paleru bypoll
-
'వాటి వల్లే టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలుస్తోంది'
ఖమ్మం: అధికార బలం, డబ్బు, ప్రలోభాలతో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఆరోపించారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గాన్నారు. ఈ సందరర్భంగా వారు మాట్లాడుతూ.. పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. కాంట్రాక్టర్లను, లిక్కర్ వ్యాపారులను ఖమ్మంలో దింపి కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డిని టీఆర్ఎస్ ఓడించే ప్రయత్నం చేస్తోందన్నారు. డబ్బు, మద్యం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో గెలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కేబినెట్ మొత్తం పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలోనే ఉందని నేతలు తెలిపారు. -
‘పాలేరు’ పరిధిలో రూ.5 లక్షలు పట్టివేత
ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బుధవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాలలో సుమారు రూ.5 లక్షల నగదును సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు కోదాడ-ఖమ్మం మార్గంలో వెంకటగిరి వద్ద వాహనాలను తనిఖీ చేయగా రూ.2.5 లక్షల నగదు పట్టుబడింది. అలాగే, వరంగల్-ఖమ్మం మార్గంలో కాకిరాజుగూడెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.5 లక్షల నగదు వెలుగు చూసింది. ఈ రెండు ఘటనల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
కేటీఆర్..కల్లుతాగిన కోతి: రేవంత్‌రెడ్డి
నేలకొండపల్లి: మంత్రి కేటీఆర్ కల్లుతాగిన కోతిలా ఎగురుతున్నాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి తరఫున బుధవారం పైనంపల్లి, చెరువుమాధారం గ్రామాల్లో రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ... టీడీపీని తోక పార్టీ అని మాట్లాడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ... ‘నీ అయ్య 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తోక పార్టీ అని గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తుమ్మల కుడి భుజం కావచ్చు గానీ, పాలేరు ప్రజలకు మాత్రం ఎడమ కాలి చెప్పుతో సమానమని అన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తల్లిలాంటి పార్టీని కాంట్రాక్టుల కోసం అమ్ముకుని.. ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. కన్న తల్లి, అక్కలాంటి సుచరితను ఎర్రటి ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. ఈ ఎన్నికలో నయవంచకులు తుమ్మల, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులైన సన్నాసులు తుమ్మల, తలసాని... మరో సన్నాసి కేసీఆర్‌తో జత కట్టారని అన్నారు. టీఆర్ఎస్ ఏమిచ్చినా తీసుకొని ఓటు మాత్రం కాంగ్రెస్ వేయాలని ఆయన సూచించారు. -
'కేటీఆర్ ఓ బచ్చా.. సమాధానం చెప్పను'
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ ఓ బచ్చా అని, ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పాలేరు ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తే సమాధానం చెబుతానని అన్నారు. అధికార దుర్వినియోగంతో పాలేరులో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పీసీసీ అధ్యక్ష ప్రదవికి రాజీనామా చేస్తారా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
విఫలమైన ‘భట్టి’ రాయబారం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయమై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చేసిన యత్నం ఫలించలేదు. టీఆర్ఎస్, టీడీపీలు తమ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. అయితే, అన్ని పార్టీలు ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో మద్దతివ్వటం సాధ్యం కాదని, తాము కూడా అభ్యర్థిని బరిలోకి దించుతామని ఆయన తేల్చినట్లు సమాచారం. దీంతో భట్టివిక్రమార్క వెనుదిరిగి వెళ్లిపోయారు.