశారు. దీంతో సిబ్బందికి, కాలనీ వాసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చేసుకుంది. పిల్లలను తీసుకొని దూరంగా ఉన్న పాలవలస గ్రామానికి ఎలా వెళ్లగలమని మహిళలు వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ఈలోగా సీనియర్ డాక్టర్ బి.వి.ఎస్.ప్రకాశరావు అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. కాలనీలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు చుక్కల మందు వేయడంతో ప్రజలు శాంతించారు.