కేటీఆర్..కల్లుతాగిన కోతి: రేవంత్‌రెడ్డి
నేలకొండపల్లి: మంత్రి కేటీఆర్ కల్లుతాగిన కోతిలా ఎగురుతున్నాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి తరఫున బుధవారం పైనంపల్లి, చెరువుమాధారం గ్రామాల్లో రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ... టీడీపీని తోక పార్టీ అని మాట్లాడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ... ‘నీ అయ్య 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తోక పార్టీ అని గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తుమ్మల కుడి భుజం కావచ్చు గానీ, పాలేరు ప్రజలకు మాత్రం ఎడమ కాలి చెప్పుతో సమానమని అన్నారు.
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తల్లిలాంటి పార్టీని కాంట్రాక్టుల కోసం అమ్ముకుని.. ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. కన్న తల్లి, అక్కలాంటి సుచరితను ఎర్రటి ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. ఈ ఎన్నికలో నయవంచకులు తుమ్మల, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులైన సన్నాసులు తుమ్మల, తలసాని... మరో సన్నాసి కేసీఆర్‌తో జత కట్టారని అన్నారు. టీఆర్‌ఎస్ ఏమిచ్చినా తీసుకొని ఓటు మాత్రం కాంగ్రెస్ వేయాలని ఆయన సూచించారు.